జీవన్ రెడ్డి మాల్ కు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ

-విద్యుత్ శాఖ తీరుపై హైకోర్టు ఆగ్రహం

-ధర్మమే గెలిచింది, అధర్మం ఓడింది

-కక్ష సాధింపు చర్యలకు భయపడేది లేదు

-కుట్రదారులకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు

-మాది ఉద్యమ కుటుంబం

-ఉమ్మడి పాలకుల దాస్టీకాలనే తట్టుకున్నాం

-ఈ తాటాకు చప్పుళ్లకు భయపడతామా?

-ఆశన్నగారి రజితారెడ్డి స్పస్టీకరణ

-విద్యుత్ శాఖ అధికారులపై పరువునష్టం దావా

-నష్టపరిహారంపై వినియోగదారుల ఫోరంలో కేసు

ఆర్మూర్, డిసెంబర్15:-

హైకోర్టు ఆదేశంతో ఆర్మూర్ పట్టణంలోని జీవన్ రెడ్డి మాల్ కు విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ సరఫరాను పునరుద్ధరించారు. ఆశన్నగారి రజితారెడ్డి కి చెందిన జీవన్ రెడ్డి మాల్ కు నిబంధనలు ఉల్లంఘించారంటూ విద్యుత్ శాఖ అధికారులు కరెంటు సరఫరాను నిలిపివేసిన సంగతి విధితమే. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాల్ యాజమాన్యం కరెంటు కట్ వెనుక రాజకీయ ప్రమేయం, కక్ష సాధింపు చర్యలు ఉన్నాయని అనుమానించింది. ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగకపోయినా రాజకీయ వత్తిళ్లకు తలొగ్గి జీవన్ రెడ్డి మాల్ కు విద్యుత్ సరఫరా నిలిపివేసి భారీగా ఆర్థిక నష్టం వాటిల్లడానికి కారణమయ్యారని రజితారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం విద్యుత్ శాఖ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పది నిమిషాల్లోగా జీవన్ రెడ్డి మాల్ కు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో హడలిపోయిన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ అయిదు నిమిషాలలోనే జీవన్ రెడ్డి మాల్ కు కరెంటు సరఫరాను పునరుద్ధరించారు.

ధర్మమే గెలిచింది

హైకోర్టు తీర్పుతో భారీ ఊరట లభించిన జీవన్ రెడ్డి మాల్ యజమాని ఆశన్నగారి రజితారెడ్డి ‘అన్యాయం ఓడింది, ధర్మమే గెలిచింది’ అని సంతోషం వ్యక్తం చేశారు. తమకు వ్యతిరేకంగా రాజకీయ కుట్రలు చేస్తున్నవారికి ఇది పెద్ద పరాజయం. ఎన్నికల్లో గెలిచిన వారు ప్రజలకు సేవచేయాలి. దాన్ని మర్చి ప్రత్యర్థులపై రాజకీయ వేధింపులకు దిగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.
కక్ష సాధింపు చర్యలకు భయపడేది లేదు. కుట్రదారులకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు. మాది ఉద్యమ కుటుంబం. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఉమ్మడి పాలకుల దాస్టీకాలనే ఎదిరించి నిలిచినోళ్లం. ఈ తాటాకు చప్పుళ్లకు భయపడతామా?. ఎలాంటి కుట్రలనైన ఎదుర్కొంటాం. వారికి ఏ మాత్రం రాజకీయ విలువలున్నా ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు స్వస్తి చెప్పి ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలి అని ఆశన్నగారి రజితారెడ్డి స్పష్టం చేశారు.

విద్యుత్ శాఖ అధికారులపై పరువునష్టం దావా

ఇదిలావుండగా నిబంధనలన్నీ సక్రమంగానే ఉన్నప్పటికీ రాజకీయ వత్తిళ్లకు లొంగి అక్రమంగా కరెంటు సరఫరా నిలిపివేసి తమ ప్రతిష్టకు భంగం కలిగించారని విద్యుత్ శాఖ అధికారులపై జీవన్ రెడ్డి మాల్ యాజమాన్యం కోర్టులో పరువునష్టం దావా వేసింది. జిల్లా విద్యుత్ శాఖ అధికారితో పాటు అన్ని స్థాయిల అధికారులపై మాల్ యాజమాన్యం పరువునష్టం పిటిషన్ దాఖలు చేసింది. అన్యాయంగా కరెంటు సరఫరా నిలుపుదల చేయడం వల్ల జరిగిన ఆర్థిక నష్టాన్ని భరించలేకపోతున్న జీవన్ రెడ్డి మాల్ యాజమాన్యం
నష్టపరిహారం కోరుతూ వినియోగదారుల ఫోరంలో కూడా కేసు దాఖలు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *