నేటి నుంచి ఈ నెల 26 వరకు ఫీజు చెల్లించేందుకు చాన్స్
పెనాల్టీతో డిసెంబర్ 27 దాకా అవకాశం
ఫస్ట్, సెకండియర్ జనరల్ కోర్సుల ఎగ్జామ్ ఫీజు రూ.520
ఒకేషనల్ కోర్సుల పరీక్ష ఫీజు రూ.750
హైదరాబాద్ : వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్ ను ఇంటర్ బోర్డు రిలీజ్ చేసింది. బుధవారం నుంచి ఈ నెల 26 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లించవచ్చని ప్రకటించింది. ఇంటర్ బోర్డు సెక్రటరీ శ్రీదేవసేన ప్రకటన రిలీజ్ చేశారు. రూ.100 ఫైన్తో ఈ నెల 26 నుంచి డిసెంబర్ 4 వరకు, రూ.500 ఫైన్తో డిసెంబర్ 5 నుంచి 11 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉందని ప్రకటించారు. రూ.1,000 ఫైన్తో డిసెంబర్ 12 నుంచి 18 వరకు, రూ.2వేల ఫైన్తో డిసెంబర్ 19 నుంచి 27 వరకు ఫీజు చెల్లించవచ్చని వెల్లడించారు. ఫస్టియర్, సెకండియర్ జనరల్ కోర్సుల స్టూడెంట్లకు ఎగ్జామ్ ఫీజు రూ.520 ఫీజు, ఒకేషనల్ కోర్సుల స్టూడెంట్లకు ఫీజు రూ.750 ఉంటుందని చెప్పారు. కాగా, ‘ఇంటర్ ఎడ్యుకేషన్లో ఇన్చార్జిల పాలన’ పేరుతో సోమవారం వెలుగులో కథనం వచ్చింది. ఇంటర్ బోర్డు ఇన్చార్జ్ సెక్రటరీ వివిధ పనుల్లో బీజీగా ఉండటంతో పరీక్షల విభాగం పనులను పట్టించుకోవట్లేదని, ఎగ్జామినేషన్ ఫీజునూ ప్రకటించలేదని ఆ వార్తా కథనంలో ప్రచురితమైంది. ఈ క్రమంలో ఇంటర్ బోర్డు అక్టోబర్ 24వ తేదీతో ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్ను మంగళవారం రిలీజ్ చేయడం గమనార్హం.
*లక్ష మంది స్టూడెంట్ల పరిస్థితేంది?*
రాష్ట్రంలో దాదాపు 300 ప్రైవేటు కాలేజీల్లో చదువుతున్న లక్ష మంది విద్యార్థుల పరిస్థితి అయోమయంగా మారింది. మిక్స్డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో కొనసాగుతున్న ఆయా కాలేజీలకు ఇంటర్ బోర్డు అఫిలియేషన్ ఇవ్వలేదు. దీంతో వాటిలో ఫస్టియర్, సెకండియర్ చదువుతున్న లక్ష మంది పిల్లల చదువులపై ప్రభావం పడుతున్నది. కాలేజీలకు గుర్తింపు లేకున్నా ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్లు ఫస్టియర్లో అడ్మిషన్లు తీసుకున్నాయి. ఆ కాలేజీలను కట్టడి చేయాల్సిన ఇంటర్ బోర్డు పట్టించుకోలేదు. గతనెలలోనే ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల గడువు కూడా ముగిసింది. తాజాగా ఎగ్జామ్ ఫీజు డేట్లూ వచ్చాయి. దీంతో ఆ లక్ష మంది పరిస్థితి ఏంటనే ప్రశ్న మొదలైంది. ప్రభుత్వం నుంచి స్పెషల్ పర్మిషన్ కోసం మేనేజ్మెంట్లు ప్రయత్నాలు చేస్తున్నాయని, సర్కారు అనుమతి రాకపోతే ప్రభుత్వ కాలేజీల నుంచి స్పెషల్ పర్మిషన్తో పరీక్షలు రాయిస్తామని ఇంటర్ బోర్డు అధికారి ఒకరు చెప్పారు. వచ్చే ఏడాది ఆ కాలేజీలను మూసివేయిస్తామని స్పష్టం చేశారు.