హైదరాబాద్, మార్చి 30: శ్రీమంతులు తినే సన్న బియ్యం.. ఇకపై పేదలూ తింటారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అర్హులందరికీ తమ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుందన్నారు. రేషన్ కార్డులోని సభ్యులు ఒక్కొక్కరికీ 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తామని తెలిపారు. ఆదివారం సూర్యాపేట్ జిల్లాలోని హుజూర్‌నగర్‌లో ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఉగాది పండగ రోజు ఈ పథకం ప్రారంభించడం తనకు సంతోషంగా ఉందన్నారు. పేదలకు కడుపు నిండా అన్నం పెట్టేందుకే ఈ సన్నబియ్యం పథకం అమలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

పండగలకే కాదు.. ప్రతిరోజూ పేదలకు తెల్ల అన్నం తినాలని ఆయన ఆకాంక్షించారు. పేదలకు ఆహార భద్రత కోసమే ప్రజాపంపిణీ వ్యవస్థ ఉందని పేర్కొన్నారు. పీడీఎస్‌ను 70 ఏళ్ల క్రితమే కాంగ్రెస్‌ అమలు చేసిందని.. దీనిని నాటి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ కొనసాగించారని గుర్తు చేశారు. అయితే దొడ్డు బియ్యం ఇస్తే చాలా మంది అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలు దొడ్డు బియ్యం తినడం లేదని.. మిల్లర్ల మాఫియాలోకి వెళ్తోందని విమర్శించారు. దొడ్డు బియ్యంతో ఏటా రూ.10 వేల కోట్ల దోపిడీ చేస్తున్నారని సీఎం రేవంత్‌ రెడ్డి వివరించారు.

ఈ సన్న బియ్యం పథకం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. చరిత్రలో ఎవరు సీఎం అయినా ఈ పథకం కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు ఇది తెలంగాణ ప్రజల అదృష్ణమని ఆయన అభివర్ణించారు. నల్గొండ రైతాంగాన్ని ఆదుకోవడానికి నెహ్రూ కాలం నుంచి.. నేటి వరకు కాంగ్రెస్‌ పార్టీ ఎన్నో ప్రాజెక్టులు నిర్మించిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అయితే ప్రతిష్టాత్మక ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం కేసీఆర్‌ నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ఏడాదికి కిలోమీటర్‌ తవ్వినా ఈ ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పూర్తయ్యేదని ఆయన చెప్పారు. కేసీఆర్‌ కట్టింది కాళేశ్వరం కాదు.. కూలేశ్వరం అని ఆయన ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లలోనే కూలిపోయిందని సీఎం రేవంత్‌ రెడ్డి ఎద్దేవా చేశారు.

శకునం చెప్పే బల్లి.. కుడితిలో పడి చచ్చినట్లుగా బీఆర్ఎస్ పార్టీ నేతల పరిస్థితి ఉందని ఆయన విమర్శించారు. సన్న బియ్యం ఎలా ఇస్తారని వారు శాపనార్థాలు పెడుతున్నారన్నారు. కానీ తమ సంకల్పబలం చాలా గొప్పదని ఆయన పేర్కొన్నారు. అర్హులైన అందరికి ఈ సన్నబియ్యం పథకాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు. అలాగే రైతు రుణ మాఫీ కూడా చేశామన్నారు. తనకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నందికి పందికి ఉన్నంత తేడా ఉందన్నారు. అయినా.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తనతో పోల్చుకోవడం ఏమిటని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు..

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *