*అనుకూలంగా 288.
*వ్యతిరేకంగా 232 ఓట్లు
దిల్లీ: సుదీర్ఘ సంవాదాల అనంతరం వక్ఫ్ (సవరణ) బిల్లు-2025కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. విపక్ష ఇండియా కూటమి, ఎంఐఎం తదితర పక్షాల ఆరోపణలను, విమర్శలను అధికార పక్షం గట్టిగా తిప్పికొట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మైనారిటీ వ్యవహారాల మంత్రి రిజిజు దీటుగా జవాబిచ్చారు. అధికార, విపక్ష సభ్యుల వాద ప్రతివాదాలతో సభ ప్రతిధ్వనించింది. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం తెల్లవారుజాము 2.15 గం.లు దాటే వరకూ చర్చ, ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు వేశారు. 56 ఓట్ల తేడాతో ప్రతిపక్షాల అభ్యంతరాలు వీగిపోయాయి. ఇటీవల కాలంలో ఇంత సుదీర్ఘ సమయం పాటు లోక్‌సభ భేటీ కొనసాగడం ఇదే ప్రథమం.
బిల్లుకు ఎన్డీయే ప్రధాన భాగస్వామ్యపక్షాలైన తెదేపా, జేడీ(యు), శివసేన (శిందే), లోక్‌జనశక్తి పార్టీ (రామ్‌విలాస్) మద్దతివ్వడంతో భాజపాలో ఉత్సాహం ఇనుమడించింది. మరోవైపు విపక్ష ఇండియా కూటమిలోని పార్టీలు ముక్తకంఠంతో బిల్లును వ్యతిరేకించాయి. తీవ్ర నిరసనను ప్రకటించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తన చేతిలోని బిల్లు ప్రతిని చింపివేశారు. వైకాపా కూడా బిల్లుకు ప్రతికూలంగానే స్పందించింది. చర్చ, *ఆమోదం కోసం వక్ఫ్ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానుంది*