ఆర్మూర్ A9 న్యూస్, ఫిబ్రవరి 22:
2024 ఫిబ్రవరి 21న సాయంత్రం సమయములో హర్యానా, పంజాబ్ సరిహద్దుల్లో హర్యానాకు చెందిన పోలీసుల కాల్పులలో పంజాబ్ రాష్ట్రానికి చెందిన బటిండా జిల్లాలోని బాలన్ గ్రామానికి చెందిన 24 సంవత్సరాల యువకుడు శుభకరన్ సింగ్ మరణించాడు. ఈ దుర్మార్గపు దాడిని తెలంగాణ ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ భూమేశ్వర్ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నిజామాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి దాసు తీవ్రంగా ఖండించారు. గురువారం ఆర్మూర్ పట్టణంలో ఐఎఫ్టియు ఆఫీసులో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో భూమేశ్వర్, దాసు పాల్గొని మాట్లాడుతూ అన్నదాత- రైతన్న అంటూనే రైతన్నలపై దుర్మార్గంగా కాల్పులు జరిపిన హర్యానా పోలీసుల ను వెంటనే హత్యా నేరం కింద అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. మోడీ రైతు వ్యతిరేక విధానాల వల్ల అనేక మంది రైతులు అసువులు బాస్తున్నారని వారు తెలిపారు. ఈ కాల్పుల ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేసారు.
స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం రైతుల పండించిన పంటకు( ఎం ఎస్ పి) కనీస మద్దతు ధర ఉత్పత్తి వ్యయంపై ఒకటిన్నర రేట్లు చెల్లించాలని, డిమాండ్ చేశారు. రైతు రుణ విమోచన చట్టం తీసుకురావాలని, విద్యుత్ సవరణ బిల్లు ద్వారా విద్యుత్తు రంగ ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని, రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని ఢిల్లీ లో నిర్వహించిన చారిత్రాత్మకమైన రైతాంగ పోరాటంలో మరణించిన 750 మంది రైతు కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న రైతులపై అమానుషంగా కాల్పులు చేయడం కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్పొరేట్ మతతత్వ విధానాలను రుజువు చేస్తుందని వారు తెలిపారు. ఢిల్లీలో రైతాంగ పోరాట సందర్భంగా రాతపూర్వకంగా ఒప్పందం రాసి ఇచ్చిన మోడీ సర్కార్ మాట తప్పుతోందని తెలిపారు. రైతులను నిర్బంధిస్తే రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పుతారని మోడీ ప్రభుత్వాన్ని దాసు, భూమేశ్వర్ హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు బి సూర్య శివాజీ పిడిఎస్యు జిల్లా సహాయ కార్యదర్శి ఫ్రీన్స్ తదితరులు పాల్గొన్నారు.