గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఐఏఎస్ స్మితా సబర్వాల్ విచారణకు హాజరైయ్యారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి సంబంధించిన ఏఐ ఫొటోను తన ఎక్స్ ఖాతాలో రీపోస్ట్ చేయడంతో పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె విచారణకు హాజరై పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. 2వేల మంది అదే పోస్టును షేర్ చేశారని, వారందరిపై కూడా చర్యలు తీసుకుంటారా? అని స్మితా సబర్వాల్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అలా జరగకపోతే టార్గెట్ చేసినట్లువుతుందని, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించినట్లవుతుందని స్మితా సబర్వాల్ పేర్కొన్నారు.
కాగా, కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి పెద్దఎత్తున వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. 400 ఎకరాల భూముల్లో చెట్లు తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నించగా.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులు అడ్డుకోవడంతో ఉద్రక్తతలు చోటుచేసుకున్నాయి. దీనిపై సోషల్ మీడియా వేదికగా దీనిపై పెద్దఎత్తున చర్చ నడుస్తోంది.
చెట్లు తొలగింపునకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై తెలంగాణ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ఏఐ ఫొటోలు సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. ఈ మేరకు అలాంటి వారిపై విచారణ జరిపి కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఫేక్ ఫొటోలు రీపోస్టు చేశారంటూ పోలీసులు ఆమెకు నోటీసులు అందించారు..