టీ20ల్లో వెస్టిండీస్ ఎంత బలమైన జట్టో మరోసారి చూపించింది. తొలి టీ20లో భారత్ 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కీలక సమయంలో వరుసగా వికెట్లు కోల్పోయి, మ్యాచ్‌ను చేజార్చుకుంది. అరంగేట్ర ఆటగాడు తిలక్ వర్మ (39) మినహా మిగతా ప్లేయర్లు విఫలమయ్యారు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులకు పరిమితమైంది. 5 మ్యాచుల సిరీస్‌లో వెస్టిండీస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
భారత్‌కు వెస్టిండీస్ షాక్ ఇచ్చింది. తొలి టీ20లో భారత్‌పై 4 పరుగులు తేడాతో గెలుపొందింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను విజయంతో ఆరంభించింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ (39) మినహా మిగిలిన ఆటగాళ్లందరూ విఫలమయ్యారు. కీలక సమయంలో తడబాటుకు లోనై వికెట్లు చేజార్చుకోవడంతో గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయింది.
ఛేజింగ్‌లో భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 9 బంతుల్లో 3 పరుగులు చేసి మూడో ఓవర్లో వెనుదిరిగాడు. అనంతరం ఇషాన్ కిషన్ (9 బంతుల్లో 6 పరుగులు) సైతం గిల్‌నే ఫాలో అయ్యాడు. దీంతో భారత్ 28 పరుగులకే ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది. ఈ దశలో సూర్యకుమార్ యాదవ్‌కు జతకలసిన అరంగేట్ర ఆటగాడు తిలక్ వర్మ.. వచ్చి రాగనే బాదుడు మొదలు పెట్టాడు. ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగిస్తూ.. తాను ఎదుర్కొన్న రెండో బంతినే సిక్సర్‌గా మలిచాడు. తిలక్ ధాటిగా ఆడినా.. సూర్యకుమార్ ఆశించినంత వేగంగా ఆడకపోవడంతో స్కోరు నెమ్మదించింది.
10వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ (21 బంతుల్లో 21), 11వ ఓవర్‌లో తిలక్ వర్మ (22 బంతుల్లో 39) ఔట్ అయ్యారు. దీంతో 11 ఓవర్లలో 77 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది. అయితే కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్ ఉండటంతో టీమిండియా విజయంపై ఆశలు సజీవంగా ఉన్నాయి. 15 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు 113/4. విజయానికి 30 బంతుల్లో 37 పరుగులు అవసరం. సరిగ్గా 16వ ఓవర్‌లోనే మ్యాచ్ మలుపు తిరిగింది.
దూకుడుగా ఆడే క్రమంలో హార్దిక్ పాండ్యా 16వ ఓవర్ తొలి బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఇదే ఓవర్ మూడో ఓవర్‌కు సంజు శాంసన్ (12) రనౌట్ అయ్యాడు. దీంతో భారత జట్టు కష్టాల్లో పడింది. 16 ఓవర్లకు 113/6 పరుగులతో నిలిచింది. కాసేపటికే అక్షర్ పటేల్ ఔటయ్యాడు. చివరి రెండు ఓవర్లకు 21 పరుగులు కావాల్సిన దశలో అర్ష్‌దీప్ సింగ్ భారత శిబిరంలో ఆశలు రేపాడు. రెండు ఫోర్లు కొట్టడంతో ఆ ఓవర్‌లో 11 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్‌లో విజయానికి 10 పరుగులు అవసరం కాగా, తొలి బంతికే కుల్‌దీప్ యాదవ్ బౌల్డ్ అయ్యాడు. అర్షదీప్ కూడా ఔట్ కావడంతో టీమిండియా విజయానికి 4 పరుగుల దూరంలో ఆగిపోయింది. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 145 పరుగులకు పరిమితమైంది. విండీస్ బౌలర్లలో మెకాయ్, హోల్డర్, షెఫర్డ్ తలో రెండు వికెట్లు తీశారు. అకీల్ హుసేన్ ఓ వికెట్ పడగొట్టాడు.
అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ 41 పరుగులు (34 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ 48 పరుగులు (32 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) చేశారు. బ్రెండన్ కింగ్ కాసేపు బ్యాట్ ఝుళిపించాడు (28 పరుగులు, 19 బంతుల్లో).
భారత బౌలర్లలో చాహల్ 2, అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టగా.. కుల్‌దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీశారు. ఈ మ్యాచులో గెలిచిన విండీస్ ఐదు మ్యాచుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఆగస్టు 6వ తేదీన రెండో టీ20 మ్యాచు జరగనుంది.