నైపుణ్యాభివృద్ధి పథకం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు పాలైన మాజీ సీఎం చంద్రబాబుకు మంగళవారం తీవ్ర నిరాశ ఎదురైంది. తనను జ్యుడీషియల్ కస్టడీ (జైలు)లో కాకుండా గృహ నిర్బంధం (హౌస్ రిమాండ్)లో ఉంచాలన్న ఆయన విజ్ఞప్తిని విజయవాడ ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. రాజమండ్రి జైలులో ఆయనకు ప్రత్యేక భద్రత కల్పించామన్న సీఐడీ వాదనతో కోర్టు ఏకీభవించింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): నైపుణ్యాభివృద్ధి పథకం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు పాలైన మాజీ సీఎం చంద్రబాబుకు మంగళవారం తీవ్ర నిరాశ ఎదురైంది. తనను జ్యుడీషియల్ కస్టడీ (జైలు)లో కాకుండా గృహ నిర్బంధం (హౌస్ రిమాండ్)లో ఉంచాలన్న ఆయన విజ్ఞప్తిని విజయవాడ ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. రాజమండ్రి జైలులో ఆయనకు ప్రత్యేక భద్రత కల్పించామన్న సీఐడీ వాదనతో కోర్టు ఏకీభవించింది. దీంతో ఆయన తన కస్టడీని జైలులోనే కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీమా కోరెగావ్ హింస కేసులో నిందితునిగా ఉన్న మానవ హక్కుల సంఘం కార్యకర్త గౌతమ్ నవలఖాకు సుప్రీంకోర్టు ‘హౌజ్ అరెస్ట్’కు వీలు కల్పించిందని, చంద్రబాబుకు కూడా అటువంటి అవకాశం ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కోరారు.
రాజమండ్రి జైలులో చంద్రబాబుకు ముప్పు లేదని.. ఆయన పూర్తి భద్రతలో ఉన్నారని, ప్రత్యేక గది, ఇంటి భోజనం, మందులు, వ్యక్తిగత సహాయకుడిని కల్పించామని సీఐడీ తరఫు న్యాయవాదులు తెలిపారు. సీఆర్‌పీసీలో గృహ నిర్బంధం పిటిషన్‌కు అసలు అర్హతే లేదని అన్నారు. దీంతో చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు జడ్జి తీర్పు చెప్పారు. చంద్రబాబు తన రిమాండ్‌ను రద్దు చేయాలని కోరుతూ మంగళవారం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబును తమ కస్టడీకి అప్పగించాలని సీఐడీ పోలీసులు కూడా ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ రెండింటిపై బుధవారం విచారణ జరుగనుంది. జైలులో ఉన్న చంద్రబాబుతో ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి ములాఖత్ అయ్యారు.
మేఘా సంస్థకు పీవీ రమేశ్ గుడ్‌బై
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మేఘా ఇంజినీరింగ్ సంస్థ సలహాదారు పీవీ రమేశ్ తన పదవికి రాజీనామా చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ పథకం కుంభకోణంలో చంద్రబాబు పాత్రపై పీవీ రమేశ్ కూడా సమాచారం ఇచ్చారని సీఐడీ అధికారులు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వాదనను ఖండించిన రమేశ్ ఏం జరిగిందో మీడియాకు వివరించారు. కానీ అనూహ్యంగా ఆయన మేఘా సంస్థ నుంచి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. వ్యక్తిగత కారణాలతోనే తాను వైదొలగినట్టు చెప్తున్నారు.
బాబును రిమాండ్‌కు పంపిన జడ్జికి 4+1 ఎస్కార్ట్
చంద్రబాబు నాయుడును జ్యుడిషియల్ కస్టడీకి పంపించిన ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ సత్య వెంకట హిమబిందు భద్రత విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఆమెకు అదనపు భద్రతను కల్పిస్తూ 4+1 ఎస్కార్ట్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.