క్రికెట్ అభిమానులకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. వరల్డ్ కప్ మ్యాచ్‌లకు సంబంధించి మరో 4 లక్షల టిక్కెట్లను త్వరలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల తొలి విడత అమ్మకాలు పూర్తి కాగా ఇప్పుడు రెండో విడతలో 4 లక్షల టిక్కెట్లను విడుదల చేస్తున్నట్లు తెలిపింది.
వన్డే ప్రపంచకప్ కోసం టిక్కెట్లు దక్కలేదని నిరాశ పడుతున్న క్రికెట్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ అందించింది. అక్టోబర్-నవంబర్ నెలల్లో జరిగే ప్రపంచకప్ కోసం మరో 4 లక్షల టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఈ టిక్కెట్ల అమ్మకాలను ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో కూడా బీసీసీఐ వెల్లడించింది. వరల్డ్ కప్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తున్న రాష్ట్ర సంఘాలతో పలు మార్లు చర్చించి ఎంతోమంది క్రికెట్‌ను అభిమానించే వాళ్ల కోసం అదనంగా టిక్కెట్లను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. చారిత్రక ఈవెంట్‌లో వీలైనంత ఎక్కువ మందిని భాగస్వాములను చేయడం కోసం క్రికెట్ అభిమానులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించామని బీసీసీఐ పేర్కొంది.
కాగా వన్డే ప్రపంచకప్ కోసం అదనంగా కేటాయించిన 4 లక్షల టిక్కెట్లను సెప్టెంబర్ 8 నుంచి విక్రయిస్తామని.. రాత్రి 8 గంటల నుంచి టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని బీసీసీఐ తెలిపింది. అభిమానులు https://tickets.cricketworldcup.com వెబ్‌సైట్ లేదా బుక్ మై షో ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేయాలని సూచించింది. ఇంకా మరిన్ని టిక్కెట్లను మరో విడతలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తామని చెప్పింది. ఇటీవల బుక్‌మైషోలో వరల్డ్ కప్ టికెట్ల విక్రయాలు చేపట్టగా.. టీమిండియా ఆడుతున్న మ్యాచ్‌ల టికెట్లు కేవలం నిమిషాల వ్యవధిలోనే ఖాళీ అయ్యాయి. అంతేకాకుండా బుకింగ్ సమయంలో అభిమానులు చాలాసేపు వెయిట్ చేశారు. దీంతో బీసీసీఐ తీరుపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని టిక్కెట్లను మాత్రమే అందుబాటులో ఉంచడంపై ప్రశ్నల వర్షం కురిపించారు. మిగతా టిక్కెట్లను బ్లాక్‌లో అమ్ముకుంటారా అని నిలదీశారు. దీంతో బీసీసీఐ దిద్దుబాటు చర్యలకు దిగి మరిన్ని టిక్కెట్లను విక్రయించాలని నిర్ణయం తీసుకుంది.
https://twitter.com/BCCI?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1699432629316080033%7Ctwgr%5E5c3d334a8eef81433621a526e152aa90b9e97ea9%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftwitframe.com%2Fshow%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2FBCCI%2Fstatus%2F1699432629316080033