Monday, November 25, 2024

రేవంత్‌ తెలంగాణవాది కాదు తెలంగాణకు వ్యాధి.. మంత్రి కేటీఆర్‌

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

తెలంగాణకు మోదీ ఒక్క పైసా ఇవ్వకున్నా అటు కాంగ్రెస్‌ అడగదు బీజేపీ అడగదు. ఆ పార్టీలు ఢిల్లీ బానిసలు. రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి ఇద్దరూ ఢిల్లీ దూతలు ఆడిస్తున్న తోలుబొమ్మలు మాత్రమే. పైకి కనబడేది కిషన్‌రెడ్డి ఆడించేది కిరణ్‌కుమార్‌రెడ్డి, కనబడేది రేవంత్‌రెడ్డి ఆడించేది కేవీపీ రామచందర్‌రావు.

తెలంగాణ వాదాన్ని లేకుండాచేస్తామని భీషణ ప్రతిజ్ఞలు చేసినవారు.. బీఆర్‌ఎస్‌ను చీల్చిన భేతాళ మాంత్రికులా తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చింది? అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. కేవీపీ రాంచందర్‌రావు కూడా తెలంగాణవాదినంటే చావాలా? బతకాలా? అని నిప్పులు చెరిగారు. తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమంటే పారిపోయిన కిషన్‌రెడ్డి, తెలంగాణవాదులపై రైఫిల్‌ ఎక్కుపెట్టిన రేవంత్‌రెడ్డి, తెలంగాణకు బద్ధ వ్యతిరేకిగా పార్లమెంట్‌లో ప్లకార్డు పట్టుకున్న కేవీపీ, తెలంగాణ వాదాన్ని అవహేళన చేసిన షర్మిల లాంటివాళ్లు తెలంగాణ వాదులా? అని ఆయన మండిపడ్డారు. వాళ్లంతా తెలంగాణ వాదులై రాష్ర్టాన్ని తెస్తే తాము ప్రేక్షకపాత్ర వహించామా? అని ప్రశ్నించారు. ఎవరెన్ని చేసినా.. నోరు పెద్దది చేసుకొని అసత్యాలను ప్రచారం చేసినా తెలంగాణకు బీఆర్‌ఎస్‌ పార్టీ, సీఎం కేసీఆరే శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు.

ఎన్నిలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని, అందుకు తమ పార్టీ ప్రకటించిన 115 అభ్యర్థులే నిదర్శమని పేర్కొన్నారు. మంగళవారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ మీడియాతో ఇష్టాగోష్టిగా ముచ్చటించారు. అభివృద్ధి, సంక్షేమంలో దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలిచిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సీఎం అభ్యర్థి కేసీఆర్‌ అని, కాంగ్రెస్‌, బీజేపీకి దమ్ముంటే వారి సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలని డిమాండ్‌ చేశారు. వన్‌నేషన్‌ వన్‌ ఎలక్షన్‌ అనేది ప్రజల దృష్టిని మళ్లించేందుకు మోదీ విసిరిన పాచిక అని ఆయన ధ్వజమెత్తారు. ఆంధ్రాలో జరుగుతున్న పరిణామాలపై తామేమీ వ్యాఖ్యానించబోమని తేల్చి చెప్పారు. చంద్రబాబు అరెస్టు అనేది ఆంధ్రా ప్రజల అంశమని, దానిపై ఆ రాష్ట్ర ప్రజలు వ్యాఖ్యానిస్తారని తెలిపారు. తమ ఫోకస్‌ అంతా తెలంగాణపైనేనని తేల్చిచెప్పారు. అభ్యర్థుల ప్రకటన, అనేక సర్వే సంస్థల ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా రాష్ట్రంలో మూడోసారి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే కొలువుదీరబోతున్నదని తెలిపారు. ఈసారి 90కి పైగా ఎమ్మెల్యే స్థానాల్లో గులాబీ జెండా ఎగురబోతున్నదని చెప్పారు. పలు జాతీయ, రాష్ట్ర అంశాలపై కేటీఆర్‌ చిట్‌చాట్‌లో వెలువరించిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..

తెలంగాణ ఉద్యమాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేసి ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేసిన కేవీపీ ఇప్పుడు తెలంగాణవాదినని చెప్పుకోవడం మా కర్మ.

తెలంగాణ ప్రజల కోసం పనిచేసే పార్టీ బీఆర్‌ఎస్‌. ప్రజల కోణంలోనే మేం ఆలోచిస్తాం. బీఆర్‌ఎస్‌ పార్టీ, ప్రజలు స్పష్టతతోనే ఉన్నారు. ప్రతిపక్షాలు మాత్రమే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాయి.

కేవీపీ కూడా తెలంగాణవాదేనట!

కొంతమంది స్టేట్‌మెంట్లు చూస్తుంటే నవ్వొస్తుంది. కేవీపీ రామచందర్‌రావు కూడా తెలంగాణవాదేనట! వైఎస్‌ షర్మిలది కూడా తెలంగాణేనట! మరి మేమంతా ఏం కావాలి? మేమంతా ఇంట్లో పడుకుంటే వాళ్లే తెలంగాణ తెచ్చిండ్రట! వాళ్లు వచ్చి ఉద్దరిస్తారట! కేవీపీ రాంచందర్‌రావు కూడా తెలంగాణవాదేనట! బేతాళ మాంత్రికుడిగా మా పార్టీని చీల్చి, మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, తెలంగాణవాదాన్ని లేకుండా చేస్తానన్న కేవీపీ కూడా తెలంగాణవాదిని అంటే చావాలా బతకాలా? కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, కేవీపీ, నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, షర్మిల.. వీళ్లే తెలంగాణ తెచ్చారు! మేము ప్రేక్షక పాత్ర వహించాం! హైదరాబాద్‌లో ఎవరైనా ఉండొచ్చు.. ఎవ్వరికీ అభ్యంతరం లేదు. కానీ, తెలంగాణను మేమే తెచ్చామంటే బాధేస్తుంది. అసలు తెలంగాణ కాంగ్రెస్‌వాళ్లు ఉద్యమంలో ఎక్కడున్నారు? ఎప్పుడున్నారు? వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి హారతులు పట్టినవాళ్లు, వైఎస్‌ఆర్‌, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాల్లో ఉండి ఉద్యమానికి వ్యతిరేకంగా మంథని, మంచిర్యాలలో మీటింగ్‌లు పెట్టినవాళ్లంతా తెలంగాణవాదులేనా? ఇవాళ కిరణ్‌కుమార్‌రెడ్డి బీజేపీకి తెలంగాణలో డైరెక్షన్‌ ఇస్తాడు. తెలంగాణను వ్యతిరేకించిన కేవీపీ తాను తెలంగాణవాడినని, కనీసం 50 శాతం తెలంగాణ అని ఒప్పుకోమంటారు.

50 శాతం తెలంగాణవాదం ఏంటి? కిషన్‌రెడ్డి ఓ చేతకాని దద్దమ్మ. తెలంగాణ ఉద్యమం సమయంలో రాజీనామా చేయకుండా పారిపోయిన వ్యక్తి. తెలంగాణ ప్రజలపైకి రైఫిల్‌ ఎక్కుపెట్టిన వ్యక్తి రేవంత్‌రెడ్డి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డనాడు ఏడ్చి, అరిచి గీపెట్టి, సమైక్య జెండా మోసి, నానా శాపనార్థాలు పెట్టిన షర్మిల ఈరోజు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు. వీళ్లు కేసీఆర్‌కు పోటీ అంట! తెలంగాణ ప్రజలారా.. తస్మాత్‌ జాగ్రత్త. మళ్లీ వీళ్లంతా ఒక్కటవుతున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి, కేవీపీ, షర్మిల వంటివారు బహురూపాల్లో వస్తున్నారు. పైకి కనిపించేది కిషన్‌ రెడ్డి, రేవంత్‌రెడ్డి. కానీ, వెనుక ఉన్నది కేవీపీ, షర్మిల, కిరణ్‌కుమార్‌రెడ్డి. మనకు మళ్లీ వీళ్లు కావాలా? తెలంగాణ వ్యతిరేకతను నరనరాన నింపుకున్నవాళ్లు.. తెలంగాణ అంటే నిలువెల్లా విషం ఉన్నవీళ్లు కావాలా? పదేండ్లలోకి అడుగుపెడుతున్న తెలంగాణ ఇప్పుడిప్పుడే దేశానికి ఆదర్శంగా మారుతున్నది. ఇప్పుడు రాష్ట్రాన్ని ఇలాంటివారి చేతిలో పెడ్దామా? రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి తోలుబొమ్మలు మాత్రమే. ఆడించేది ఢిల్లీ దూతలే. ఆడేది కిషన్‌రెడ్డి, ఆడించేది కిరణ్‌కుమార్‌రెడ్డి. కనిపించేది రేవంత్‌రెడ్డి, ఆడించేది కేవీపీ రామచందర్‌రావు. రూ.73 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేసిన కేసీఆర్‌ కావాలా? తెలంగాణకు నయాపైసా కూడా ఇవ్వనని బహిరంగంగానే ప్రకటించిన రాబందులు కావాలా? తెలంగాణ ఏర్పడితే చీకట్లు తప్పవన్న కిరణ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలోని బీజేపీ కావాలా? ఈ రోజు రాష్ట్రానికి 24 గంటల విద్యుత్తు ఇస్తున్న కేసీఆర్‌ పాలన కావాలా? ఇది తెలంగాణ ప్రజల ముందున్న ప్రశ్న.

సమైక్య పాలనలో 65 ఏండ్లలో పెట్టిన మెడికల్‌ కాలేజీలు రెండు మాత్రమే. మేం తొమ్మిదేండ్లలోనే 34 మెడికల్‌ కళాశాలలను ఏర్పాటు చేసినం. దేశంలో ఎక్కడా ఈ స్థాయిలో మెడికల్‌ కాలేజీలు లేవు. ఇది ఒక చరిత్ర.

కాంగ్రెస్‌, బీజేపీ ఒక్క సీటు కూడా ప్రకటించలేదు

వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం మేం 115 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాం. కాంగ్రెస్‌, బీజేపీ ఒక్క సీటును కూడా ప్రకటించలేదు. వాళ్లు ఇంకా దరఖాస్తులు తీసుకొనే స్థాయిలోనే ఉన్నారు. మా పార్టీలో ఇప్పుడు అభ్యర్థిత్వం పొందినవాళ్లలో కొందరికి బీ ఫారాలు ఇవ్వరని మీడియా ప్రచారం చేస్తున్నది. అది కూడా కరెక్టు కాదు. బీఫారాలు ఇవ్వబోమని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ ఏమీ చెప్పలేదు. రాజకీయాల్లో మౌనంగా ఉండటం కూడా ఒక వ్యూహమే. మా అభ్యర్థులు ఇప్పటికే ప్రజా క్షేత్రానికి చేరుకున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేం సిద్దంగా ఉన్నాం. సిట్టింగులకే మళ్లీ అవకాశం ఇస్తానని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ప్రతిపక్షాలకు ఇప్పుడు మాట్లాడేందుకు సబ్జెక్టు లేదు.. కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాయి. మేం 90కి పైగా స్థానాలను గెలవబోతున్నాం. కేసీఆర్‌ హ్యాట్రిక్‌ సీఎం అవుతారు.

బీఆర్‌ఎస్‌ సిట్టింగులకే టికెట్లు ఇచ్చింది. గజ్వేల్‌ నుంచే కేసీఆర్‌ పోటీచేస్తున్నారు. దమ్ముంటే సిట్టింగులకే టిక్కెట్లు ఇవ్వాలని, గజ్వేల్‌ నుంచి కేసీఆర్‌ పోటీచేయాలని సవాళ్లు చేసిన ప్రతిపక్షాలకు ఇప్పుడు మాట్లాడేందుకు సబ్జెక్టు లేదు.

