A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిది:
రైతు కార్మిక విద్యార్థి యువజన వ్యతిరేక బిజెపి పార్టీని ఓడించి దేశాన్ని కాపాడాలని ప్రజలకు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నిజామాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి దాసు పిలుపును ఇచ్చారు. ఆర్మూరు పట్టణంలో శుక్రవారం ఐ.ఎఫ్.టి.యు ఆఫీసులో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో దాసు పాల్గొని మాట్లాడుతూ నరేంద్ర మోడీ 10 సంవత్సరాల పరిపాలనలో నిరుద్యోగం, ఆకలి, అసమానతలు, అప్పులు హద్దుదాటీనాయని ఆయన అన్నారు. అన్నదాత రైతన్న భూమిని కార్పోరేట్ కంపెనీలకు
కట్ట బెట్టడానికి మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను మోడీ సర్కార్ తీసుకొస్తే ఢిల్లీ రైతులు సంవత్సరం ఉద్యమించిన, రైతులను కాల్చి చంపుతోందని ఆయన అన్నారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లతో కార్మికులకు మోడీ ప్రభుత్వం మరణ శాసనం విధిస్తుందని ఆయన తెలిపారు. ప్రతి సంవత్సరం రెండు కోట్ల కొలువులు, ఉపాధి భద్రత నీళ్ల మూటగా మారిందని ఆయన అన్నారు. దేశాన్ని అప్పుల కొంపగా మార్చి, ప్రజల ఆలోచనలను వక్రమార్గం పట్టించడానికి మతం పేరుతో, రాముడి పేరుతో కుట్ర చేస్తుందని ఆయన తెలిపారు.
రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి, లౌకిక ప్రజాస్వామ్యక విలువలను పాతర వేయడానికి ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు. ప్రశ్నించే వాళ్లను నిర్బంధిస్తూ, భిన్నించే వాళ్లను వేధిస్తూ, సెంటిమెంటు, డబ్బులతో మళ్లీ అధికారం చేపట్టాలని కుట్ర చేస్తుందని ఆయన అన్నారు. దేశభక్తితో ప్రజా సంపదను, హక్కులను, భవిష్యత్తును కాపాడుకోవడానికి పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి ని ఓడించాలని దాసు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో న్యూ డెమోక్రసీ ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యదర్శి సూర్య శివాజీ, ప్రజా సంఘాల నాయకులు లక్ష్మక్క భానుచందర్, వి పద్మ, ధనలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.