అంగన్ వాడీ సెంటర్లలో ఆశా కార్యకర్తలు పనిచేయాలని ఓ వైద్య శాఖ అధికారి బెదిరింపులకు పాల్పడటం సరికాదని. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి నన్నేసాబ్ అన్నారు. గురువారం రుద్రూర్ ఎంపీడీవో కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నన్నేసాబ్ మాట్లాడుతూ, ఆశా కార్యకర్తలు అంగన్ వాడీ సెంటర్లలో పనిచేయకపోతే ఉద్యోగాలను తొలగిస్తామని వైద్యశాఖ అధికారి బెదిరింపులకు పాల్పడుతుందని ఆరోపించారు. అంగన్ వాడీ ఉద్యోగులు సమ్మె చేస్తుంటే తాము సెంటర్లను నడిపి తోటి కార్మికుల పొట్ట కొట్టలేమని ఎంపీడీవో బాలగంగాధర్ కు ఆశా కార్యకర్తలు చెప్పారు. అంగన్ వాడీ ఉద్యోగుల నిరవధిక సమ్మెకు ఆశా కార్యకర్తల యూనియన్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. ప్రభుత్వం, అధికారులు ఆశా కార్యకర్తలను బెదిరింపులకు పాల్పడితే పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు యేషాల గంగాధర్, ఆశా యూనియన్ అధ్యక్షురాలు వాణీ, కార్యదర్శి భూలక్ష్మి, ప్రవళిక, పుష్ప, నిర్మల తదితరులు పాల్గొన్నారు.