కాంగ్రెస్‌, బీజేపీ ఒకటే

కాంగ్రెస్‌, బీజేపీ ఒక్కటే. ఆ రెండు పార్టీలు ఒక్కటి కాకపోతే పోయిన పార్లమెంట్‌ ఎన్నికల్లో కరీంనగర్‌లో పొన్నం ప్రభాకర్‌, నిజామాబాద్‌లో మధుయాష్కీ డిపాజిట్లు ఎట్లా పోతాయి? అక్కడ బీజేపీ మాత్రమే ఎలా గెలుస్తుంది? పెద్ద సామాజికవర్గానికి చెందినవారు, అప్పటికే ఎంపీలుగా పనిచేసినవాళ్ల డిపాజిట్లు పోవటం అంటేనే ఆ రెండు పార్టీలు ఒక్కటయ్యాయని అర్ధం. అట్లనే మక్తల్‌, మణికొండ, కందుకూరు ఇలా అనేక చోట్ల కాంగ్రెస్‌, బీజేపీ పొత్తపెట్టుకొని మున్సిపల్‌ చైర్మన్లుగా, ఎంపీపీలుగా పనిచేస్తున్నరా లేదా? ‘మేం (కాంగ్రెస్‌, బీజేపీ) కలిసే పనిచేస్తున్నాం’ అని మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి నిన్ననో..మొన్ననో అనలేదా? రాహుల్‌గాంధీ, నరేంద్రమోదీ ఒకే అవగాహనతో కలిసి పనిచేస్తున్నారు. లేకపోతే దేశమంతా భారత్‌ జోడోయాత్ర చేసిన రాహుల్‌గాంధీ ఎన్నికలు జరిగే గుజరాత్‌లో ఎందుకు యాత్ర చేయలేదు? రాహుల్‌, సోనియా మీద ఈడీ విచారణ జరిగినా ఎందుకు అరెస్ట్‌ చేయలేదు? అదే మా నాయకుల మీద ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు జరుగుతాయి. అదే తెలంగాణ కాంగ్రెస్‌ వారిమీద జరిగాయా? పీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి చేసే అక్రమాలు, బ్లాక్‌మెయిల్స్‌ కేంద్ర ప్రభుత్వానికి తెలియదు అంటే నమ్మాలా? రేవంత్‌రెడ్డి ఔట్‌రైట్‌గా దొరికిన క్రిమినల్‌. అయినా ఆయన మీద ఎందుకు దాడులు జరగలేదు? వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డిని పిలిచి కూర్చొబెట్టి ముచ్చట పెడతరు. రాజగోపాల్‌రెడ్డిని పిలిచి వేల కోట్ల కాంట్రాక్ట్‌ ఇవ్వలేదా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

మేం 90కుపైగా స్థానాలను గెలవబోతున్నాం. 90 తర్వాత ఎన్ని ఇస్తారన్నది ప్రజల ఇష్టం. కేసీఆరే హ్యాట్రిక్‌ ముఖ్యమంత్రి అవుతారు.ప్రతిపక్షాల తాపత్రయం రెండో స్థానం కోసమే.
తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే ‘మా పార్టీ వద్దన్నది. వెంకయ్యనాయుడు వద్దన్నారని పారిపోయింది కిషన్‌రెడ్డి కాదా? తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేయనివాడు.. ఇవ్వాళ ముఖ్యమంత్రి అవుతానని కలలు కంటే జోకర్‌ అనకుండా ఉంటామా?

రాష్ట్రంలో లేకి ప్రతిపక్షం..
రాష్ట్రంలో లేకి, భావదారిద్య్ర ప్రతిపక్షం ఉన్నది. ఇలాంటి ప్రతిపక్షంతో పోటీపడటం మన దౌర్భాగ్యం. రాష్ట్రం బాగుపడుతుంటే ఓర్వలేని కుళ్లు ప్రతిపక్షం ఉండటం తెలంగాణ ప్రజల దురదృష్టం. వీళ్ల ఏడుపంతా సీఎం కేసీఆర్‌పైనే. కేంద్రంలోని మోదీ ఒక్క రూపాయి ఇవ్వకపోయినా కాంగ్రెస్‌, బీజేపీ నేతలు అడగరు. త్వరలో సోనియాగాంధీ తెలంగాణకు వచ్చి అడ్డమైన హామీలు ఇస్తారు. ఏవో 5 హామీలు ఇస్తారంట. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నచోట మీరు రూ.4 వేల పెన్షన్‌ ఇస్తున్నారా? జాతీయ పార్టీకి జాతీయ విధానం ఉంటుందా..? ఏ రోటికాడ ఆ రోటి పాట పాడుతారా? 65 ఏండ్లలో రూ.200 పెన్షన్‌ ఇవ్వలేనివాళ్లు ఇప్పుడు రూ.4 వేలు ఇస్తామంటే నమ్ముతామా? అధికారం కోసం నానా గడ్డి తింటున్నారు.

 

రేవంత్‌రెడ్డి తెలంగాణకు పట్టిన వ్యాధి

ఉద్యమ సమయంలో తెలంగాణవాదులు పెద్దపల్లిలో మీటింగ్‌ పెట్టుకుంటే రేవంత్‌రెడ్డి రైఫిల్‌ తీసుకొని పోయింది నిజం కాదా? ఇటువంటి వాళ్లతోనా మా పోటీ? రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డిలాంటి జోకర్లతో కొట్లాడాల్సి వస్తుందన్నదే మా బాధ. మోదీతో కొట్లాడితే ఓ లెక్క ఉంటది. కానీ వీళ్లా కేసీఆర్‌తో కొట్లాడేది?

రేవంత్‌ తెలంగాణవాది అంటే ఎవరు నమ్ముతరు? రేవంత్‌రెడ్డి తెలంగాణవాది కాదు తెలంగాణకు పట్టిన వ్యాధి. జాతీయ పార్టీలంటే రన్నింగ్‌ కామెంట్రీలు చెప్పటం కాదు. జాతీయ రాజకీయాలు, సమస్యలమీద మాట్లాడాలి. ప్రతీ అడ్డమైన అంశంమీద నోరుపారేసుకోకూడదు. ప్రతీ అంశం మీద రన్నింగ్‌ కామెంట్రీ చెప్పాలా? లైవ్‌ షోనా? అలాగే ఆంధ్రాలోని రాజకీయ పరిణామాలతో మాకు సంబంధం లేదు. వాటిలో జోక్యం చేసుకోవటం మా పనికాదు. మాకు ఏపీలాగానే తమిళనాడు, అస్సాం, బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌ కూడా. ఆంధ్రాలో నిజంగా తప్పు జరిగిందా? లేదా? అని కూర్చొని తీర్పులు చెప్పటానికి మీరెవరు? నేనెవరు? మా ఫోకస్‌ అంతా తెలంగాణపైనే.

తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎక్కువైంది?
తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎక్కువైంది. సీఎం కేసీఆర్‌ను బూతులు తిట్టే జర్నలిస్టులు, యూట్యూబ్‌ చానళ్లు పెట్టుకొని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతుంటే మేము మౌనంగా, సంయమనంతో ఉన్నాం. తెల్లారిలేస్తే ఇక్కడి జర్నలిస్టులు నానా బూతులు తిడుతుంటే.. పార్లమెంట్‌లో బండి సంజయ్‌ అనే జోకర్‌ సీఎం కేసీఆర్‌పై ‘దేశ్‌ కా నేతా దిన్‌బర్‌ పీతా’ అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడారు. రేవంత్‌రెడ్డి అనే లోఫర్‌ కేసీఆర్‌ను బూతులు తిడతారు. అయినా మేం సంయమనంతో వ్యవహరిస్తున్నాం. ఇతర రాష్ర్టాల్లో ఈ పరిస్థితులు ఉన్నాయా? తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎక్కువైందని మావాళ్లు కూడా అంటున్నరు. ప్రతీ లేకి వెధవ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతడా?

కాంగ్రెస్‌ సర్వేలోనూ బీఆర్‌ఎస్‌దే విజయం

మా సర్వేలే కాదు.. చివరకు ప్రతిపక్షాల సర్వేల్లో సైతం ప్రజల్లో బీఆర్‌ఎస్‌కే మద్దతు ఉన్నట్టు తేలింది. బీజేపీకి చాలా చోట్ల అభ్యర్థులే లేరు. ఈసారి కూడా ఆ పార్టీకి వందకుపైగా స్థానాల్లో డిపాజిట్లు రావు. 40 చోట్ల మాత్రమే బీఆర్‌ఎస్‌కు పోటీ ఇవ్వగలమని కాంగ్రెస్‌ స్వయంగా చేయించిన సర్వేలోనే ఆ పార్టీ స్ట్ట్రాటజిస్టులు తేల్చిచెప్పారు.

కేసీఆర్‌ పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల గురించి మా నేతలకంటే సాధారణ ప్రజలే అద్భుతంగా చెప్తున్నారు. రాబోయే ఎన్నికలకు మా సీఎం అభ్యర్థి కేసీఆర్‌. మరి కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరు? బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు? కనీసం వాళ్ల పార్టీవారికైనా తెలుసా? వాళ్లది సీల్డ్‌ కవర్ల సంసృ్కతి. ఢిల్లీ నుంచి రిమోట్‌ కంట్రోల్‌తో నడిచే వ్యవస్థ వాళ్లది. ఆ అవస్థ తెలంగాణ ప్రజలకు మళ్లీ కావాలా? తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం ఎక్కువ. ఢిల్లీ గులాంలు కావాలా? సేవ చేసేవారు కావాలో తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలి.

తెలంగాణ రాష్ట్రం భిక్ష కాదు..

యూపీఏ ప్రభుత్వం దిక్కులేని పరిస్థితుల్లో, ఇవ్వక తప్పని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటుచేసింది. తెలంగాణ ఇవ్వకుంటే వీపు పలుగుతది అంటే తెలంగాణ వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ భిక్షం వేస్తే వచ్చింది కాదు. ఇవ్వక తప్పని అనివార్య పరిస్థితిని సృష్టించాం కనుక తెలంగాణ రాష్ర్టాన్ని ఇవ్వాల్సిన వచ్చింది. మర్యాదగా ఎవరైనా ఇచ్చారా? ‘భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చాం’ అని రిషీ సునక్‌ (బ్రిటన్‌ ప్రధాని) అంటే ఎంత నికృష్టంగా ఉంటదో.. తెలంగాణ ఇచ్చినం అని కాంగ్రెస్‌ అంటే అట్లనే ఉంటది.

వన్‌ నేషన్‌- వన్‌ ఎలక్షన్‌ చీప్‌ గిమ్మిక్‌

వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌ అన్నది చీప్‌ గిమ్మిక్‌ మాత్రమే. అనురాగ్‌ ఠాకూర్‌, ఇంకెవరో చెప్పినదానికి ప్రామాణికత లేదు. ప్రజల అటెన్షన్‌ డైవర్షన్‌ కోసం ఇలాంటి గిమ్మిక్‌ మాటలు చెప్తారు. 2022 నాటికి అందరికీ ఇండ్లు అన్నారు, అందరికీ ఉద్యోగాలన్నారు, బుల్లెట్‌ ట్రైన్‌ అన్నారు, ప్రతి ఇంటికి నల్లా నీళ్లు అన్నారు, 5 ట్రిలియన్‌ డాలర్ల ఎకనామీ అన్నారు.. 9 ఏండ్లలో వీటిని ఎందుకు చేయలేదో చెప్పలేరు. అందుకే ఇప్పుడు చీప్‌ గిమ్మిక్‌ చేస్తున్నారు.

సరిగ్గా ఎన్నికల ముందే దీన్ని ఎత్తుకోవడంలో ఆంతర్యమేంటి? పార్లమెంటు సమావేశాలున్నాయి. ఏం చేస్తారో చూద్దాం. ఇప్పటికైతే అన్నీ ఊహాగానాలే. మహిళా బిల్లు, ఉమ్మడి పౌరస్మృతి, జమిలి ఎన్నికలపై బిల్లు ఉంటుందని, దేశం పేరు మారుస్తారని అంటున్నారు. ఆయనేంచేస్తారో (మోదీ) ఎవ్వరికీ తెలియదు. స్పీకర్‌, రాష్ట్రపతికి కూడా తెలియకపోవచ్చు. ఇండియా పేరు మారుస్తారని ప్రచారం జరుగుతున్నది. ఇండియా పేరు తీసేసి అమెరికా అని పెడితే అమెరికాలా మన దేశం అయిపోతుందా? ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయి. ఎక్కడా బీజేపీ గెలిచే అవకాశమే లేదు. దీని నుంచి బయటపడేందుకు బీజేపీ ఏదైనా చేస్తున్నదేమో చూడాలి. కేంద్ర ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని ప్రజలు ఒక్కసారి నిర్ణయించుకొంటే.. ఒకేసారి ఎన్నికలు పెడ్తావా, రెండుసార్లు పెడ్తావా, 60 సార్లు పెడ్తావా అన్నది లెక్కలోకి రాదు. వాళ్ల నిర్ణయాన్ని అమలు చేస్తారు. ప్రజలకు స్పష్టత ఉన్నది. ఈసారి తెలంగాణ ప్రజలు ఏకపక్ష నిర్ణయం తీసుకుంటారన్నది నా అంచనా. బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తారు.

