వి.డి.సి ల దౌర్జన్యాలపై ఐ.ఎల్.పి.ఎ(ILPA) న్యాయ పోరాటం.
నిజామాబాద్ జిల్లా తాళ్ళరాంపూర్ , మరియు జక్రాన్పల్లి గ్రామాల్లో నిజ-నిర్ధారణ చేసిన ఐ.ఎల్.పి.ఎ బృందం.
VDC ల వ్యతిరేకంగా.. బాధితులకు అండగా నిలుస్తామన్న ILPA రాష్ట్ర అధ్యక్షులు అడ్వకేట్ పొన్నం దేవరాజ్ గౌడ్. గ్రామ అభివృద్ధి కమిటీల పేరుతో దౌర్జన్యాలకు పాల్పడుతున్న వి.డి.సి ల దౌర్జన్యాలపై కోర్టుల్లో కేసులు దాఖలు చేసి ఐ.ఎల్.పి.ఎ న్యాయ పోరాటం చేస్తుందని ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ బృంద నాయకులు పొన్నం దేవరాజ్ గౌడ్, శాంసన్, వి.యం. కృష్ణారెడ్డి , సాయిని నరేందర్, అనంత ఆంజనేయులు గౌడ్ , దయ్య రాజారామ్, సుమలత, కందుకాల సురేష్, వెంకటేష్ ప్రసాద్ లు తెలిపారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండల కేంద్రంలో భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బట్టు శ్రీధర్ , BMM రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేష్ రక్షక్ అధ్యక్షతన ఆదివారం జరిగిన నిజ నిర్ధారణ సమావేశంలో వారు పాల్గొని బాధిత ప్రజల నుండి వివరాలు తెలుసుకొని మాట్లాడారు. జక్రాన్ పల్లి మండల కేంద్రంలో చాకలి కులస్తులు, ఎస్సీ కుల బాధ్యులు వి.డి.సి ల దౌర్జన్యాలను వివరించారు. చాకలి కుల కమ్యూనిటీ అభివృద్ధి కోసం 1978 లో సాగుకు పనికిరాని గుట్టలు, రాళ్ళు కలిగిన 28 గుంటల భూమిని ప్రభుత్వం కేటాయించిందని అట్టి భూమిని కాపాడుకోవడానికి గత 10 ఏండ్ల నుండి పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుందని, గ్రామంలోని ఆధిపత్య వి.డి.సి నాయకులు బెదిరించి, దాడులు చేసి 18 గుంటల భూమిని బలవంతంగా లాక్కున్నారని తెలిపారు. వి.డి.సి నాయకులు గత సంవత్సరం కాలంగా దాడులు తీవ్రం చేసారని, గత ఆరు నెలల క్రితం నిర్మించుకున్న కమ్యూనిటీ హాల్ ను దౌర్జన్యంగా కూల్చి వేశారని తెలిపారు. గత 10 సంవత్సరాల క్రితం గ్రామంలోనున్న మొత్తం చాకలి వృత్తిని బహిష్కరించి 10 లక్షల రూపాయల జరిమాన కట్టాలని ఆదేశాలు జారీ చేసారని, గ్రామంలోని దుకాణాల్లో కూడా సరుకులు కొనకుండా చేసి గ్రామంలో ఎలాంటి కూలీ పనికి పిలవకుండా, శుభ, అశుభ కార్యాలకు ఎవరు హాజరవకుండా మొత్తం గ్రామ బహిష్కరణ చేసి ఆర్థికంగా, సామాజికంగా అణచివేస్తున్నారని వాపోయారు. వి.డి.సి ల దౌర్జన్యాలపై పోలీసులకు ఎన్ని పిర్యాదులు ఇచ్చినా, కోర్టుల్లో కేసులు వేసినా, కోర్టులు ఆదేశాలు జారీ చేసినా వారి అకృత్యాలు ఆగడం లేదని అన్నారు. జనబలం కలిగిన ఆధిపత్య కులాల దౌర్జన్యాలకు చిన్న కులాల వారు ఎన్నో బాధలు పడుతున్నారని, వి.డి.సి పేరున ఆధిపత్య కులాల వారు ప్రధాన పదవుల్లో తిష్ఠ వేసి ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారని అన్నారు. పట్టుదలతో కింద కులాల వారు ప్రధాన బాధ్యతల్లోకి వస్తే వారికి సహాయక నిరాకరణ చేస్తున్నారని, అప్పుల పాలయ్యే విధంగా చేస్తారని, వి.డి.