Graduate Mlc: కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి కీలకమైన ఓటరు నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.
సెప్టెంబర్ 30న మొదలైన ప్రక్రియ నవంబర్ 6వ తేదీ వరకు కొనసాగుతుందని ఎన్నికల కమిషన్ గడువు విధించింది. ఈ గడువు ముగియడానికి కేవలం రెండు రోజులు మాత్రమే ఉన్నా ఇప్పటి వరకు ఓటర్ల నమోదు పదిహేను శాతం కూడా దాటకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలో ఐదు నుంచి పది లక్షల వరకు గ్రాడ్యుయేట్లు ఉంటారని అంచనా వేయగా సోమవారం వరకు కేవలం ఒక లక్షా 3 వేల 234 మంది మాత్రమే ఓటర్ల నమోదు అయ్యారు. మరో లక్ష 24 వేల 386 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. రాజకీయ పార్టీలన్నీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి లోలోన కసరత్తు చేస్తున్నాయే తప్ప గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు విషయంలో తగిన శ్రద్ధ చూపడం లేదని తెలుస్తోంది. ప్రధానంగా ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఓటరు ఐడీ కార్డు ఉంటేనే ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
*కొంప ముంచిన ఓటరు ఐడీ*
సాధారణ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగం కోసం ఎన్నికల కమిషన్ 14 రకాల గుర్తింపు కార్డులను అనుమతిచ్చింది. ఆధార్ కార్డుతో పాటు పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాస్ పోర్టు, ఇతరాత్ర పలు కార్డులను అధికారికంగా ధృవీకరించింది. అత్యధికులకు ఆధార్ కార్డు అందుబాటులో ఉండటం.. లేకున్నా అప్పటికప్పుడు పొందే సదుపాయం కూడా అందుబాటులో ఉండటంతో ఇప్పటి వరకు సాధారణ ఎన్నికలకు సంబంధించి సమస్య ఏర్పడలేదు.
అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక వరకు వచ్చే సరికి ఆధార్ కార్డుతోపాటు ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఓటరు ఐడీ కార్డు తప్పనిసరి అని షరతు విధించింది. గడిచిన పలు ఎన్నికల్లో ఆధార్ కార్డుకే ప్రాధాన్యత ఉండటంతో ప్రతీ ఒక్కరూ దానికే పరిమితమయ్యారు. ఆధార్ కార్డు లేకముందు ఓటరు ఐడీ కార్డు తీసుకున్నవారు ఆధార్ కార్డు వచ్చాక ఓటరు ఐడీని విస్మరించారు.
అసలు ఉందో లేదో కూడా తెలియక కొందరు.. ఎలా పొందాలో తెలియక మరికొందరు .. ఇప్పుడు ఓటరు ఐడీ కార్డు అవసరమా అని మరికొందరు ఈ ఎన్ రోల్ మెంట్ కు దూరంగా ఉండిపోయారని తెలుస్తోంది. ఓటరు ఐడీ కార్డు లేకుండా ఎన్ రోల్ మెంట్ జరిపించేందుకు ఎన్నికల కమిషన్ మినహాయింపు ఇస్తే తప్ప ఈ రెండు రోజుల్లో ఆశించిన మేరకు ఓటరు నమోదు ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.
*ఎన్ రోల్ మెంట్ కోసం టార్గెట్లు*
ప్రాధాన్యత క్రమంలో ఎమ్మెల్సీని ఎన్నుకోనున్న నేపథ్యంలో తమకు అనుకూలంగా ఉండే పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించేందుకు పలువురు అభ్యర్థులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. పలు చోట్ల ఓటరు నమోదు కోసం కార్యాలయాలు ఏర్పాటు చేశారు. మరి కొందరు ప్రైవేటు వ్యక్తులను నియమించుకొని ఫోన్ల ద్వారా సమాచారం సేకరించి నమోదు ప్రక్రియ చేపడుతున్నారు.
తమ వద్ద పని చేస్తున్నా, తమకు సన్నిహితంగా ఉన్న, పరిచయం ఉన్న వారి ద్వారా కూడా ఎన్ రోల్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఎవరికి వారు లక్ష నుంచి రెండు లక్షల వరకు పట్టభద్రులను ఓటర్ లుగా నమోదు చేయించడమే లక్ష్యంగా పెట్టుకున్నామంటూ పలుమార్లు ప్రకటనలు చేస్తూ వచ్చారు. ఒకవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నేతలు పెరిగిపోతుండటంతో ఈసారి గతానికి భిన్నంగా పెద్ద ఎత్తున ఎన్ రోల్ మెంట్ జరిగే అవకాశం ఉంటుందని అందరూ అంచనా వేశారు.
కానీ గడిచిన 35 రోజుల్లో లక్ష 3 వేల మంది ఓటర్లుగా నమోదు కావడం మరో లక్ష 24 వేలమంది దరఖాస్తులు పరిశీలనలో ఉండడం చూస్తే రెండున్నర లక్షల మంది కూడా ఓటర్లగా నమోదు అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
*గడువు పొడగిస్తారా…?*
మందకొడిగా జరుగుతున్నందున ఎన్నికల కమిషన్ గడువు పొడగిస్తుందా లేక ఇక్కడికే పరిమితం చేస్తుందా అన్న దానిపై ఇప్పుడు ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ రెండు రోజుల్లో మొత్తం అంచనాలో కేవలం 20 శాతం మేరకే గ్రాడ్యుయేట్లు తమ ఎన్ రోల్ మెంట్ నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. గడువు పెంచి ఓటరు ఐడీ కార్డు మినహాయింపు ఇస్తే తప్ప కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓటరు నమోదు ప్రక్రియ పుంజుకునే అవకాశం లేదని తెలుస్తోంది. దీనిపై అధికార కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చొరవ చూపితే తప్ప ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సడలించుకునే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
*ప్రచారం జోరులో అభ్యర్థులు*
ఫిబ్రవరి మాసంలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న అభ్యర్థులు రెండు, మూడు మాసాలుగా ప్రచారాన్ని ఉధృతంగా కొనసాగిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే పలువురు నేతలు ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అమితాసక్తి చూపుతున్నారు. నిత్యం ఏదో ఒక జిల్లాల్లో గ్రాడ్యుయేట్లను కలుసుకొని ఎన్నికల్లో మద్దతును కోరుతూ ప్రచారం కొనసాగిస్తున్నారు. ఎన్నికల కోడ్ లేకపోవడంతో యదేచ్ఛగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, కార్యాలయాల్లో తమ ప్రచారం నిర్వహిస్తూ మద్దతును కూడగట్టుకునే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
మరో రెండు మాసాల్లోగా నాలుగు జిల్లాల పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ప్రచారం కొనసాగించడం ద్వారా గ్రాడ్యుయేట్లకు పరిచయం కావాలనే ఆకాంక్షతో అభ్యర్థులందరూ పోటాపోటీగా ప్రచారం వైపు దృష్టి సారిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో విద్యాసంస్థల అధినేతలు, డాక్టర్లు, లాయర్లు, రాజకీయ పార్టీల నాయకులు పలువురు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతుండటంతో ఆరు మాసాల ముందే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల వాతావరణం వేడెక్కింది.