నిజామాబాద్ A9 న్యూస్:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పాలకులను నిలదీయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆర్మూర్ పట్టణములు ఐఎఫ్టియు ఆఫీసులో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు.
నరేంద్ర మోడీ ఎన్నికల్లో ఉపాధి భద్రత, ప్రతి ఏటా రెండు కోట్ల కొలువులు, పేదల జన్ధన్ ఖాతాలో 15 లక్షల జమ, ప్రభుత్వ రంగ సంస్థల, భీడి లాంటి కుటీర పరిశ్రమల రక్షణ హామీలను విస్మరించి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను, తెచ్చారని ఆయన అన్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్ప జెప్పే కుట్రతో మూడు వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చి, దేశాన్ని అప్పుల కొంపగా మార్చి నందుకు బిజెపి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని దాసు అన్నారు.
కెసిఆర్ రాష్ట్రంలో మూడు లక్షల కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులను పర్మినెంట్ చేస్తానని, పేదలకు డబుల్ బెడ్రూములు ఇస్తామని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1,40,000 పోస్టులను వెంటనే భర్తీ చేస్తానని, దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని అర్హత కలిగిన దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తానని మాట ఇచ్చి, మోసం చేశారని కనుక బిఆర్ఎస్ పార్టీని నిలదీయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
9 సంవత్సరాలలో పెట్రోలు, చమరు ఉత్పత్తి ధరలు, నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, విద్య, వైద్య రంగ సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టిన కేసీఆర్ నీ ప్రశ్నించాలని దాసు అన్నారు. పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీస్తూ, ఉద్యమించి, మెరుగైన సమాజం కోసం ఐక్యంగా పోరాడుదామని దాసు ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ పాత్రికేయుల సమావేశంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ నాయకులు బి సూర్య, శివాజీ, ఖాజా, మొయినుద్దీన్, వి బాలయ్య, అబ్దుల్, ఎస్ రవి తదితరులు పాల్గొన్నారు.