A9 న్యూస్ ప్రతినిధి వేములవాడ:
*సత్రం నిర్మాణానికి దాతలు సహకరించాలి…
*మంత్రి పొన్నం సత్రం నిర్మాణానికి దాతలు సహకరించాలి…
*పొన్నం ఆలయాభివృద్ధికి 50 కోట్లు కేటాయించాం ఆది శ్రీనివాస్…
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయంలో తిరుమల తరహాలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇందుకోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ తో కలసి బుధవారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పర్యటించారు. స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రాథమిక వ్యవసాయ గోదాం, కేడీసీసీ బ్యాంక్ బ్రాంచ్భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. అన్నదాన సత్రం ఏర్పాటుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు, అన్ని వర్గాల ప్రజలు ముందుకొచ్చి, సహకరించాలని కోరారు.
రాజన్న ఆలయ అభివృద్ధికి శృంగేరి పీఠం, పండితులు, భక్తుల సూచనల మేరకు ముందుకు వెళ్తామని చెప్పారు. రాజన్న ఆలయ అభివృద్ధికి సీఎం, మంత్రులు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని తెలిపారు. సహకార సంఘాలు రాజకీయాలకతీతంగా రైతుల సంక్షేమం కోసం పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. రుణమాఫీకాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైనవారికి తప్పకుండా రుణమాఫీ అమలుచేస్తామని చెప్పారు. కరీంనగర్ జిల్లాలో 59 వేల మంది రైతులకు 444 కోట్లు రుణమాఫీ అయిందని వెల్లడించారు. ఈ ఏడాది శ్రావణ మాసం ఆరంభం నుంచి భక్తుల కోసం బ్రేక్ దర్శనాన్ని అమల్లోకి తీసుకువచ్చామని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటిదాకా 1400 మంది భక్తులు దర్శించుకోగా, దాదాపు రూ. 15 లక్షల ఆదాయం సమకూరిందని చెప్పారు. వేములవాడ ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 కోట్లు కేటాయించిందని చెప్పారు.