హైదరాబాద్, ఏప్రిల్ 16: డ్రగ్స్ సరఫరాను నిర్మూలించేందుకు పోలీసులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సోదాలతో డ్రగ్స్ సరఫరా చేసే వారి గుండెల్లో గుబులు పుట్టిస్తూనే ఉన్నారు. తెలంగాణను డ్రగ్స్ రహితంగా మార్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పక్కా సమాచారాలతో వెళ్లి మరీ డ్రగ్స్‌లను స్వాధీనం చేసుకోవడంతో పాటు.. డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిని పట్టుకుంటున్నారు. డ్రగ్స్ కేసులో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని ఓ పక్క పోలీసులు హెచ్చరిస్తుంటే.. మరోవైపు ఇదేమీ తమకు పట్టవన్న చందంగా డ్రగ్స్ సరఫరాకు పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు.
తాజాగా నగరంలో మరోసారి పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడటం సంచలనంగా మారింది. అయితే డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తి గురించి తెలిసి పోలీసులు షాక్ అవ్వాల్సిన పరిస్థితి. ఇంతకీ సిటీలో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడింది.. డ్రగ్స్ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు.. ఎక్కడి నుంచి తెచ్చాడో ఇప్పుడు చూద్దాం.
నగరంలోని గచ్చిబౌలి పరిధిలోని శరత్ సిటీ మాల్‌లో పెద్దఎత్తున డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అక్కడ డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం వెళ్లింది. దీంతో ఎంతో రహస్యంగా డ్రగ్స్‌ను పట్టుకునేందుకు అక్కడకు చేరుకున్నారు. ప్రతీ ఒక్కరిపై నిఘా పెట్టారు. చివరకు ఓ వ్యక్తి అనుమానస్పదంగా కనిపించడంతో అతడిని పట్టుకుని సోదాలు జరిపారు. ఆ వ్యక్తి వద్ద భారీ ఎత్తున డ్రగ్స్ లభ్యమైంది. నిందితుడు ఎక్కడి నుంచి వచ్చాడు అనేదానిపై పోలీసులు ఆరా తీశారు.
అయితే మాదకద్రవ్యాలతో పట్టుబడ్డ వ్యక్తి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాడని.. అంతే కాకుండా ఉత్తరప్రదేశ్ మాజీ సీఎస్ కుమారుడిగా గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అసలు ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకువచ్చాడు.. ఎవరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడనే దానిపై సంబంధిత అధికారులు ఆరా తీస్తున్నారు. అధికారుల విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో వేచి చూడాలి. అయితే ఎక్కడిక్కడ డ్రగ్స్ సరఫరాను అడ్డుకుంటున్నప్పటికి ఎక్కడో చోట ఇలా డ్రగ్స్ పట్టుబడటం పోలీసులకు పెను సవాల్ అనే చెప్పుకోవచ్చు..