నిజామాబాద్ A9 న్యూస్:
ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ జరగనుంది. ఆర్మూర్ పట్టణంలోని దోబీ ఘాట్, ఆలూర్ బైపాస్ రోడ్ లో మధ్యాహ్నం జరిగే ఈ సభను ఆర్మూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పల్లె నుంచి గులాబీ శ్రేణులు కదం తొక్కనున్న సీఎం సభకు బీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్ రెడ్డి పర్యవేక్షణలో భారీ ఏర్పాట్లు చేశారు. ఆర్మూర్ లోని జరిగే సభకు వాస్తు ప్రకారం అత్యాధునిక హంగులతో కేసీఆర్ ప్రసంగించే వేదికను నిర్మించారు. సభకు మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండటంతో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసి సభకు వచ్చే వారి దాహార్తి తీర్చడానికి కూడా బీఆర్ఎస్ నాయకులు చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి జనం అంచనాలకు మించి తరలి వస్తారని సమాచారం ఉండటంతో విశాలమైన స్థలాల్లో వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ఇక సభా ప్రాంగణాన్ని గులాబీ జెండాలు, కేసీఆర్ ఫ్లెక్సీలతో అలంకరించారు. ఇదిలా ఉండగా సీఎం సభ సందర్భంగా ఆర్మూర్ పట్టణం గులాబీ వర్ణ శోభితమైంది. పట్టణంలోని అన్ని ప్రధాన కూడళ్లను పార్టీ జెండాలు, బ్యానర్లు, ప్లెక్సీలతో నిండిపోయాయి.
బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గ్రామాలకు వెళ్లి ప్రజా ఆశీర్వాద సభకు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి పలు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం చేస్తూనే ఆర్మూర్ లో జరిగే సీఎం కేసీఆర్ సభకు రావాలని కోరుతున్నారు. ఇక ఆర్మూర్ సీఎం కేసీఆర్ సభకు భారీ జన సమీకరణ చేయడం పై బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి నజర్ పెట్టి అందుకు తగినట్లు చర్యలు తీసుకున్నారు. ఆయనే స్వయంగా సకల కులసంఘాల నేతల ఇండ్లకు వెళ్లి సభలో పాల్గొనాలని కోరుతూ ఆహ్వాన పత్రికలు అందించారు. గురువారం జీవన్ రెడ్డి ఆర్మూర్ పట్టణములోని అన్ని సంఘాలకు వెళ్లి వారిని ప్రజా ఆశీర్వాద సభకు ఆహ్వానించారు. అనంతరం సీఎం కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభ ప్రాంగణంలో ఏర్పాట్లను బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.