తెలంగాణలో టీఎస్ ఆర్టీసీ విలీనం బిల్లుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బిల్లుపై తనకున్న 5 సందేహాలపై వివరణ ఇవ్వాలంటూ కేసీఆర్ సర్కారును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కోరిన విషయం తెలిసిందే. అయితే.. గవర్నర్ లేవనెత్తిన అన్ని సందేహాలపై సర్కారు వివరణ ఇస్తూ.. లేఖ రాసింది. ఏపీ తరహాలోనే విభజన ప్రక్రియ ఉంటుందని కేసీఆర్ సర్కారు స్పష్టం చేసింది. అయితే.. ప్రస్తుత రూపంలోనే ఆర్టీసీ పనిచేస్తుందని క్లారిటీ ఇచ్చింది. విభజన సమస్యలు పరిష్కారమయ్యే వరకు కార్పొరేషన్ స్వభావం మారబోదని తెలిపింది. ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలోకి తీసుకున్నామని… కార్పొరేషన్ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. జీతాలు, అలవెన్సుల విషయంలో ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని హామీ ఇచ్చింది. కార్పొరేషన్ కన్నా మెరుగైన జీతాలు ఇస్తామని వెల్లడించింది. ఇక 1950 చట్ట నిబంధనల ప్రకారం.. టీఎస్ ఆర్టీసీ అపెక్స్ బాడీగా కొనసాగుతుందని.. అవసరమైన నిబంధనలు నోటిఫికేషన్ ద్వారా రూపొందించే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చింది. మరోవైపు.. ఉద్యోగులకు వర్తిచే పెన్షన్ నిబంధనలు వర్తిస్తాయా లేదా అన్నదానిపై అస్పష్టత లేదని గవర్నర్‌కు కేసీఆర్ సర్కారు క్లారిటీ ఇచ్చింది.
గవర్నర్ అడిగిన వివరణ ఇచ్చి ప్రభుత్వం తన బాధ్యతను నెరవేర్చింది మరి.. మిగిలింది ఇక గవర్నర్ ఆ బిల్లుపై ఆమోద ముద్ర వేయటమే. అయితే.. ప్రభుత్వం ఇచ్చిన వివరణకు గవర్నర్ సంతృప్తి చెందారో లేదో తెలియాల్సి ఉంది. కానీ.. ఇప్పటికైతే.. రాజ్‌భవన్ నుంచి అక్నోలెడ్జెమెంట్ రానట్టు సమాచారం. మరి.. బిల్లుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అన్నది.. అటు ప్రభుత్వంతో పాటు ఆర్టీసీ ఉద్యోగుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఆమె.. ఆమోద ముద్ర వేసిందంటే.. వీలైతే ఈరోజు.. లేదంటే రేపు అసెంబ్లీలో ప్రవేశ పెట్టటం.. ఎస్ చెప్పి పాస్ చేయటమే తరువాయిగా మారనుంది.
ఇదిలా ఉంటే.. గవర్నర్ తీరుపై ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లు వెంటనే ఆమోదించాలంటూ పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి రాజ్‌భవన్ ముందు బైఠాయించారు. ఈ విషయం తెలుసుకున్న గవర్నర్.. 10 మంది ఆర్టీసీ యూనియన్ నాయకులతో పుదుచ్చేరి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో గంటకు పైగా మాట్లాడారు. చర్చల అనంతరం బయటకు వచ్చిన థామస్ రెడ్డి.. గవర్నర్ తమ సమస్యలు విన్నారని, సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రభుత్వ వివరణ తనకు ఇంకా అందలేదని.. వివరణ అందిన తర్వాత బిల్లు ఆమోదిస్తానని తెలిపినట్టగా చెప్పుకొచ్చారు. కార్మికుల ప్రయోజనాలే తనకు ముఖ్యమని గవర్నర్ చెప్పినట్టు పేర్కొన్నారు.
మరోవైపు థామస్ రెడ్డిని మాత్రమే చర్చలకు పిలవటం పట్ల కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన అశ్వత్థామరెడ్డి.. గవర్నర్ లేవనెత్తిన 5 ప్రశ్నల్లో 4 కార్మికుల ప్రయోజనాలకు సంబంధించినవేనని చెప్పుకొచ్చారు. కార్మికులకు రెండు పీఆర్సీలు పెండింగ్‌లో ఉన్నాయని గవర్నర్ గుర్తుచేసినట్టు చెప్పారు. ఆదరాబాదరాగా బిల్లు రూపొందిస్తే కార్మికులు ఇబ్బందుల్లో పడతారని ఆమె చెప్పినట్టు తెలిపారు. గవర్నర్ నిర్ణయం.. చరిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు.