ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణం ఆరోపణలపై ఏపీ సీఐడీ అరెస్టు చేసింది.
సీఆర్పీసీ సెక్షన్ 50(1)(2) కింద నోటీసు ఇచ్చి అరెస్టు చేస్తున్నట్లు సీఐడీ పోలీసులు ప్రకటించారు.
చంద్రబాబుపై 120 (బి) 166, 167, 418,420, 465,468, 471, 409, 201, 109 రెడ్ విత్ 34, 37 ఐపీసీ, ఇంకా 1988 అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 12, 13(2) రెడ్ విత్ 13(1)(సి),(డి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
దీంతో చంద్రబాబుపై పెట్టిన సెక్షన్లు ఏమిటి.? అవి ఏం చెబుతున్నాయనేది చర్చనీయాంశంగా మారింది.
ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణతో బీబీసీ మాట్లాడింది. ఈ సెక్షన్లను ఏ సందర్భంలో పేర్కొంటారు, అవి రుజువైతే శిక్షలు ఏంటి అన్న విషయాన్ని ఆయన వివరించారు.
సెక్షన్లు ఏంటి, తీవ్రత ఎంత?
‘‘ఇవి నాన్ బెయిలబుల్ సెక్షన్లు అని చెప్పే సీఐడీ నోటీసులు జారీ చేసింది. బెయిల్ రాకూడదనే రీతిలో కేసులు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇందులో సెక్షన్లు, తీవ్రతను బట్టి శిక్షలు ఉంటాయి’’ అని లక్ష్మీనారాయణ చెప్పారు.
చంద్రబాబుపై నమోదు చేసిన సెక్షన్లు, ఆయా సెక్షన్ల కింద నేరం రుజువైతే విధించే శిక్షల గురించి లక్ష్మీనారాయణ వివరించారు.
120(బి): ఇది నేరపూరిత కుట్ర కిందకు వస్తుంది. ఎవరైనా వ్యక్తితో కలిసి కుట్ర చేయడం. ఇందులో గరిష్ఠంగా జీవిత ఖైదు లేదా రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు కఠిన కారాగార శిక్ష విధించే అవకాశం ఉంటుంది.
ఇతర నేరాలు కుట్రలో భాగమైతే జైలు శిక్ష విధించవచ్చు. ఈ సందర్భంలో ఆరు నెలల వరకు శిక్ష, లేదా జరిమానా, లేదా రెండూ విధించే అవకాశం ఉంది.
166: ఎవరైనా ఒక వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఉంటూ చట్ట వ్యతిరేకంగా సంస్థ, లేదా వ్యక్తికి నష్టం చేకూర్చినప్పుడు ఈ కేసు పెడతారు.
ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే ఏడాది వరకు జైలుశిక్ష, లేదా జరిమానా, లేదా రెండూ విధించే అవకాశం ఉంది.
167: ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి అధికారిక పత్రాలు లేదా ఎలక్ట్రానిక్ పత్రాలను తారుమారు చేయడం, నకిలీ పత్రాలు తయారు చేయడం ద్వారా వ్యక్తి లేదా సంస్థకు నష్టం చేయడం. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే మూడేళ్ల జైలు, లేదా జరిమానా, లేదా రెండూ విధించే అవకాశం ఉంది.
418: మోసానికి సంబంధించిన సెక్షన్ ఇది. చట్టానికి కట్టుబడి ఉన్న వ్యక్తి, ఒక ఒప్పందం ద్వారా నేరస్థులను రక్షించడానికి మోసానికి పాల్పడడం. ఈ సెక్షన్ కింద మూడేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు.
420: మోసం చేయడం, ఏదైనా విలువైన వస్తువు లేదా ఇతరుల ఆస్తిని లాక్కోవడం, నిజాయితీ లేకుండా వ్యవహరించడం మొదలైన వాటికి పాల్పడే వ్యక్తి సెక్షన్ కింద శిక్షార్హులు. ఈ నేరం రుజువైతే కింద గరిష్ఠంగా ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు.
465: ఇది ఫోర్జరీకి సంబంధించినది. బెయిలబుల్ కిందకు వస్తుంది. రెండేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే వీలుంది.
468: నకిలీ పత్రం లేదా ఎలక్ట్రానిక్ పత్రం మోసానికి ఉపయోగించాలనే ఉద్దేశంతో ఫోర్జరీకి పాల్పడటం. దీని కింద ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే వీలుంది.
471: నకిలీ పత్రం అని తెలిసి కూడా మోసపూరితంగా సదరు పత్రాన్ని వినియోగించడంపై ఈ సెక్షన్ వాడతారు. ఇది బెయిలబుల్ సెక్షన్. ఈ విషయంలో మోసాన్ని బట్టి శిక్షలు విధిస్తారు.
409: ఎవరైనా ఆస్తిని ఏ విధంగా అప్పగించినా, లేదా ప్రభుత్వ ఉద్యోగిగా, లేదా బ్యాంకర్, వ్యాపారి నిజాయితీగా ఆ నమ్మకాన్ని ఉల్లంఘించడం కిందకు వస్తుంది. ఈ విషయంలో నేరం రుజువైతే జీవిత ఖైదు లేదా పదేళ్ల వరకు జైలు శిక్ష, లేదా జరిమానా విధించే వీలుంది.
201: నేరానికి సంబంధించిన సాక్ష్యాన్ని తారుమారు చేయడం కింద ఈ కేసు పెడతారు. ఇందులో తీవ్రతను బట్టి ఏడేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధించే వీలుంది.
109 రెడ్ విత్ 34, 37: ఏదైనా నేరాన్ని ఉద్దేశపూర్వకంగా చేయడం లేదా ప్రేరేపించడం.
అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 12, 13 ( 2) రెడ్ విత్ 13(1)(సి),(డి) : ఇవన్నీ అవినీతి నిరోధక సెక్షన్లు. వీటిల్లో నేర తీవ్రత ఆధారంగా తగిన శిక్షలు ఉంటాయని న్యాయవాది లక్ష్మీనారాయణ బీబీసీకి చెప్పారు.