నిజామాబాద్ జిల్లా పాత ఇందూరుకే వరప్రదాయని గా నిలిచిన ఒకప్పటి నిజాంసాగర్ ప్రాజెక్టు.నేడు ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో 82 -2 నిజాంసాగర్ ప్రధాన కాలువ జర్నలిస్ట్ కాలనీ వాసులను ఉలిక్కిపడేలా చేసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ 82-2 కో నంబర్ ప్రధాన కాలువ కట్ట సోమవారం ఉదయం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో తెగిపోయింది. దీంతో కాలువను ఆనుకుని ఉన్న జర్నలిస్ట్ కాలనీ లోకి నీరు వచ్చి చేరింది. నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా రైతుల పంటల సాగు కోసం నీటిని చెరువులకు వదిలే సమయంలో ఆ ప్రాజెక్టు ప్రధాన కాలువలను ఇరిగేషన్ అధికారులు శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది.
కానీ ఆర్మూర్ ప్రాంతంలోని ఇరిగేషన్ అధికారులు అవేవీ పట్టించుకోలేదు. దీంతో నిజాంసాగర్ ప్రధాన కాలువలు మురికి కూపంలా తయారై, చెత్త చెదారాలతో నిండిపోయి దర్శనమిస్తున్నాయని ఇరిగేషన్ అధికారుల పనితీరు పట్ల స్థానిక కాలనీవాసులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు అధికారులు ప్రజలకు తాగునీరు అందించడం, రైతులకు సాగునీరు అందేలా కాలువల ద్వారా నీటిని వదిలారు. కాలువ తెగిపోయి ఉన్న జర్నలిస్టు కాలనీలోకి నీళ్లు చొచ్చుకెళ్లి ఆ కాలనీవాసులను భయభ్రాంతులకు గురిచేసి ఉలిక్కిపడేలా చేశాయి. కలువ కట్ట తెగి నీరు వేగంగా వెళ్లడంతో ఆ ప్రాంతంలో విద్యుత్ స్తంభాలు పడిపోయి విద్యుత్ సరఫరా సైతం నిలిచిపోయింది.
జర్నలిస్ట్ కాలనీలోనే ప్రధాన కాలువకు కూతవేటు దూరంలో ఉండే ఇరిగేషన్ ఎస్సీ యశస్విని, ఇరిగేషన్ ఈ ఈ భాను ప్రకాష్, ఇరిగేషన్ డి ఈ కృష్ణమూర్తిల కార్యాలయాలు ఉన్న నిజాంసాగర్ ప్రధాన కాలువ పరిశుభ్ర పరచకపోవడంతో కాలువ తెగిపోయిందని స్థానిక ప్రజలు ఇరిగేషన్ అధికారుల తీరుపై ఆరోపణలు చేస్తున్నారు. స్థానిక అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని జర్నలిస్ట్ కాలనీ వాసులు కోరుతున్నారు.