సి లు సంవత్చరానికి 20 నుండి 30 లక్షల రూపాయలు వసూలు చేసి వారి ఇష్టానికి ఖర్చు పెట్టుకొని జల్సాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారని, పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసినా ఎఫ్ ఐ ఆర్ నమోదు అయినా పలితం శూన్యమని, హై కోర్టులో రిట్ వేసి అదేశాలు తీసుకొచ్చిన కూడా పలితం శూన్యమని అన్నారు. పోలీసులు ప్రకటనలకే పరిమితమవుతున్నాని, స్థానిక ఎమ్మెల్యేలు కూడా దోపిడీ విడిసి లకే అండగా నిలిచి ప్రశ్నించే వారిని బెదిరిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఐ.ఎల్.పి.ఎ బృంద నాయకులు మాట్లాడుతూ వి డి సి దుర్మార్గాలకు వైకతిరేకంగా పోరాడాలని, జనబలం కలిగిన కులాల ఆధిపత్యం పోవడానికి న్యాయ పోరాటం చేయాల్సిన అవసరముందని అన్నారు. ప్రశ్నించే వారిపై దాడులు జరిగినప్పుడు నమోదు చేసిన కేసులను ఎదుర్కునే పేరుతో వి డి సి నాయకులు లక్షలు, లక్షలు స్వాహా చేయడం దుర్మార్గమని అన్నారు. ఏక కాలంలో సామాజిక, రాజకీయ, న్యాయ పోరాటం చేయాలని, ప్రజా సంఘాల నాయకులతో గ్రామాల్లో సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యం చేసినప్పుడు ప్రజలు ధైర్యంగా ముందుకు వస్తె ఇలాంటి అసాంఘిక ఆధిపత్య శక్తులను కట్టడి చేసి వి.డి.సి లను నిర్మూలన చేయవచ్చని అన్నారు. జనబలం తక్కువగా ఉన్న కులాల్లో ఆర్థిక శక్తి లేకపోవడం వల్ల, ఐక్యత లేకపోవడం వల్ల వి.డి.సి ల దౌర్జన్యాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని, వి.డి.సి లు రాజ్యంగేతర శక్తిగా తయారై రాజ్యాంగ హక్కులను పక్కకు నెట్టి అక్రమ పాలన కొనసాగుస్తుంటే స్థానిక పాలకులు, ఎమ్మెల్యేలు చోద్యం చూస్తున్నారని అన్నారు. ప్రతి కులం నుండి అన్ని రకాలుగా వసూళ్లు చేస్తున్నారని, యాదవుల దగ్గర గొర్రెలను, బెస్త వాళ్ళ దగ్గర తక్కువ రేటుకు చేపలు, గౌండ్ల కులం వారి దగ్గర నుండి తక్కువ రేటుకే సరుకులు తీసుకోవడమే కాకుండా వృత్తి కులాల నుండి పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేసే హక్కు వారికి ఎక్కడిదని అన్నారు. బ్రాందీ షాపుల వద్ద, బెల్టు షాపుల వద్ద లక్షల రూపాయలు వసూలు చేసి అధిక ధరలకు మద్యం అమ్మకాలకు అండగా ఉంటున్నారని ఆరోపించారు. వి.డి.సి ల దౌర్జన్యాలకు భూమి ప్రధాన కారణంగా నిలుస్తుందని, గ్రామాల్లో ఉండబడిన ప్రభుత్వ భూమిపై గ్రామ పంచాయతీలకు అధికారముంటుందని, వి.డి.సి లు ఆధిపత్యంతో గ్రామంలోని ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని, గతంలో పేదలకు కేటాయించిన భూములను సైతం వి.డి.సి నాయకులు గ్రామ అభివృద్ధి పేరుతో లాక్కుంటూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ నిర్వహించిన నిజ నిర్ధారణ కమిటీ ముందు న్యాయవాది జగడం రాజశేఖర్, రజక సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు గూపన్ పల్లి శంకర్, జక్రాన్ పల్లి రజక సంఘం గ్రామ అధ్యక్షులు జగడం సురేష్, గ్రామ రజక నాయకులు నడికుడ శ్యామల, నడికుడ పద్మ, జగడం లక్ష్మీ, దుబ్బాక చిన్నుబాయి, జగడం మోహన్, జగడం అభిమన్యులు, జగడం భూషణ్, చిక్కల శ్రవణ్ కుమార్, జగడం అర్జున్, జగడం సదాశివుడు, నడికుడ వెంకటేష్, నడికుడ తిరుమలేష్, నడికుడ నవీన్, జగడం భాస్కర్, జగడం పవన్, జగడం తరుణ్, దుబ్బాక అబ్బన్న, సుంకరి స్రవంతి, సుంకరి లింగం తదితరులు పాల్గొన్నారు