A9 న్యూస్ తెలంగాణ:
AEO | ఏఈవోల అరిగోస.. 4 నెలలుగా క్షణం తీరిక లేకుండా విధులు!!
అన్ని బాధ్యతలు వారిపైనే
4 నెలలుగా క్షణం తీరికలేకుండా వ్యవసాయ విస్తరణ అధికారులు
పనిభారం తగ్గించాలని విజ్ఞప్తి
వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు) పనిభారంతో ఇబ్బంది పడుతున్నారు.
మూడు, నాలుగు నెలలుగా క్షణం తీరిక లేకుండా విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక పని పూర్తికాక ముందే, మరో పని అప్పగిస్తుండడంతో ఏ పనిచేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. రుణమాఫీతో మొదలైన వీరి కష్టాలు పంటనష్టం సర్వే వరకు కొనసాగుతూనే ఉన్నాయి. రుణమాఫీ మొత్తం గందరగోళం కావడంతో క్షేత్రస్థాయిలో ఏఈవోలు తీవ్ర సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. రైతులకు నేరుగా అందుబాటులో ఉండడంతో రుణమాఫీ కాని రైతులు ఏఈవోలను నిలదీస్తున్నారు.
ఇటు రుణమాఫీ గొడవ నడుస్తుండగానే, మరోవైపు పంటల సాగు నమోదు చేయాల్సిన బాధ్యత కూడా వాళ్లపైనే పడడంతో వారి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. రేషన్‌కార్డు లేక రుణమాఫీ కాని రైతు కుటుంబాలను నిర్ధారించే బాధ్యతను కూడా ప్రభుత్వం వీరికే అప్పగించింది. దీంతో ఏఈవోలు రైతుల ఇండ్లకు వెళ్లి సర్వే చేస్తున్నారు. తాజాగా కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు ఏఈవోల కష్టాలను మరింత పెంచాయి. భారీ వర్షాలకు పంటలు నీట మునగడం, కొట్టుకుపోవడంతో నష్ట పరిహారం కోసం సర్వే చేయాల్సి ఉంది. ఈ బాధ్యతను కూడా అధికారులు ఏఈవోలపైనే పెట్టారు. పనిభారం తగ్గించి తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.