మావోయిస్టులు ఒక్కసారిగా తమ స్వరం మార్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే మావోయిస్టులు తాజాగా శాంతి చర్చల అంశాన్ని తెరపైకి తెచ్చారు. కేంద్రంతో చర్చలకు తాము సిద్ధమని ఓ లేఖ విడుదల చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ పేరుతో ఈ లేఖ విడుదలైంది. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ కేంద్రానికి ఒక లేఖను విడుదల చేశారు. నక్సల్ ప్రభావిత రాష్ట్రాలైన ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్రలలో తక్షణమే కేంద్ర బలగాలు కాల్పులను నిలిపివేయాలని సదరు లేఖలో కోరారు. తాము కూడా కాల్పుల విరమణను పాటించి శాంతి చర్చలకు సానుకూల వాతావరణాన్ని కల్పిస్తామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ముందుకొస్తే అందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ మావోయిస్టులు ఆ లేఖలో స్పష్టం చేశారు..