A9 న్యూస్ ఆంధ్రప్రదేశ్ బ్యూరో:
ప్రస్తుతం పని ఏదైనా.. ప్రభుత్వ పథకాలు ఏవైనా అధార్ కార్డు తప్పనిసరిగా మారింది. ఇలాంటి తరుణంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి లడ్డూ జారీ విధానంలో పలు మార్పులు తెచ్చింది. ఇకపై శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు లడ్డూ కావాలంటే ఆధార్ తప్పనిసరిగా చూపించాలని తెలిపింది. ఒక భక్తుడికి ఒక లడ్డూ మాత్రమే ఇచ్చేలా రూల్స్ మార్చింది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు దర్శన టికెట్‌పై ఒక్క లడ్డూను మాత్రమే ఇవ్వనున్నారు. అంతకుముందు దర్శన టోకెన్‌పై ఒక భక్తునికి రెండు లడ్డూలు ఇచ్చేవారు. అయితే, ఇప్పుడు ఆధార్ కార్డు చూపిస్తేనే మరో లడ్డూ అదనంగా ఇవ్వనుంది టీటీడీ. ఇక టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ శ్రీవారి లడ్డూ ప్రసాదం మిస్ యూజ్ అవుతుండటంతో పాటు దళారీల వ్యవస్థను అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఏఈఓ స్పష్టం చేశారు.
గురువారం నుంచి ఈ కొత్త విధానం అమలులోకి వస్తుందని ప్రకటించింది. ఈ ప్రకటన పెద్ద వివాదానికి దారి తీయగా.. ఆధార్ కార్డుతో లడ్డూ విక్రయాలు చేస్తున్న టీటీడీ తీరుపై భక్తులు విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో శ్రీవారి భక్తులు అడిగినన్ని లడ్డూలు టీటీడీ ఇస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు రద్దీ సమయంలో లడ్డూ విక్రయాలపై ఆంక్షలు విధించింది. కాగా, ప్రస్తుతం రోజూ దాదాపు 3.50 లక్షల లడ్డూలు టీటీడీ విక్రయిస్తోంది.