రాజకీయాల్లో పార్టీల మారుడు సహజం

ఎన్నికలు.. రాజకీయాలు రైలు ప్రయాణం లాంటిది. ఎక్కేవాళ్లు ఎక్కుతుంటరు. దిగేవాళ్లు దిగుతుంటరు. రైలు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. మనుషులకు, అందులో ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఆశలు ఉంటాయి. ఎమ్మెల్యే కావాలని, మంత్రి కావాలని ఉంటది. అది కాకపోతే రెడీగా ఉన్న ప్లాట్‌ఫాం మీద మరో రైలు ఉన్నది. దానిమీద పోతరు. రాజకీయాల్లో పార్టీలు మారటం సహజం. జీవితకాల ఒప్పందాలేమీ ఉండవు. పార్టీ సిద్ధాంతం అని కాకుండా నా సంగతి ఏంది? నా పదవి ఏంది అనేవారు ఉంటారు. పదవి ఇస్తే పార్టీ మంచిది. లేకపోతే లేదు అన్నట్టు తయారైంది. మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్‌ను జూపల్లి కృష్ణారావు పోగిడినంతగా మారెవ్వరూ పొగడలేదు. కానీ, ఏమవుతున్నదో మీకు తెలుసు అని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

కాళేశ్వరాన్ని తలదన్నేలా పాలమూరు

15న ఒకేరోజు 9 మెడికల కాలేజీలు ప్రారంభిస్తున్నాం. కాళేశ్వరాన్ని తలదన్నేరీతిలో నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల వెట్న్‌న్రు 16న ప్రారంభిస్తున్నాం. నిన్నమొన్నటివరకు ప్రతిపక్షాలు పాలమూరు ఎత్తిపోతలను ఆపేందుకు విశ్వప్రయత్నాలు చేశాయి. ఇప్పుడేమో కాలువలు తవ్వలేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి. మరి ఎస్సారెస్పీకి 1963లో నెహ్రూ శంకుస్థాపన చేస్తే ఇప్పటికీ ఎందుకు పూర్తిచేయలేదు? పాలమూరు ఎత్తిపోతలలో ముఖ్యమైన రిజర్వాయర్లు పూర్తవుతున్నాయి. డిస్ట్రిబ్యూటరీ కాలువలు కడ్తారు. దశలవారీగా నిర్మిస్తారు. రెండు నెలలు ఓపిక పట్టాలి. నార్లాపూర్‌, ఉద్దండాపూర్‌, వట్టెం, ఏదుల తదితర రిజర్వాయర్ల నిర్మాణం పూర్తవుతున్నది. పాలమూరు పచ్చబడుతుంది. 13-14 లక్షల ఎకరాలకు నీళ్లు అందబోతున్నాయి. 17న జాతీయ సమైక్యతా దినోత్సవం ఉంటుంది. ఆ తర్వాత రెండు-మూడు రోజుల్లోనే హైదరాబాద్‌లో 5 ఎస్టీపీలు ప్రారంభించబోతున్నాం. హైదరాబాద్‌లో సుమారు రూ.50-60 వేల కోట్ల విలువైన డబుల్‌ బెడ్రూం ఇండ్లను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. మా ఫోకస్‌ అంతా అభివృద్ధి గురించే.

జీ20 సదస్సు మోదీ గొప్ప కాదు

ఢిల్లీలో జీ20 సదస్సు నిర్వహించిన వేదికలోకి చేరిన వర్షం నీరు

ప్రజలు జీ20 కన్నా టీ20 మీద (20 ట్వంటీ క్రికెట్‌ మ్యాచ్‌) ఎక్కువ ఆసక్తి చూపారు. జీ20 సదస్సు రొటేషన్‌లో వచ్చిన అవకాశం. అందరికీ వచ్చినట్టే మనకూ వచ్చింది. బాకా కొట్టుకొని మోదీ బొమ్మ పెట్టుకొని, బీజేపీ గుర్తు పెట్టుకొని చేసిన లేకి ప్రయత్నం బ్యాక్‌ఫైర్‌ అయింది. జీ20 సదస్సు జరిగిన ఢిల్లీ నీటితో నిండిపోయిందని ప్రజలు నవ్వుకున్నరు. అసలు జీ20 ఢిల్లీ డిక్లరేషన్‌లో ఏమున్నదో ఎవరికైనా తెలుసా? ఢిల్లీ డిక్లరేషన్‌తో దేశానికి ఏం మేలు జరగనప్పుడు ఆ పోజులెందుకు?

Website | + posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here