సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డిది రాక్షస పాలన, రాబందుల పరిపాలన అంటారా అని ధ్వజమెత్తారు. ఆయన జైల్లో ఉండాల్సిన వ్యక్తని ప్రవీణ్ కుమార్ ఎలా అంటున్నారని ప్రశ్నించారు. ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నందుకు సిగ్గుపడాలని విమర్శించారు. బీఎస్పీ పార్టీలో ఉన్నప్పుడు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాక్షసుడు ,కేసీఆర్ పాలన రాక్షస పాలన అని ప్రవీణ్ కుమార్ అనలేదా అని ఎంపీ మల్లు రవి నిలదీశారు.
మంత్రులకు, ఎమ్మెల్యేలకు కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వట్లేదని ప్రవీణ్ కుమార్ గతంలో అనలేదా అని ఎంపీ మల్లు రవి నిలదీశారు. మూడు నెలల పాటు కేసీఆర్ తనను కూడా కలవనీయలేదని గతంలో ప్రవీణ్ కుమార్ అన్నాడని గుర్తుచేశారు. మరి ఇప్పుడు ఆయన చేసే వ్యాఖ్యలు కేసీఆర్ కుటుంబ సభ్యుల కోసమా ఆయన కోసమా చెప్పాలని ప్రశ్నించారు. ఒక దళిత వ్యక్తిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై సిగ్గుపడుతున్నానని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కీలక మార్పులు తీసుకు వస్తున్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సామాజిక న్యాయం కోసం గొప్ప విప్లవాన్ని తీసుకువస్తున్నారని ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు..