నిజామాబాద్ A9 న్యూస్:

రానున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ గురువారం బాల్కొండ, ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గ కేంద్రాలలో ఎన్నికల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాల్కొండ అసెంబ్లీ సెగ్మెంట్ కు సంబంధించి భీంగల్ పట్టణంలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కొనసాగనుంది.

ఈ నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ, ఎన్నికల సామాగ్రిని భద్రపర్చే స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ తదితర వాటికి అనువైన కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలను సందర్శించి, అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. భీంగల్ లోని తహశీల్దార్, ఎంపిడిఓ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం, దాని పరిసరాలను పరిశీలించారు.

అదేవిధంగా ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోని తహశీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలను, ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని పరిశీలించారు. పోలింగ్ సామాగ్రి స్వీకరణ, వాటి పంపిణీకి సరిపడా స్థలం అందుబాటులో ఉందా లేదా అని పరిశీలన చేశారు. రవాణా సౌకర్యం, టాయిలెట్స్ వంటి వసతులు ఉన్నాయా అని స్థానిక అధికారులను కలెక్టర్ ఆరా తీశారు.

ఎన్నికల నిర్వహణ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, అవసరమైన చోట మరమ్మతులు, పరిశుభ్రత పనులు చేపట్టి పచ్చదనం పెంపొందించాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేపడతామని సీ.పీ సత్యనారాయణ అన్నారు.

ఈ సందర్భంగా ఆర్మూర్ ఆర్డీఓ కార్యాలయంలో ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ను కలెక్టర్ సందర్శించి కేంద్రం నిర్వాహకులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, పి.యాదిరెడ్డి, అదనపు డీసీపీ జయరాం, ఆర్మూర్ ఏసీపీ జగదీష్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ రషీద్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *