కొలంబో: ఆసియాక్‌పలోనే అత్యంత ఆసక్తికర మ్యాచ్ కోసం కోట్లాది ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న వేళ.. పసందైన వినోదం అందించేందుకు భారత్, పాకిస్థాన్ జట్లు మరోసారి సిద్ధమయ్యాయి. అయితే వరుణుడు కూడా మళ్లీ దాడి చేసేందుకు ఎదురుచూస్తున్నాడు. గ్రూప్ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షంతో రద్దయిన విషయం తెలిసిందే. ఈసారి సూపర్-4లో భాగంగా ఎవరి సత్తా ఏంటో తేల్చుకునేందుకు ఆదివారం ఇరుజట్లు బరిలోకి దిగుతున్నాయి. కానీ ఈ మ్యాచ్‌ను కూడా వరుణుడు ఇబ్బంది పెట్టనున్నాడనే సమాచారం క్రికెట్ ప్రేమికులకు ఆందోళన కలిగించేదే. అయితే సోమవారం ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉండడం కాస్త ఊరటనిచ్చే విషయం. కానీ కొలంబోలో ఈ వారమంతా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. పాక్ జట్టు సూపర్-4లో ఇప్పటికే బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి రెండు పాయింట్లతో ఉంది. అటు భారత్‌కు సూపర్-4లో ఇదే తొలి మ్యాచ్. ప్రత్యర్థితో పోలిస్తే భారత జట్టు పలు అంశాల్లో మెరుగుపడాల్సి ఉంది. ముఖ్యంగా నేపాల్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్ మరీ నాసిరకంగా ఉన్నట్టు స్వయానా కెప్టెన్ రోహిత్ అంగీకరించాడు. అలాగే పాక్ పేస్ త్రయాన్ని ఎదుర్కొని భారీ స్కోరు సాధించాలంటే భారత బ్యాటింగ్ ఆర్డర్ సమష్ఠిగా రాణించాలి. పాక్‌కు చివరి ఐదు మ్యాచ్‌ల్లో ఓటమనేదే లేదు. స్టార్ ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు కలిసివచ్చే విషయం.
రాహుల్ లేక ఇషాన్?: ఈ మ్యాచ్‌కు జట్టులో కేఎల్ రాహుల్‌తో పాటు పేసర్ బుమ్రా కూడా అందుబాటులో ఉండనున్నారు. ఇప్పుడు వీరిని ఆడించేందుకు ఎవరిని తప్పించాలనేది కెప్టెన్, కోచ్‌లకు సవాల్‌గా మారింది. మార్చి నుంచి రాహుల్ వన్డేలు ఆడలేదు. అతడి గైర్హాజరీలో జట్టు శాంసన్, ఇషాన్, సూర్యకుమార్‌లను పరీక్షించింది. వీరిలో ఇషాన్ మాత్రమే ఆకట్టుకున్నాడు. చివరి 4 వన్డేల్లో అతను 52, 55, 77, 82 స్కోర్లతో అదరగొట్టాడు. దీంతో ఇషాన్‌ను పక్కనబెట్టకపోవచ్చు. పైగా ఇతను లెఫ్టాండర్ కావడం జట్టుకు అదనపు బలం. కానీ నెంబర్ 5లో రాహుల్ ఆడిన 18 మ్యాచ్‌ల్లో 742 పరుగులతో సత్తా చాటుకున్నాడు. దీంతో ఇద్దరి విషయంలో ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. బుమ్రా గతేడాది జూలై నుంచి వన్డేల్లో బౌలింగే వేయలేదు. పాక్‌తో ఆరంభ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్ మాత్రమే జరగగా.. నేపాల్ మ్యాచ్‌లో అతను బరిలోకి దిగలేదు. ఇప్పుడు తుది జట్టులో బుమ్రా ఉండాలంటే శార్దూల్‌పై వేటు పడే చాన్సుంది. అతడు పరుగులు ధారాళంగా ఇవ్వడంతో పాటు బ్యాటింగ్‌లోనూ విఫలమయ్యాడు. ఒకవేళ పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తే షమి స్థానంలో అక్షర్‌ను ఆడించి ముగ్గురు స్పిన్నర్లతో వెళ్లినా ఆశ్చర్యం లేదు. బ్యాటింగ్ విభాగంలో నేపాల్‌పై ఓపెనర్లు రోహిత్, గిల్ ఇతరులకు అవకాశమివ్వకుండా మ్యాచ్‌ను ముగించారు. ఈ కీలక మ్యాచ్‌లోనూ ఇదే రీతిన రాణిస్తే అభిమానులకు పండగే. ప్రేమదాస స్టేడియంలో కోహ్లీకి మంచి రికార్డు ఉంది. శ్రేయాస్ కూడా సత్తా చూపాల్సి ఉంది.
జోష్‌లో పాక్: ఆసియాక్‌పలో పాక్ పూర్తిగా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ప్రత్యర్థి జట్లను ఆలౌట్ చేసింది. వారి బౌలర్ల ఫామ్ ఎలా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పేస్ త్రయం షహీన్, నసీమ్, వహాబ్ పిడుగుల్లాంటి బంతులతో బెంబేలెత్తిస్తున్నారు. పవర్‌ప్లేలో షహీన్‌ను ఎదుర్కోవడమే పెద్ద సవాల్‌గా మారుతోంది. అలాగే రోహిత్, కోహ్లీలను పదేపదే ఇబ్బందిపెడుతుండడం పాక్‌కు లాభిస్తోంది. బంగ్లాతో మ్యాచ్‌లో గాయపడిన నసీమ్ కోలుకున్నాడు. బ్యాటింగ్‌లో కెప్టెన్ బాబర్, ఇమామ్, రిజ్వాన్, ఇఫ్తికార్ భీకర ఫామ్‌లో ఉన్నారు. పైగా ఇటీవలి కాలంలో తమ జట్టు శ్రీలంకలో విరివిగా ఆడడంతో భారత్‌కన్నా తమకే ఎక్కువ విజయావకాశాలున్నాయని బాబర్ చెబుతున్నాడు.
తుది జట్లు
భారత్ (అంచనా): గిల్, రోహిత్ (కెప్టెన్), విరాట్, శ్రేయాస్, రాహుల్/ఇషాన్, హార్దిక్, జడేజా, శార్దూల్/షమి, కుల్దీప్, బుమ్రా, సిరాజ్.
పాకిస్థాన్: ఫఖర్ జమాన్, ఇమామ్, బాబర్ (కెప్టెన్), రిజ్వాన్, ఆఘా సల్మాన్, ఇఫ్తికార్, షాదాబ్, అష్రాఫ్, షహీన్, నసీమ్, హారిస్.
పిచ్, వాతావరణం
ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణంతో 90 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. మ్యాచ్ రిజర్వ్‌డేకు వెళ్లవచ్చు. అయితే సోమవారం పరిస్థితి కూడా ఇలాగే ఉండనున్నట్టు అంచనా. అలాగే ఇక్కడి పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. దీంతో భారీ స్కోర్లు కష్టమే.