A9news





ఐఎఫ్టయు జాతీయ కార్యదర్శి టి శ్రీనివాస్ పిలుపు
నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 2025 మే 20 తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఐఎఫ్టియు జాతీయ ప్రధాన కార్యదర్శి టి. శ్రీనివాస్ కార్మికుల లోకానికి పిలుపునిచ్చారు. ఐఎఫ్టియు జిల్లా సదస్సు ఆర్మూర్ పట్టణంలోని IMA హాల్లో జిల్లా అధ్యక్షులు భూమన్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ సదస్సులో శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలకు భిన్నంగా కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి కార్మికులకు మరణ శాసనం విధించిందని ఆయన అన్నారు. కనీస వేతనం 26000 ప్రకటించి, పిఎఫ్, ఈఎస్ఐ చట్టాలను వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. 2016 అక్టోబర్ 26 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాన్ని వెంటనే దేశంలోని కార్మికులందరికీ అమలు చేయాలని ఆయన నరేంద్రమోడీ సర్కార్ కు గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయకపోవడం విచారకరమని ఆయన అన్నారు. దేశంలో 43 కోట్ల మంది సామాజిక చట్టాలకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది రెండు కోట్ల కొలువుల హామీ నీళ్ల మూటగా మారిందని ఆయన తెలిపారు. స్వదేశీ జపం చేసిన నరేంద్ర మోడీ గారు కుటీర పరిశ్రమలను, జనపనార, బీడీ పరిశ్రమను దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రత్యామ్నాయ పని చూపకుండా భీడి పరిశ్రమపై ఆంక్షలు విధించడం దుర్మార్గమని ఆయన అన్నారు. హమాలి, భవన నిర్మాణ కార్మికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి,
సమస్యలను పరిష్కరించాలని ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం పంచాయతీ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని ఆయన కోరారు. కనీస పెన్షన్ కేంద్ర ప్రభుత్వం పదివేల రూపాయలు ప్రకటించి అమలుకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని ఆపి, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు.నిత్యవసర సరుకుల ధరలను నియంత్రించి, సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉంచాలని ఆయన కోరారు. రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను రద్దుచేసి భారత వ్యవసాయ రంగాన్ని రక్షించే చర్యలు చేపట్టాలని ఆయన మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సదస్సులో ఐఎఫ్టియు నిజాంబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు, ఉపాధ్యక్షులు సూర్య శివాజీ, సహాయ కార్యదర్శి శివకుమార్, జేపీ గంగాధర్, మాట్లాడారు. ఈ సదస్సులో
జిల్లా ఉపాధ్యక్షులు & నాయకులు మల్లికార్జున్, బాలయ్య, భారతి, లక్ష్మి, దాల్మల్కి పోశెట్టి, శ్యామ్సన్, గంగాధర్, పద్మ తదితరులు పాల్గొన్నారు.