నిజామాబాద్ A9 న్యూస్, ఫిబ్రవరి 3:
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో 2024 ఫిబ్రవరి 16న దేశభక్తి సమ్మెలో పాల్గొనాలని కార్మిక సంఘాల నాయకులు కార్మిక లోకానికి పిలుపును ఇచ్చారు. ఆర్మూర్ పట్టణంలో 03 ఫిబ్రవరి2024 న ఐఎఫ్టియు ఆఫీసులో పాత్రికేయుల సమావేశం నిర్వహించి ప్రకటించారు. ఈ సమావేశంలో ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివాజీ, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ అధ్యక్షులు ఎండి కాజా మొయినుద్దీన్, ఎల్ఐసి యూనియన్ నాయకులు వి.బాలయ్య, మున్సిపల్ వర్కర్స్ యూనియన్, బిఓసి ఆర్మూర్ నాయకులు రాజేశ్వర్ లు పాల్గొని మాట్లాడుతూ మోడీ అమిత్షాలు ఎన్నికల వాగ్దానాలకు భిన్నంగా కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను తెచ్చారని, కార్మికుల ఉపాధిని కొల్లగొట్టారని వారు అన్నారు. దేశంలో 45 కోట్ల మంది కార్మికుల్లో కేవలం ఐదు కోట్ల మందికే సామాజిక చట్టాలు అమలు చేయబడుతున్నాయని, మిగతా కార్మికుల తీవ్ర ఇబ్బందులతో బతుకులను గడుపుతున్నారని వారు తెలిపారు. ప్రజల సంపదను అంబానీ ఆదానిలాంటి పెట్టుబడిదారులకు మోడీ అప్పజెపుతున్నారని వారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తున్నారని, కార్మికుల జీవన ప్రమాణాలు దెబ్బతీస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ బిల్లు వాపస్ తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నిత్యవసర సరుకుల ధరలు నియంత్రించాలని, కుటీర పరిశ్రమలను కాపాడాలని, ఉపాధి భద్రత కల్పించాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రోడ్ సేఫ్టీ బిల్లు పేరుతో ఆటో కార్మికుల పొట్ట కొట్టకూడదని ప్రధానమంత్రిని వారు కోరారు.
స్వచ్ భారత్ లో అగ్ర భాగాన నిలిచి సిపాయిళ్ల శ్రమిస్తున్న సపాయి కార్మికుల వేతనాలు పెంచి, 2016 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కోట్లాది కార్మికులు రైతులు ఆధారపడిన బీడీ పరిశ్రమను దెబ్బతీయడానికి అనేక ఆంక్షలు పెట్టి కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని వారు తెలిపారు. ఎల్ఐసి, ఇన్సూరెన్స్, కంపెనీలను కంటిరప్పలా కాపాడవలసిన బాధ్యత మరిచిపోయి, కార్పొరేట్ కంపెనీలకు అమ్మేసే కుట్రలో మోడీ సర్కార్ ఉందని వారు తెలిపారు.
రైతు, కార్మిక, విద్యార్థి యువజన, మహిళలు, ఉద్యోగులు, మేధావులు, ఐక్యంగా మోడీ రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16న జరిగే సమ్మె, గ్రామీణ బంద్ లో పాల్గొనాలని వారు కార్మికులకు విజ్ఞప్తి చేశారు. రానున్న ఎన్నికల్లో బిజెపి తగిన గుణపాఠం నేర్పించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.