హైదరాబాద్, ఏప్రిల్ 5: హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త, సమాచార కమిషన్ సెలెక్షన్ కమిటీ శనివారం సమావేశమైంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ డుమ్మాకొట్టారు. ప్రతిపాదిత పేర్లను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు తెలంగాణ ప్రభుత్వం పంపనుంది. ఇక ప్రధాన సమాచార కమిషనర్ రేసులో సీఎస్ శాంతి కుమారి ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసం సీఎస్‌గా శాంతి కుమారి రాజీనామా చేస్తారని సచివాలయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త, సమాచార కమిషన్‌లు అత్యంత కీలకమైన కమిషన్‌లు. హెచ్‌ఆర్‌సీలో చైర్మన్, ముగ్గురు కమిషన్ సభ్యుల స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. అలాగే సమాచార కమిషన్‌కు సంబంధించి కమిషన్ చైర్మన్, ఐదుగురు కమిషనర్‌ల స్థానాలు కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. దాంతో పాటు లోకాయుక్త, ఉపలోకాయుక్త కూడా ఖాళీగా ఉన్నాయి. వీటన్నింటి భర్తీపై తెలంగాణ రాష్ట్ర సర్కార్ దృష్టి సారించింది. ఆ మూడు కమిషన్‌ల భర్తీ కోసం కసరత్తు మొదలుపెట్టింది. అందులో భాగంగా ఈరోజు (శనివారం) సెలెక్షన్ కమిటీ సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నారు. ఈ మూడింటికి సెలక్షన్ కమిటీలో ముఖ్యమంత్రి చైర్మన్‌గా ఉండటంతో పాటు పలువురు సభ్యులు ఉంటారు.
ఈ మూడు కమిటీలో ముఖ్యమంత్రితో పాటు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ సభ్యులుగా ఉంటారు. ఈ సెలక్షన్ కమిటీ సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రావాల్సిందిగా ఆహ్వానం పంపారు. కానీ సెలక్షన్ కమిటీలో సభ్యులుగా ఉన్న ప్రధాన ప్రతిపక్ష నేత ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. అయినప్పటికీ ఈ సమావేశం కొనసాగుతోంది. ఇప్పటికే రెండు సెలక్షన్ కమిటీ సమావేశాలు ముగిశాయి. హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్తకు సంబంధించిన సెలక్షన్ కమిటీ సమావేశం ముగిసింది. ప్రస్తుతం సమాచార కమిషన్‌కు సంబంధించిన సెలెక్షన్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో ఎవరెవరిని కమిషన్ చైర్మన్‌లుగా నియమించాలి, అలాగే సభ్యులుగా ఎవరిని నియమించాలనే దానిపై చర్చ జరుగుతోంది. ఈ సమావేశంలో నిర్ణయాల మేరకు ప్రతిపాదనలను గవర్నర్‌కు పంపనున్నారు. ఆ ప్రతిపాదనల మేరకు గవర్నర్ వారిని నియమిస్తారు. కాగా.. ప్రధాన సమాచార కమిషనర్ రేసులో సీఎస్ శాంతి కుమారి ఉన్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అందుకోసం సీఎస్ పదవికి రాజీనామా చేస్తారనే ఓ చర్చ కూడా నడుస్తోంది. ఈ సమాశంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది..