కొలంబో: ఆసియాకప్ 2023లో ఇప్పటికే ఫైనల్ చేరిన టీమిండియా.. మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. సూపర్-4లో భాగంగా బంగ్లాదేశ్‌తో శుక్రవారం అమీ తుమీ తేల్చుకోనుంది. ఫైనల్‌కు ముందు రిహార్సల్‌గా ఈ మ్యాచ్‌ను ఉపయోగించుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచినా.. ఓడినా టీమిండియాకు వచ్చే నష్టం ఏం లేదు.

 

ఫైనల్ ముందు ఈ మ్యాచ్‌ను ప్రాక్టీస్‌గా వాడుకోనుంది. వరుస విజయాలతో ఫైనల్ చేరిన టీమిండియా అదే జోరులో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి టైటిల్ బరిలోకి దిగాలని భావిస్తోంది. నామమాత్రపు మ్యాచ్ కావడంతో తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది. బెంచ్ ఆటగాళ్లు అయిన సూర్యకుమార్ యాదవ్, మహమ్మద్ షమీలను ఆడించే అవకాశం ఉంది.

వన్డే ప్రపంచకప్‌ నేపథ్యంలో తుది జట్టులోకి తీసుకొని వారి సత్తాను పరీక్షించనున్నారు. టీమ్ రిథమ్ మిస్సవ్వద్దని భావిస్తే ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగనున్నారు. సూర్య కుమార్ యాదవ్, మహమ్మద్ షమీని తీసుకోవాలని భావిస్తే ఇషాన్ కిషన్, మహమ్మద్ సిరాజ్ బెంచ్‌కే పరిమితం కానున్నారు.

ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. అదిరిపోయే ఆరంభాలను అందిస్తున్నారు. శ్రీలంకతో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ విఫలమైనా.. అతను మంచి టచ్‌లోనే ఉన్నారు. 5 నెలల సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి వచ్చిన కేఎల్ రాహుల్.. అటు బ్యాటింగ్‌తో పాటు ఇటు కీపింగ్‌లోనూ దుమ్మురేపుతున్నాడు. అతను సూపర్ ఫామ్‌లో ఉండటంతో శ్రేయస్ అయ్యర్‌కు దారులు మూసుకుపోయాయి.

పైగా అతను వెన్ను నొప్పితో బాధపడుతుండటంతో బెంచ్‌కే పరిమితం కానున్నాడు. ఫిట్‌గా ఉంటే మాత్రం సూర్యకుమార్ కన్నా ముందు అతనికే ప్రాధాన్యత లభించనుంది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు కూడా రెస్ట్ ఇచ్చే చాన్స్ ఉంది. ఎక్స్‌ట్రా బౌలర్‌గా స్పిన్నరా? పేసరా? అనేది మ్యాచ్ రోజు డిసైడ్ చేయనున్నారు

స్పిన్నర్ కావాలనుకుంటే అక్షర్ పటేల్, పేసర్‌ను ఆడించాలనుకుంటే శార్దూల్ ఠాకూర్ తుది జట్టులోకి రానున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ కొనసాగనుండగా.. జస్‌ప్రీత్ బుమ్రా పేస్ విభాగాన్ని లీడ్ చేయనున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *