గెలుపు, ఓటమి, అవమానాలు, పొగడ్తలు.. అంతా అయిపోయిందని అనుకునే సమయంలో నిప్పురవ్వలా తిరిగి పైకి లేచే తత్వం. కేసీఆర్‌.. ఈ మూడు అక్షరాలను తెలంగాణ ప్రజలు అంత సులభంగా మర్చిపోలేరు.

 

ఫిబ్రవరి 17వ తేదీ కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలు, ఆసక్తికర విషయాలు మీకోసం..

 

1954 ఫిబ్రవరి 17వ తేదీన కల్వకుంట్ల రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు ప్రస్తుత సిద్ధిపేట జిల్లా చింతమడక గ్రామంలో జన్మించారు కల్వకుంట్ల చంద్రశేఖరావు. నిజానికి కేసీఆర్‌ పూర్వీకులది సిరిసిల్లా జిల్లా నర్మాలా. అయితే అక్కడ మానేరు నదిపై నిర్మించిన జలాశయం కారణంగా భూమిని కోల్పోయిన కేసీఆర్‌ కుటుంబం, పరిహారం తీసుకుని చింతమడకలో స్థిరపడ్డారు. కేసీఆర్‌ ప్రాథమిక విద్యభ్యాసం అంతా దుబ్బాకలో జరిగింది. దుబ్బాకలో గురువుల దగ్గర ఉండి విద్యనభ్యసించారు కేసీఆర్‌.

 

ఆ తర్వాత హైస్కూల్‌లో చదువు కోసం కేసీఆర్‌ సిద్ధిపేట వెళ్లారు. అక్కడ హై స్కూల్‌ విద్యను పూర్తి చేశారు. 1969లో 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఆయనకు శోభతతో వివాహం జరిగింది. వివాహం తర్వాత సిద్ధిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చరిత్ర, రాజనీతి శాస్త్రం, తెలుగు సాహిత్యంలో బీఏ పూర్తి చేశారు. చదువుకునే రోజుల నుంచే కేసీఆర్‌కు నాయకత్వ లక్షణాలు, రాజకీయంపై ఆసక్తి ఉండేది.

 

*_ఓటమితో మొదలైన ప్రారంభం.._*

 

ఇంటర్‌ చదువుతున్న సమయంలోనే సంజయ్‌ గాంధీ స్థాపించిన యూత్ కాంగ్రెస్‌లో చేరాడు. డిగ్రీలో కేసీఆర్‌ విద్యార్థి నాయకుడిగా ఉండేవాడు. విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా తొలిసారి పోటీ చేసిన కేసీఆర్‌ ఓటమి పాలయ్యాడు. అయితే ఆ ఓటమి రాజకీయాల్లోకి రావాలన్న కేసీఆర్‌ ఆశను ఏమాత్రం తగ్గించలేదు. రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఎ. మదన్‌ మోహన్‌తో కేసీఆర్‌కు పరిచయం ఏర్పడింది. డిగ్రీ పూర్తి కాగానే మదన్‌ మోహన్‌ దగ్గర శిష్యుడిగా చేరాడు. మదన్‌ మోహన్‌తో ఏర్పడ్డ సానిహిత్యమే కేసీఆర్‌లో తెలంగాణపై ఆసక్తి మొదలైంది. 1978లో వచ్చిన మద్యంతర ఎన్నికల్లో మదన్‌ మోహన్‌ తరఫున కేసీఆర్‌ ప్రచారాలు చేపట్టారు. ఆ సమయంలో ఆయన ప్రసంగాలకు ప్రజలు పెద్ద ఎత్తున ఆకర్షితులయ్యారు. 1980లో సంజయ్‌ గాంధీ మరణం తర్వాత కేసీఆర్‌కి ఏం చేయాలో అర్థం కాలేదు.

 

సుమారు 13 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో ఉన్న కేసీఆర్‌ 1983లో ఎన్టీఆర్‌ టీడీపీని ఏర్పాటు చేయగా ఆ పార్టీలో చేరారు. కేసీఆర్‌లోని నాయకత్వ లక్షణాలు చూసిన ఎన్టీఆర్‌ 1983లో తొలిసారి సిద్ధిపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. అయితే కేసీఆర్‌ తన గురువు మదన్‌మోహన్ పై పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఎన్నికల్లో మదన్ మోహన్ పై కేవలం 877 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 1985లో సిద్ధిపేట నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి టి. మహేందర్‌ రెడ్డిపై విజయం సాధించారు. ఆ తర్వా 1987-88 మధ్యలో రాష్ట్ర సహాయ మంత్రిగా పనిచేశారు. కరువు నియంత్రణ మంత్రిత్వశాఖ మంత్రిగా 1988-89 మధ్యలో పనిచేశారు.

 

1989 నుంచి 1993 వరకు టీడీపీ మెదక్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు. 1989లో సిద్ధిపేట నియోజకర్గం నుంచి గెలుపొందారు. 1992లో పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీకి చైర్మన్‌గా ఏడాది పాటు వ్యవహరించారు. 1993లో ఏడాది పాటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 1995 నుంచి 96 వరకు పబ్లిక్‌ అండర్‌ టేకింగ్ కమిటీ సభ్యుడిగా సేవలందించారు. 1997 నుంచి 2000 వరకు రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు.

 

*_మలుపు తిప్పిన సంఘటన.._*

 

కేసీఆర్‌ రాజకీయ జీవితాన్ని 1999 సంవత్సరం మలుపు తిప్పిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 1999లో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో టీడీపీ మరోసారి అధికారంలోకి వచ్చింది. ఈ సమయంలోనే చంద్రబాబు సీబీఐ మాజీ డైరెక్టర్‌ విజయరామరావు టీడీపీలో చేరారు. 1999 ఎన్నికల్లో విజయరామరావు ఖైరతాబాద్ నుంచి విజయం సాధించారు. ఆ సమయంలో చంద్రబాబు విజయరామరావుకు మంత్రి వర్గంలో స్థానం కల్పించి కేసీఆర్‌కు డిప్యూటీ స్పీకర్‌గా పదవి ఇచ్చారు.

 

ఈ కారణంగానే కేసీఆర్‌ టీడీపీకి రాజీనామా చేశారని చెబుతుంటారు. అయితే కేసీఆర్‌ మాత్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతారు. 1991 నుంచి 2001 వరకు డిప్యూటీ స్పీకర్‌గా సేవలందించిన కేసీఆర్‌. 2001లో టీడీపీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ పార్టీని ఏర్పాటు చేశారు. 2003లో న్యూ స్టేట్స్‌ నేషనల్‌ ఫ్రంట్ కన్వీనర్‌గా సేవలందించారు. 2004లో 14వ లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్‌ నుంచి గెలుపొంది తొలిసారి ఢిల్లీకి వెళ్లారు. ఆ తర్వాత క్యాబినెట్‌ హోదాలో కార్మిక మంత్రిగా సేవలందించారు. అయితే 2006 సెప్టెంబర్‌ 23న లోక్‌షభకు రాజీనామా చేసిన కేసీఆర్‌ అదే ఏడాది డిసెంబర్‌ 7న జరిగిన ఉప ఎన్నికల్లో కరీంనగర్‌ నిజయోకవర్గం నుంచే గెలుపొందారు.

 

2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎంతో కలిసి టీఆర్‌ఎస్‌ పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలైంది. ఈ సమయంలో ఎంపీగా గెలిచిన కేసీఆర్‌, నరేంద్రలు ఇద్దరు యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రులుగా పనిచేశారు. రాష్ట్రంలో కెప్టెన్‌ కాంతారావు, హరీష్‌ రావు, నాయిని నర్సింహరెడ్డిలకు మంత్రి అవకాశం ఇచ్చారు వైఎస్సార్‌. అయితే 2006లో కాంగ్రెస్ విధానాలు నచ్చని కేసీఆర్‌ యూపీఏ నుంచి వైదొలిగి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. కరీంనగర్‌ నుంచే మళ్లీ పోటీ చేసి విజయం సాధించడం విశేషం.

 

ఇక 2009లో కేసీఆర్‌ టీడీపీతో చేతులు కలిపారు. తెలంగాణ సాధనే తమ ఏకైక లక్ష్యమని ఇందుకోసం ఎవరితో అయినా పొత్తుకు సిద్ధమని ఆ సమయంలో కేసీఆర్‌ తేల్చి చెప్పారు. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మరోసారి గెలిచింది. టీడీపీ కూటమి పరాజయం మూటగట్టుకుంది. ఇక ఆ తర్వాత 2009 సెప్టెంబర్ 2వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందారు. ఆ తర్వాత కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమాన్ని మరోసారి ఉదృతం చేశారు.

 

*_కేసీఆర్‌ చచ్చుడో తెలంగాణ వచ్చుడో.._*

 

2009 నవంబర్‌ 29వ తేదీన ‘కేసీఆర్‌ చచ్చుడో తెలంగాణ వచ్చుడో’ అన్న నినాదంతో సిద్ధిపేటలో ఆమరణ దీక్షకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో కరీంనగర్‌ నుంచి సిద్ధిపేటకు వస్తున్న కేసీఆర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి ఖమ్మం జైలుకు తరలించారు. అరెస్ట్‌ చేసినా తన దీక్షను కొనసాగిస్తున్నట్లు కేసీఆర్‌ స్పష్టం చేశారు. కేసీఆర్‌ ఆరోగ్యం క్షీణించడం, ఉస్మానియా విద్యార్థులు సైతం తెలంగాణ ఉద్యమాన్ని ఉదృతం చేయడం, సకల జనుల సమ్మె విజయవంతంగా సాగడంతో 2009 డిసెంబర్‌ 9వ తేదీన అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

 

దీంతో కేసీఆర్‌ దీక్షను విరమించారు. ఆ తర్వాత సీమాంధ్ర నాయకుల ఒత్తిడి, సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో కొన్ని రోజులు ఆగిన తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ 2014లో వేగం పెరిగింది. 2014 ఫిబ్రవరి 18వ తేదీన లోక్‌సభలో తెలంగాణ బిల్లును ఆమోదించారు. ఫిబ్రవరి 20వ తేదీన రాజ్యసభలో కూడా ఈ బిల్లకు ఆమోదం లభించింది. మార్చి 1వ తేదీన రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీంతో 2014 జూన్‌ 2వ తేదీన అధికారికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.

 

*_స్వరాష్ట్రంలో.._*

 

కొట్లాడి సాధించిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా నియమితులై చరిత్రలో చెరగని ముద్ర వేశారు కేసీఆర్‌. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 63 స్థానాల్లో విజయం సాధించింది. తెలంగాణ రాష్ట్రాన్ని అధికారికంగా ప్రకటించిన రోజే కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. ఇక 2018లో ఆరు నెలల ముందే ఎన్నికలు వెళ్లిన కేసీఆర్‌ మరోసారి విజయం సాధించారు. ఈసారి స్థానాలు మరింత పెరిగాయి. టీఆర్‌ఎస్‌ ఏకంగా 88 స్థానాల్లో గెలిచి విజయ దుందుభిని మోగించింది.

 

కేసీఆర్‌ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో మిషన్‌ భగీరథ, రైతు బంధు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌, హరితహారం, టీఎస్‌ఐసాప్‌, ఆసార పథకం, రైతుబీమా వంటి అనే సంస్కరణలు తీసుకొచ్చారు. ఇక ముచ్చటగా మూడోసారి కేసీఆర్‌ ముఖ్యమంత్రి కాలేకపోయారు. పార్టీ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చి దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇద్దామనుకున్న కేసీఆర్‌ ఆశ ఫలించదు. 2023 డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ కేవలం 39 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ 64 స్థానాల్లో గెలిచి విజయం సాధించింది.

 

 

*_కొన్ని ఆసక్తికర విషయాలు.._*

 

* పూర్తి పేరు: కల్వకుంట్ల చంద్రశేఖర రావు (K. Chandrashekar Rao)

 

* పుట్టిన తేది: 17 ఫిబ్రవరి 1954

 

* జన్మస్థలం: చింతమడక గ్రామం, సిద్దిపేట మండలం, మెదక్ జిల్లా (ప్రస్తుతం సిద్దిపేట జిల్లా)

 

* విద్యాభ్యాసం: ఓస్మానియా యూనివర్శిటీలో పట్టభద్రుడిగా చదివారు.

 

* భాషలు: తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ మాట్లాడగలరు.

 

* పుస్తకాలు చదవడం, శాస్త్రం, చరిత్ర పట్ల ఆసక్తి, పద్యాలు చదవడం వంటివి కేసీఆర్‌ హాబీలుగా చెప్పొచ్చు.

 

* “చిత్తశుద్ధితో ఏ పని చేసినా విజయం మీదే!” అనే సిద్ధాంతాన్ని కేసీఆర్‌ ఎక్కువగా విశ్వసిస్తారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *