రాజ్‌ఘట్‌లో మహాత్ముడికి నివాళులర్పించిన జీ20 దేశాధినేతలు, ప్రతినిధులు
జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం దిల్లీకి వచ్చిన దేశాధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు రాజ్‌ఘట్‌ను సందర్శించి, మహాత్మాగాంధీకి నివాళి అర్పించారు.
రాజ్‌ఘాట్‌కు వచ్చిన జీ20 నేతలు, అధికారులకు ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం పలికారు.
వారికి ఆహ్వానం పలికే ప్రదేశంలో వెనుక వైపు సబర్మతి ఆశ్రమం ఫొటోను ఉంచారు. ఈ ఫొటో గురించి అతిథులకు ప్రధాని మోదీ వివరించారు.
మహాత్మాగాంధీ సమాధి వద్ద నేతలు నివాళులర్పించిన తర్వాత, అక్కడ నుంచి నేరుగా భారత మండపంలోని ‘లీడర్స్ లాంజ్’కి వెళ్తారు.
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్ ఆదివారం ఉదయం అక్షర్‌ధామ్ టెంపుల్‌ని సందర్శించి పూజలు చేశారు.
రిషి సునక్ రాకతో అక్షర్‌ధామ్ చుట్టు పక్కల భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
జీ 20 సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన సునక్… తన రెండు రోజుల పర్యటనలో భాగంగా అక్షర్‌ధామ్ టెంపుల్‌ను సందర్శించాలని అంతకుముందే నిర్ణయించుకున్నారు.
అక్షర్ ధామ్ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత, అక్కడి నుంచి రాజ్‌ఘట్‌కి వెళ్లి మహాత్మా గాంధీకి నివాళి అర్పించారు.
ప్రధానమంత్రి మోదీ అంటే చాలా గౌరవం ఉందని.. జీ 20 సదస్సును విజయవంతం చేసేందుకు తన వంతు పాత్ర పోషిస్తానని ఆయన ఏఎన్ఐ వార్తా సంస్థతో అన్నారు.
“నేను హిందువుని. హిందువులాగే పెరిగాను. అది నాకు చాలా సంతోషం. నేను అక్షర్‌ధామ్‌లోని స్వామి నారాయణ్ మందిర్ చూడాలనుకుంటున్నాను. నేనిక్కడ మరో రెండు రోజులు ఉంటాను. మనం మొన్ననే రక్షాబంధన్ జరుపుకున్నాం. నా సోదరి, తోబుట్టువుల నుంచి రాఖీలు వచ్చాయి” అని సునక్ చెప్పారు.
“మేం బ్రిటన్ ప్రధాని సందర్శన కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. మయూర్ ద్వార్ అని పిలిచే ప్రధాన ద్వారం వద్ద సునక్ దంపతులకు మేము స్వాగతం పలుకుతాం. వాళ్లు హారతి తీసుకునేట్లయితే అది కూడా సిద్ధం చేశాం.
ఆలయంలో రాధాకృష్ణులు, సీతారాములు, లక్ష్మీ నారాయణులు, పార్వతీ పరమేశ్వరులు, గణపతి విగ్రహాలు ఉన్నాయి. వాళ్లు పూజ చేస్తామంటే అందుకు కూడా ఏర్పాట్లు చేస్తాం’’ అని సునక్ ఆలయ సందర్శనకు రావడానికి ముందు అక్షర్‌ధామ్ అధికారి జ్యోతింద్ర దవే ఏఎన్ఐతో చెప్పారు.