భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని సోమవారం జరుపుకుంటున్నాం. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో రాజ్యాంగం అమలు విషయంలో వస్తున్న మౌలికమైన మార్పులు ఆలోచింప చేస్తున్నాయి. రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్లుగా అన్వయించుకుని వ్యవస్థలు దేశానికి కొత్త దారి చూపిస్తున్నాయి. అందుకేభారత ప్రజాస్వామ్యం కొత్త దారిలో వెళ్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అది దేశానికి మేలు చేస్తుందా లేదా కీడుచేస్తుందా అన్నది చెప్పలేము కానీ.. ఖచ్చితంగా మౌలికమైన మార్పు అయితే కనిపిస్తోంది.

రాష్ట్రపతి, గవర్నర్ల అనుమతి లేకుండా చట్టాల నోటిఫై.

శనివారం దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఓ అనూహ్యమైనా ఘటన చోటు చేసుకుంది. గవర్నర్ అనుమతి లేకుండా చట్టాలను తెలంగాణ ప్రభుత్వం నోటిఫై చేసింది. ఇప్పటి వరకూ గవర్నర్ గెజిట్ జారీ చేయాలి. అప్పుడే చట్టం అమల్లోకి వచ్చినట్లు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రపతి అనుమతి కూడా ఇక అవసరం లేదు. మూడు నెలల పాటు పెండింగ్ లో ఉంటే అనుమతి లభించినట్లే అనే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక సారి తిరస్కరిస్తే..రెండో సారి అదే బిల్లును చట్టసభ ఆమోదిస్తే ఇక ఆ అవసరం కూడా ఉండదు. చట్టంగా ప్రభుత్వమే నోటిఫై చేసుకోవచ్చు. ఇది రాజ్యాంగ అమలులో వచ్చిన అతిపెద్ద మౌలికమైన మార్పు.

రాజకీయం రాజ్యాంగ వ్యవస్థల్ని కలుషితం చేయడం వల్లనే సమస్యలు.

రాజకీయం రాజ్యాంగ వ్యవస్థల్ని కలుషితం చేయడం వల్లనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. గవర్నర్ల వ్యవస్థ ను రాజకీయ కుట్రలకు వాడుకుంటున్నారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో గవర్నర్లు తామే పాలన చేస్తామని ఉబలాటపడుతూ ఉంటారు. పాలించే పార్టీలకు అడ్డం పడటమే తమ పని అనుకుంటారు. ఇందు కోసం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తారు. ఆర్ఎన్ రవి మాత్రమే కాదు..బెంగాల్ గవర్నర్ గా ఉన్నప్పుడు ధన్‌ఖడ్.. ఏపీ గవర్నర్ గా ఉన్నప్పుడు నరసింహన్ కూడా అంతే. ప్రభుత్వాల హక్కులను కాలరాసి.. పదవి ఇచ్చిన పార్టీకి రాజకీయ ప్రయోజనాల కోసం పని చేసారు. ఇంకా చెప్పాలంటే ఇది దశాబ్దాల సమస్య. అడ్డగోలుగా గవర్నర్లను వాడుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. అది కొనసాగుతోంది.

సుప్రీంకోర్టు తీర్పు పై గవర్నర్ల సందేహాలు.

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేరళ గవర్నర్ స్పందించారు. కేరళ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ సుప్రీంకోర్టు తీర్పుపై, బిల్లులను ఆమోదించడానికి గవర్నర్‌కు గడువు విధించడం “అతిగా జోక్యం చేసుకోవడం” అని వ్యాఖ్యానించారు. ఇక చట్టాలు చేసే పార్లమెంట్ ఎందుకని.. సుప్రీంకోర్టే పరిపాలించవచ్చు కదా అన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. ఆయన కేరళ ప్రభుత్వాన్ని రాచి రంపాన్ని పెడతారు. ఇలాంటి తీర్పులు ఇవ్వాల్సిన పరిస్థితి కల్పించేది రాజేంద్ర ఆర్లేకర్ లాంటి గవర్నర్లే.

వ్యవస్థలు చాలా బలంగా ఉన్నాయి. కానీ వాటిని నడిపించేవారు కూడా అంతే ఉండాలి. వక్రబుద్దితో ఉన్నవారిని వ్యవస్థలను నడిపించేందుకు నియమిస్తే.. భారత రాజ్యాంగానికి వక్రభాష్యాలు చెప్పుకుని అడ్డదిడ్డమైన రాజకీయ లక్ష్యాల కోసం ప్రయత్నిస్తారు. ఇప్పుడు అదే జరుగుతోంది. కరెక్షన్ కోసం ప్రజలు ఎదురుచూడాల్సిందే.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *