నిజామాబాద్ A9 news
-ఆర్మూర్ డాక్టర్స్ అసోసియేషన్” భవనానికి భూమిపూజ
– ఆర్మూర్ డాక్టర్ల నిస్వార్థ సేవలు అభినందనీయం
-సకల సౌకర్యాలతో డాక్టర్స్ అసోసి యేషన్ భవన్
– ఆర్మూర్ పట్టణంలో 50 కోట్లతో అభివృద్ధి పనులు
-పట్టణంలోని అన్ని ఆసుపత్రులకు అత్యాధునిక రోడ్లు
– 9కోట్లతో పెర్కిట్, గూండ్ల చెరువు, మల్లారెడ్డి చెరువు ట్యాంక్ బండ్ లనిర్మాణం
– ఆర్మూర్ పట్టణంలో వివిధ కులాలకు 27 ఫంక్షన్ హాళ్లు
ఆర్మూర్ పట్టణం అందరికీ అన్నం పెట్టే రైతులు అన్నదాతలైతే అందరికీ పునర్ జీవితం ప్రసాదించే వైద్యులు ప్రాణదాతని ఎమ్మెల్యే, ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని వెంకటేశ్వర గార్డెన్స్ సమీపంలో ‘ఆర్మూర్ డాక్టర్ అసోసియేషన్’ నిర్మాణం కోసం శుక్రవారం జీవన్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ సృష్టి బ్రహ్మది, ప్రతి సృష్టి వైద్యులదన్నారు. వైద్యో నారాయణో హరిః అని వైద్యులను దేవుళ్ళతో సమానంగా కొలిచే సంస్కృతి మనదన్నారు. మానవాళిని రక్షించే కనురెప్పలు డాక్టర్లు అని ఆయన అన్నారు.
హిందువులు దేవుళ్లను, ముస్లింలు అల్లాను, క్రైస్తవులు ఏసు ప్రభువును ప్రార్ధిస్తారని, వీరంతా కలిసి పూజించే భూలోక దేవుళ్ళు డాక్టర్లు అని జీవన్ రెడ్డి చెప్పారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని ప్రజలందరికీ నిస్వార్థ వైద్య సేవలు అందిస్తున్న ఇక్కడి వైద్యులు అభినందనీయులన్నారు.
కాగా ఆర్మూర్ డాక్టర్ల కుటుంబాల కోసం 1700 గజాలలో భవనం నిర్మిస్తున్నామని, దీనికోసం త్వరలోనే మరో ఎకరం భూమి కూడా కేటాయిస్తామని ఆయన వెల్లడించారు. ఆర్మూర్ డాక్టర్స్ అసోసియేషన్ బిల్డింగ్ నిర్మాణం కోసం, 50 లక్షలు మంజూరు చేస్తూ ఇప్పటికిప్పుడే 25లక్షల రూపాయలు విడుదల చేస్తున్నామని, మిగిలిన 25లక్షలను రెండు నెలల లోపు ఇస్తామని, రేపే పనులు ప్రారంభించి వచ్చే ఏడాది డిసెంబరు లోగా పూర్తి చేస్తామని ఆయన వివరించారు. ఈ భవనంలో ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ వంటి సౌకర్యాలు కూడా ఉంటాయన్నారు.
ఆర్మూర్ పట్టణంలో 50 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం.
పట్టణమంత పెద్ద ఎత్తున రోడ్లు వేస్తున్నాం.
పట్టణంలోని అన్ని ఆసుపత్రులకు అత్యాధునిక రోడ్ల సౌకర్యం కల్పించాలని నిర్ణయించాం. ఈ రోడ్ల నిర్మాణం పనులు నెల రోజుల్లోగా పూర్తవుతాయి. ఆర్మూర్ కు వందపడకల ఆసుపత్రి సాధించి ప్రతీ ఒక్కరికీ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చా. ఆర్మూర్ పట్టణంలో వివిధ కులాల వారికి 27 ఫంక్షన్ హాళ్లు నిర్మిస్తున్నాం.
పద్మశాలీలకు పెర్కిట్ లో 6వేల గజాల్లో, మున్నూరు కాపులకు 5ఎకరాల్లో ఫంక్షన్ హాళ్లు నిర్మించాం. 2 ఎకరాల్లో క్రైస్తవ భవన్, దళితుల కోసం 2 ఎకరాలలో అంబేద్కర్ భవన్ నిర్మాణాలు చేపట్టాం. 4 కోట్లతో గూండ్లచెరువు, రూ. 3 కోట్లతో మల్లారెడ్డి చెరువు, 2 కోట్లతో పెర్కిట్ చెరువు ట్యాంక్ బండ్ లను నిర్మిస్తున్నాం అని జీవన్ రెడ్డి తెలిపారు.
ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన తనను 2014 ఎన్నికల్లో 15వేల మెజారిటీతో, 2018లో 30 వేల మెజార్టీతో గెలిపించారని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కూడా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు మళ్లీ ఆశ్వీర్ధించి 60 వేల మెజార్టీతో గెలిపించాలని ఆయన అర్ధించారు.
ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల కోసం జీవితాంతం జీతగాడిలా పనిచేస్తానని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు.