March 31, 2025 2:09 am
HCU battlefield– వేలం వేసే భూమి చదును చేసేందుకు ప్రభుత్వం కసరత్తు
– సెలవులు చూసుకుని రంగంలోకి దిగిన ప్రభుత్వ యంత్రాంగం
– జేసీబీ, ట్రక్కులను అడ్డుకున్న విద్యార్థులు, పోలీసుల దాడి
– విద్యార్థినుల జుట్టు పట్టి లాక్కెళ్ళిన పోలీసులు
– వేరే రాష్ట్రం విద్యార్థులు కావడంతో బూతులు తిడుతూ విచక్షణ కోల్పోయిన వైనం
– అడవిని నాశనం చేస్తున్నారంటూ విద్యార్థుల ఆందోళన
– విద్యార్థుల అరెస్టు, పోలీస్‌స్టేషన్లకు తరలింపు
– భూముల వేలం ఆపాల్సిందే.. : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఐక్య కార్యాచరణ కమిటీ
నవతెలంగాణ-మియాపూర్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మరోసారి రణరంగంగా మారింది. యూనివర్సిటీ భూముల వేలానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో దీనిపై విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వరుసగా ఆందోళనలు చేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో భూముల వేలం ఆపాలని డిమాండ్ చేస్తూ వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం సెలవు దినం కావడంతో ఇదే అదనుగా ప్రభుత్వ యంత్రాంగం.. వేలం వేసే 400 ఎకరాల భూమిలో చదును చేసేందుకు పూనుకుంది. జేసీబీలు, ట్రక్కులతో అధికారులు భూముల్లోకి వెళ్లారు. పోలీసుల సహకారంతో చదును చేసే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు ఒక్కసారిగా ర్యాలీగా భూముల వద్దకు వచ్చారు. జేసీబీలు, ట్రక్కులను అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. విద్యార్థులను అరెస్టు చేసి వివిధ పోలీసుస్టేషన్లకు తరలించారు.
విద్యార్థులపై పోలీసుల దాడి
యూనివర్సిటీ భూములు వేలం వేయొద్దని, ఆ భూములను కాపాడాలని నినాదాలు చేస్తూ విద్యార్థులు జేసీబీలు, ట్రక్కులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళననను పోలీసులు అడ్డుకున్నారు. యూనివర్సిటీ ఈస్ట్ వైపు భారీగా బలగాలను మోహరించారు. ఈ క్రమంలో విద్యార్థుల పట్ల పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తించారు. కనీస మానవత్వం మరిచి.. ఇష్టానుసారంగా వ్యవహరించారు. విద్యార్థులను లాక్కెళ్లి పోలీసు వాహనాల్లోకి ఎక్కించారు. విద్యార్థినులని కూడా చూడకుండా జుట్టు పట్టుకుని లాక్కెళ్ళి వ్యాన్‌లో పడేశారు. వేరే రాష్ట్రాల విద్యార్థులు కావడంతో విద్యార్థులు ఏం చెప్తున్నారో కనీసం అర్థం చేసుకోనంత స్థితిలోకి పోలీసు యంత్రాంగం వెళ్లింది. ఈ సందర్భంగా స్వల్ప లాఠీచార్జి జరిగినట్టు తెలుస్తోంది. ఆందోళన చేస్తున్న విద్యార్థులందరినీ అరెస్టు చేసి గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ తదితర పోలీస్‌స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలో తమను ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పడం లేదని, పోలీసులు తమ పట్ల అనుచితంగా ప్రవర్తించారని విద్యార్థులు సెల్ఫీ వీడియాలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. పోలీసుల తీరు పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల అరెస్టును, ప్రభుత్వ తీరును ఖండించారు. ఇదిలా ఉంటే అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ శనివారం రాత్రి విద్యార్థులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ క్రమంలో కూడా విద్యార్థులను పోలీసులు అడ్డుకోగా పలువురు గాయపడి ఇప్పటికే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
భూముల వేలం ఆపాల్సిందే.. : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఐక్య కార్యచరణ కమిటీ
సెంట్రల్ యూనివర్సిటీ భూములు వేలం వేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, భూముల వేలం ఆపాల్సిందేనని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఐక్య కార్యచరణ కమిటీ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భూముల వేలం విషయంలో ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి విద్యార్థుల పట్ల ఇష్టానురీతిగా మాట్లాడటం సరికాదన్నారు. విద్యార్థులు శాంతియుతంగా ఆందోళనలు చేస్తుంటే పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారని తెలిపారు. ఒకవైపు ఫ్రెండ్లీ పోలీస్ అంటూనే నిరసన తెలుపకుండా పూర్తిగా పోలీస్ రాజ్యంగా మార్చారని ఆరోపిం చారు. తెలంగాణ ప్రభుత్వం బయటకు ప్రకటనలు ఒకలాగా చేస్తూ తమ భూమిని పూర్తిగా పెద్ద, పెద్ద కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు అనునిత్యం పని చేస్తోందని విమర్శించారు. విద్యార్థుల పట్ల అమర్యాదగా ప్రవర్తించిన పోలీసులపై విచారణ జరిపించాలని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకూ తమ పోరాటం కొనసా గుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ విషయంపై అన్నీ పార్టీల నాయకులను కలిసినట్టు తెలిపారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, ఢిల్లీ వరకూ తమ పోరా టాన్ని కొనసాగిస్తామన్నారు. యూనివర్సిటీలో జీవ వైవిధ్యాన్ని ధ్వంసం చేయొద్దని, అడవిని కాపాడాలని డిమాండ్ చేశారు.
మాదాపూర్ పీఎస్ ఎదుట సీపీఐ(ఎం), ఎస్ఎఫ్ఐ ఆందోళన
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల అరెస్టు నిరసిస్తూ మాదాపూర్ పీఎస్ ఎదుట సీపీఐ(ఎం), ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన చేశారు. విద్యార్థుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును ఖండించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి యాదయ్య మాట్లాడుతూ.. విద్యార్థులను అరెస్టు చేయడం సరికాదన్నారు. విద్యార్థుల ఆధార్ కార్డులు తీసుకోవడం, మళ్లీ ఆందోళనలో పాల్గొనబోమని విద్యార్థుల నుంచి వీడివీడిగా ఒక్కొక్కరి వీడియోను తీసుకునే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తెలిపారు. హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఖండించారు. ఈ ధర్నాలో సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఈ.నర్సింహ, జిల్లా కమిటీ సభ్యులు రుద్రకుమార్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కిరణ్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
అక్రమంగా అరెస్టు చేసిన విద్యార్థులను విడుదల చేయాలి : సీపీఐ(ఎం)
అక్రమంగా అరెస్టు చేసిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని కార్పోరేట్ సంస్థలకు అప్పగించాలనే ప్రయత్నాన్ని అడ్డుకుంటున్న విద్యార్థులను అరెస్టు చేయటం దుర్మార్గమని పేర్కొన్నారు. దీన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నదని తెలిపారు. 400 ఎకరాల్లో పర్యావరణం, అటవికి సంబంధించిన ఆనవాళ్లు లేకుండా చేయటానికి జేసీబీలను, బుల్డోజర్‌లను తీసుకురావటమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారనీ, గత రెండు దశాబ్దాలుగా కేంద్రీయ యూనివర్సిటీ భూములు అనేక కారణాల చూపిస్తూ ప్రభుత్వం అన్యాక్రాంతం చేస్తున్నదని తెలిపారు. సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూముల వేలం ప్రక్రియను ఆపాలనీ, జేపీబీ బుల్డోజర్లను, పోలీసు బలగాలను వెనక్కి రప్పించాలనీ, అరెస్టయిన విద్యార్థులను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్