-రేచపల్లికి చెందిన “పోగుల రాజేశం” బిడ్డ వరకట్న దాహానికి బలి
-9 నెలలుగా జగ్దల్ పూర్ జైల్ నిర్బంధంలో పోగుల రాజేశం
-నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం రేవోజీపేట్ లో దారుణం
-బాత్ రూమ్ లో ఉరి వేసుకుందని నమ్మించే ప్రయత్నంలో భర్త, అత్త – మామలు
-రేచపల్లిలో అలుముకున్న విచాధ ఛాయలు
-జైల్ నుండి రాజేశం ను విడుదల చేయాలని పౌర హక్కుల, ప్రజా సంఘాల, గ్రామస్తుల డిమాండ్
A9 న్యూస్ ప్రతినిధి:
జగిత్యాల జిల్లా ఛత్తీస్ ఘడ్ లోని జగ్దల్ పూర్ జైల్ లో ఖైదీ గా ఉన్న జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామానికి చెందిన “పోగుల రాజేశం” బిడ్డ పోగుల లత (చంద లత) (23సం.లు) వరకట్న వేధింపులతో దారుణ హత్యకు గురైంది. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం రేవోజీపేట్ లో శుక్రవారం ఉదయం ఈ దారుణం జరిగింది.
శనివారం నిర్మల్ డిఎస్పీ అల్లూరి గంగారెడ్డి విచారణ జరిపారు. మృతురాలి శవానికి గొంతు పిసికిన ఆనవాళ్లు, గాయాలు, చిత్ర హింసలతో గొంతు వద్ద, గదువ కింది భాగాన కమిలిపోయిన పలు గాయాలు, గావులు ఉన్నాయన్నారు. గొంతు నులిమి చంపినట్లు ఆనవాళ్లు, అనేక అనుమానాలు కూడా ఉన్నాయని మృతురాలి తల్లి పోగుల మల్లేశ్వరి ఆరోపిస్తోంది. తనకు కూడా బిడ్డ చనిపోయిన సమాచారాన్ని కూడా మృతురాలి అత్తమామలు, భర్త తెలుపక పోవడం వెనుక కుట్రలు దాగి ఉన్నాయని మల్లేశ్వరి ఆరోపించారు. చుట్టు ప్రక్క గ్రామాల వారి ద్వారా తన బిడ్డ చనిపోయిన సమాచారం అందిందని ఆమె పేర్కొన్నారు. వెంటనే వెళ్ళి చూసే సరికి తన బిడ్డ ను వాకిట్లో పడుకోబెట్టి ఉన్నారని, లత భర్త చంద నాగరాజు, మామ చంద వెంకటి లు అక్కడ లేకుండా పారిపోయారని తెలిపారు. తన బిడ్డ శవాన్ని పరిశీలించగా గొంతు నులిమి చంపినట్లు గాయాలు, కమిలి పోయిన గాయాలు ఉన్నాయన్నారు. శవం పూర్తిగా కట్టె చరుసుకు పోయిందన్నారు. మృతురాలి అత్త చంద సత్తవ్వ బాత్ రూం లో బట్టలు తలిగేసే ఆంగిలర్ కు చున్నీ తో ఉరి పెట్టుకుందని తెలుపగా అక్కడ మేము పరిశీలించగా బాత్ రూమ్ లో ఉరి పెట్టుకునే పరిస్థితి లేదన్నారు. బట్టలు తగ్గిలేసే ఆంగిలర్ లత ఎత్తికంటే తక్కువగా ఉంటుందన్నారు. తన బిడ్డ లత ఉరి పెట్టుకొని చనిపోయే అంతా పిరికి కాదని తెలిపారు. పెండ్లి జరిగిన ఆరు నెలల తర్వాత నుండి అదనపు కట్నం కావాలని తన బిడ్డను అనేక మార్లు చిత్ర హింసలు పెట్టిన సంఘటనలు కూడా ఉన్నాయన్నారు. గతంలో పలు సార్లు పంచాయతీలు కూడా జరిగాయన్నారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ పోలీస్ స్టేషన్ లో చేసిన పిర్యాదు మేరకు 2022 సెప్టెంబర్ 2న ఇంకోసారి లతను అదనపు వరకట్నం గురించి వేదించమని పలువురు పెద్దల సమక్షంలో లత భర్త నాగరాజు, మామ వేంకటి లు సంతకాలు చేసి పాబంది నామ పత్రం కూడా రాసి ఇచ్చారని తెలిపింది.
లత మృతి చెందిన సంఘటనపై రేవోజీపేట, రేచపల్లి రెండు గ్రామాల ప్రజలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి భర్త చంద నాగరాజు, అత్త చంద సత్తవ్వ, మామ చంద వెంకటి లు ప్రజలను, పోలీసులను నమ్మించేందుకు బాత్ రూమ్ లో లత ఉరి వేసుకొని చనిపోయిందని కట్టు కథలు అల్లినట్లు రేవోజీపేట గ్రామస్తులు వాపోయారు. రేవోజీపేట గ్రామస్తులు సైతం లత హత్య పట్ల అనుమానాలతో పాటు పలు ఆసక్తికర విషయాలు వెలిబుచ్చారు.
అదే కోణంలో అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. రేచపల్లికి చెందిన పోగుల రాజేశం – మల్లీశ్వరి ల కూతురు లతను నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం రేవోజీపేట్ గ్రామానికి చెందిన చంద నాగరాజు కు ఇచ్చి 2021 ఆగస్టు 21 న పెండ్లి చేశారు. పెండ్లి సమయంలో ఐదు లక్షల రూపాయల నగదు కట్నం, బంగారం, వెండి ఆభరణాలు, లాంఛనాల ప్రకారం ఇతర సామాగ్రి కూడా ఇచ్చామని మృతురాలి తల్లి మల్లీశ్వరి తెలిపారు. మృతురాలి తండ్రి పోగుల రాజేశం ప్రస్తుతం తప్పుడు ఉపా చట్టం కేసుతో ఛత్తీస్ ఘడ్ లోని జగ్డల్ పూర్ జైల్ లో అక్రమంగా నిర్బంధంలో ఉన్నాడని ఆయన భార్య, మృతురాలి తల్లి పోగుల మల్లీశ్వరి ఆరోపిస్తోంది. రాజేశం లేనిది చూసి అవకాశంగా తీసుకొని లతను ఆమె భర్త నాగరాజు, అత్త సత్తవ్వ, మామ వెంకటి లు కలిసి హత్య చేశారని పోగుల మల్లీశ్వరి ఆరోపించారు. బాత్ రూం లో ఉరి పెట్టుకుందని అబద్దాలతో కట్టుకథలు చెబుతున్నారని పేర్కొంది. తన బిడ్డ ఖచ్చితంగా హత్య కే గురి అయ్యిందని, ఇది ఆత్మ హత్య కాదని, పలు అనుమానాలతో దస్తురాబాద్ పోలీసులకు పిర్యాదు చేశారు. ఆమె పిర్యాదు మేరకు నిర్మల్ జిల్లా దస్తురాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం రాత్రి ఖానాపూర్ లో శవాన్ని పోస్ట్ మార్టం చేసి రేచపల్లికి తరలించగా శవాన్ని దహనం చేయకుండా అపినారు. ఆమె మృతి పట్ల సరైన న్యాయ విచారణ జరుపాలని డిమాండ్ చేశారు. మృతురాలికి ఏడాదిన్నర కొడుకు ఉన్నాడని నిర్మల్ పోలీస్ ఉన్నతాధికారులను కలిసి శనివారం విజ్ఞప్తులు చేశారు.
లత హత్యతో రేచపల్లిలో విషాద ఛాయలు నెలకొన్నాయి. జగ్దల్ పూర్ జైల్ లో ఉన్న పోగుల రాజేశం ను వెంటనే విడుదల చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కుటుంబ సభ్యులు, హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు కోరుతున్నాయి.