నిజామాబాద్, ఆగస్టు 06 :
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వే స్టేషన్లలో చేపట్టనున్న పునరాభివృద్ది పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రిమోట్ సిస్టం ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ పథకం కింద మొదటి విడతలోనే నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఎంపికవగా, ఆధునికీకరణ పనుల కోసం 53.3 కోట్ల రూపాయలను వెచ్చించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ఏకకాలంలో రిమోట్ విధానం ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ డీ.ఆర్.ఎం లోకేష్ విష్ణోయి, సీనియర్ డీ.సీ.ఎం బాలాజీ కిరణ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా శంకుస్థాపన కార్యక్రమాన్ని వీక్షించి, ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ల ప్రసంగాన్ని ఆసక్తిగా ఆలకించారు.
రైల్వే మంత్రిత్వ శాఖ రూపొందించిన అమృత్ భారత్ స్టేషన్ స్కీం లో భాగంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం, దీర్ఘకాలిక దృష్టితో నిరంతర ప్రాతిపదికన అభివృద్ధిని సాధించాలనే లక్ష్యంతో నిర్దేశిత పనులు చేపట్టనున్నారు. అత్యాధునిక వసతులను అందుబాటులోకి తెస్తూ, ప్రయాణీకులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నామని రైల్వే అధికారులు తెలిపారు. మెరుగైన లైటింగ్, సర్క్యులేటింగ్ ప్రాంతం అందుబాటులోకి తేవడం, అప్‌గ్రేడ్ చేసిన పార్కింగ్ స్థలం, దివ్యాంగులకు అనుకూలమైన మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఎనర్జీని ఉపయోగించడం ద్వారా పర్యావరణ అనుకూల, సదుపాయాలు, ఆకట్టుకునేలా స్టేషన్ డిజైన్ తదితర పనులతో కూడిన ప్రతిపాదనలు రూపొందించారు. ఈ పనులతో ప్రయాణికులకు ఎంతో మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని హైదరాబాద్ డివిజన్ డీఆర్ఎం లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. అధునాతన వసతులు, ఆహ్లాదకరమైన వాతావరణం ప్రయాణికులకు చక్కటి అనుభూతిని అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే డీ.ఈ.ఎన్ శశాంక్, సీనియర్ డీ.ఎస్.సి అనూప్ కుమార్ శుక్లా, వివిధ శాఖలకు చెందిన జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిరా, ట్రాన్స్ కో ఎస్.ఈ రవీందర్, జిల్లా కార్మిక శాఖ అధికారి యోహాన్, జిల్లా సంక్షేమ అధికారిణి రసూల్ బీ, నాయకులు, స్థానికులు, పురప్రముఖులు, ప్రయాణికులు, రైల్వే అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.