*ఈరోజు రెండు కీలక బిల్లులు..*
:
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభంకానున్నాయి. ఈరోజు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ క్రమంలో సభలో ప్రభుత్వం రెండు కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లు, తెలంగాణ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెడతారు.
సభ ప్రారంభం కాగానే మొదట ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. అనంతరం ఇటీవల మృతిచెందిన మాజీ ఎమ్మెల్యేలు కొమిరెడ్డి జ్యోతి, ఊకే అబ్బయ్య, రామచంద్రారెడ్డికి శాసన సభ సంతాపం తెలుపనుంది. అనంతరం సభలో టూరిజం పాలసీపై లఘు చర్చ జరగనుంది.
నేడు కేబినెట్ సమావేశం
సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమవుతుంది. ఆర్ఓఆర్ 2024 బిల్లు, పంచాయితీ రాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లు సహా ఐదు ఆర్డినెన్సులకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. మంత్రి వర్గం ఆమోదంతో ఆర్ఓఆర్ 2024 బిల్లును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టినున్నారు. కాగా ఈ రోజు అసెంబ్లీ వాయిదా అనంతరం బీఏసీ సమావేశం జరుగుతుంది. అసెంబ్లీ పని దినాలు, బిజినెస్‌ను బీఏసీ ఖరారు చేయనుంది.
కాగా తెలంగాణ శీతాకాల సమావేశాలు ఈనెల 9వ తేదీ సోమవారం ఉదయం 10:30 గంటలకు శాసనసభ, శాసన మండలి ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. అనంతరం సభ 16వ తేదీకి (సోమవారం) వాయిదా పడిన విషయం తెలిసిందే. అదే రోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. వారం రోజుల తర్వాత పునర్ ప్రారంభమవుతున్న సమావేశాలు ఈ నెల 21 వరకు కొనసాగే అవకాశం ఉందని సమాచారం. సభ పని దినాలు, చర్చించాల్సిన అంశాలపై ఇవాళ జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.. *KP*