A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:
*మూడు వారాల్లోసర్వే పూర్తి చేసేలా ఏర్పాట్లు…
*మధ్యాహ్నం వరకే స్కూళ్లు..తర్వాత సర్వేలో టీచర్లు…
*ఉత్తర్వులు జారీచేసిన సర్కారు…
*6 నుంచి ప్రారంభంకానున్న ఇంటింటి సర్వే…
హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కుల గణన ఇంటింటి సమగ్ర సర్వేకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్న సామాజిక, విద్య, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో 80 వేల మంది సేవలను వినియోగించుకోవాలని సర్కారు నిర్ణయించింది. ఇందులో ప్రధానంగా స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రైమరీ స్కూల్ టీచర్లు, హెడ్మాస్టర్లు ఉండబోతున్నారు. సర్వేలో పాల్గొనే ఎన్యుమరేటర్లలో దాదాపు సగం, అంటే 40వేల మంది టీచర్లే. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 6 నుంచి మూడు వారాల పాటు కుల గణన సమగ్ర సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేలో విద్యా శాఖ పరిధిలోని ప్రైమరీ స్కూల్ టీచర్లతో పాటు ఎంఆర్సీ సిబ్బంది, ఎయిడెడ్ నాన్ టీచింగ్ సిబ్బంది సేవలను వినిగియోచుకోనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొత్తం 80వేల మందిలో మెజార్టీగా టీచర్ల సేవలను వినియోగించుకుంటామని, వారితోపాటు తహసీల్దార్, ఎండీఓ, ఎంపీఓ సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్ వాడీ వర్కర్ల సేవలను వినియోగించుకుంటామని తెలిపారు. స్కూళ్లలో బోధనకు ఇబ్బంది కలగకుండా ముసాయిదా రూపొందించామని పేర్కొన్నారు. ఇంటింటి సర్వే నిర్వహణ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముందుగానే టీచర్ల సంఘాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సర్వేకు సంపూర్ణ మద్దతిస్తామని, తాము పాల్గొంటామని టీచర్ల సంఘాలు ప్రకటించాయి. అందుకు తగ్గట్టుగా టీచర్ల సేవలను వినియోగించుకునేలా ప్లాన్ రూపొందించారు.
*సర్వేలో 36,559 మంది ఎస్జీటీలు
ప్రస్తుతం నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేలో మొత్తం 36,559 మంది ఎస్జీటీలు, 3,414 మంది ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్లు పాల్గొననున్నారు. దీంతో పాటు 6,256 మంది ఎంఆర్సీ సిబ్బంది, 2 వేల మంది సర్కా రు, జెడ్పీ/ఎంపీపీ స్కూళ్సలోని సిబ్బంది, ఎయిడెడ్ స్కూళ్లలోని మినిస్టీరియల్ సిబ్బందిని వినియోగించుకుంటామని అధికారులు ప్రకటించారు.
*మధ్యాహ్నం వరకే స్కూళ్లు..
ఇంటింటి సర్వేలో ప్రైమరీ స్కూళ్ల టీచర్లు పాల్గొననుం డడంతో అందుకు తగ్గట్టుగా స్కూల్ టైమింగ్స్‌ను మార్చారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే స్కూళ్లు కొనసాగనున్నాయి. పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించి ఇంటికి పంపించనున్నారు. ఆ తర్వాత ఎంపిక చేయబడిన టీచర్లు సర్వేకు వెళ్తారు. అయితే, యూపీఎస్, హైస్కూళ్లలో పనిచేస్తున్న ఎస్జీటీలను ఈ సర్వే నుంచి మినహాయించారు.
*ఊరూరా ఇండ్లకు స్టిక్కర్లు
సమగ్ర సర్వేలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇండ్ల లెక్క లు తీస్తున్నారు. శుక్రవారం అన్ని గ్రామాల్లో విలేజ్ సెక్రటరీల నుంచి ఎంపీడీవోల స్థాయి వరకు అధికారులంతా ఇండ్లకు నంబరింగ్ ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు. సెక్రటరీలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, టీచర్లు ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు అతికించారు. ఈ స్టిక్కర్ పై యజమాని పేరు, ఇంటి నంబర్, వార్డు వివరాలు రాశారు. వీటి ఆధారంగా ఎన్యుమరేటర్లు ఈ నెల 9 నుంచి కుల గణన వివరాలు సేకరించనున్నట్టు అధికారులు ప్రకటించారు. కాగా, కులగణన బాధ్యతను ప్రభుత్వం టీచర్లకు అప్పగించిన నేపథ్యంలో తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు స్టిక్కర్లు అంటించడం ఆపేయాలని పంచాయతీ ఆఫీసర్లకు ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది.