అకాల వర్షాల వల్ల హైదరాబాద్ నగరంలో ఉత్పన్నమైన పరిస్థితులను ఎదుర్కొనడానికి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వర్షంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, ఈదురుగాలుల కారణంగా తలెత్తిన పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా తక్షణ సహాయక చర్యల కోసం అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
✳️ నగరంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రదేశాల్లో వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, విద్యుత్ అంతరాయాలు లేకుండా జీహెచ్ఎంసీ, పోలీసు, హైడ్రా విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
✳️ విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో వెంటనే సమస్యను పరిష్కరించి సరఫరాను పునరుద్ధరించాలని చెప్పారు. జలమయమైన కాలనీల్లో ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అన్నారు. పోలీసులు క్షేత్రస్థాయిలో ఉండి ట్రాఫిక్ సమస్యను ఎక్కడికక్కడ పరిష్కరించాలని చెప్పారు.
✳️ పలు జిల్లాల్లో కూడా వర్షాలు, ఈదురుగాలులు, వడగండ్లు పడుతున్నందున జిల్లా కలెక్టర్లు, పోలీసు యంత్రాంగం, ఇతర అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు..