బాల్కొండ:
బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామంలో ఉమ్మడి బాల్కొండ (బాల్కొండ,మెండోరా,ముప్కాల్ మండలాల) అంతర పాఠశాల క్రీడోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు
ఈ సందర్భంగా విద్యార్థులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఆయా పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన పరేడ్ ను తిలకించి, వారి గౌరవ వందనం స్వీకరించారు. విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్బంగా మంత్రి ఉపాధ్యాయులను సన్మానించారు.
మంత్రి వేముల మాట్లాడుతూ..
విద్యార్థుల పరేడ్,గౌరవ వందనం ఇక్కడ ఉన్న వారిని మంత్ర ముగ్ధులను చేసిందని అన్నారు. తాను నిజామాబాద్ లో జెండా పండుగకు పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన దాని కంటే ఇవాళ విద్యార్థుల గౌరవ వందనంతో రెట్టింపు సంతోషం కలిగిందన్నారు. ఉమ్మడి బాల్కొండ పాఠశాలల క్రీడాప్రారంభోత్సవ వేడుకకు హాజరు అవ్వడం తాను 10వ తరగతి చదివినప్పటి రోజులు గుర్తు చేస్తున్నాయన్నారు. ఇదే వేదిక మీద తాను సంవత్సరం పాటు(ఇప్పటి లాగ రికార్డెడ్ సాంగ్ ప్లేయింగ్ కాకుండా) ప్రతిజ్ఞ చెప్పానని నాటి జ్ఞాపకాలు నెమరేసుకున్నారు. నాడు విద్యార్థిగా ప్లెడ్జ్ చదివిన ఈ వేదిక మీదనే ఈ ప్రాంత ప్రజా ప్రతినిధిగా,రాష్ట్ర మంత్రిగా ప్రసంగిస్తుండడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. ఈ విద్యార్థులు భవిష్యత్తులో శాస్త్ర వేత్తలు, ప్రముఖులు,ఉన్నతులు అవుతారని వీరే భావి భారత పౌరులని అన్నారు. చంద్రయాన్,నృత్యం,ఇతర కళా నైపుణ్యంతో వేడుక కన్నుల పండువగా ఉందన్నారు. చిన్నారి సొంతగా నేర్చుకొని నాట్యం చేయడం అద్భుతమని కొనియాడారు. క్రీడల్లో ఆడే వారు స్పోర్ట్స్ స్పిరిట్ తో ఉంటారని అంటే గెలుపు, ఓటమికి పొంగిపోవడం,కుంగి పోవడం ఉండవన్నారు. ఇదే స్ఫూర్తిని జీవితంలో కొనసాగించాలని సూచించారు. విద్యార్థులకు ఇంత చక్కటి ట్రైనింగ్ ఇచ్చిన పి.ఈ. టి లకు,ఉపాధ్యాయులకు, పాఠశాల యాజమాన్యంకు మంత్రి హృదయ పూర్వక శుభాకాంక్షలు,అభినందనలు తెలియజేశారు. క్రీడల్లో పాల్గొనే విద్యార్థులకు మంత్రి ఆల్ ది బెస్ట్ చెప్పారు. విద్యార్థిని, విద్యార్థులకు తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని అన్నారు.