A9 న్యూస్, ఏప్రిల్ 9:
ఆర్టికల్ 200 ప్రకారం అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు గవర్నర్లు నొక్కిపెట్టలేరు.
తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్ రవిపై సుప్రీం సీరియస్.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో గవర్నర్లు మార్గదర్శిగా, తత్వవేత్తగా పనిచేయాలి. రాజకీయ ప్రేరణతో ఉండకూడదు.
గవర్నర్ అధికారాలు, బాధ్యతలపై కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం.
గవర్నర్లు ప్రజల ప్రజాస్వామ్య సంకల్పాన్ని దెబ్బతీయకూడదని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం తేల్చిచెప్పింది. నిర్ణయం తీసుకునే ప్రక్రియలో అనవసరమైన జాప్యాలను నివారించేలా స్పష్టమైన మార్గదర్శకాలను సూచించింది. ఈ సందర్భంగా తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై ధర్మాసనం సీరియస్ అయింది. రాష్ట్ర అసెంబ్లీ పంపిన బిల్లులను తన వద్దే పెట్టుకునే వీటో అధికారం గవర్నర్ కు లేదని స్పష్టం చేసింది. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి చర్యలు చట్టవిరుద్ధమని, ఏకపక్షమని పేర్కొంది. ఆయన వద్ద పెండింగ్లో ఉన్న 10 బిల్లులకు క్లియరెన్స్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రశాసన సభ నుంచి వచ్చిన బిల్లులకు గవర్నర్ తప్పనిసరిగా అనుమతి ఇవ్వాలని, అయితే బిల్లులో వైరుధ్యం ఉంటే దాన్ని తిరస్కరించాలని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. అంతేతప్ప అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల్ని గవర్నర్ శాశ్వతంగా తన వద్ద ఉంచుకోలేరని తేల్చిచెప్పింది. అందుకే ఆ చర్యలను పక్కన పెడుతున్నామని, ఆ బిల్లులను గవర్నర్ కు సమర్పించిన నాటి నుంచి వాటికి క్లియరెన్స్ దక్కినట్లు కోర్టు ప్రకటించింది. తమ బిల్లులకు గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదని తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ పై కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది.
సుదీర్ఘంగా పెండింగ్ పెట్టడానికి వీల్లేదు..
10 బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపాలన్న గవర్నర్ చర్య చట్టవిరుద్ధం. గవర్నర్ బిల్లును పునపరిశీలనకు వెనక్కి పంపిన తర్వాత, అసెంబ్లీ తిరిగి ఆమోదించిన తర్వాత రెండోసారి బిల్లును రాష్ట్రపతికి సిఫార్సు చేయకూడదు. అలాచేస్తే చట్టవిరుద్ధం అవుతుంది. అసెంబ్లీ రెండవసారి ఆమోదించిన బిల్లులు గవర్నర్ ఆమోదం పొందినట్లుగానే పరిగణించాలి. ఒకవేళ రాష్ట్రపతికి నివేదించాల్సి వస్తే నెల రోజుల్లోపే ఆపనిచేయాలి. రాష్ట్రపతికి సిఫార్సు అవసరం లేదంటే 3 నెలల్లోపు క్లియర్ చెయ్యాలి. అంతేతప్ప శాశ్వతంగా వాటిని తొక్కిపెట్టడానికి వీల్లేదు అని సుప్రీం తన తీర్పులో స్పష్టం చేసింది.