A9 న్యూస్ తెలంగాణ బ్యూరో:
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విడుదల చేసిన జాబితాలో చోటు సంపాదించుకున్న ఎమ్మెల్యేల అభ్యర్థులకు స్థానికత నుంచి కొంత అసమ్మతి, కొంత వ్యతిరేకత సమస్యగా మారనున్నాయి. ఆ రెండింటినీ ఎదుర్కునేందుకు వారు ఈ సారి తీవ్రంగా కష్టపడక తప్పదనే అభిప్రాయం ఉన్నది. పాజిటివ్ వాతావరణం ఏర్పర్చుకునేందుకు వెంటనే రంగంలోకి దిగాలని సీఎం కేసీఆర్ వారికి ఆదేశించినట్టు తెలుస్తున్నది. అసమ్మతి లీడర్లను స్వయంగా కలిసి సహకారం కోసం అప్పీలు చేసేందుకు అభ్యర్థులు రెడీ అవుతున్నారు.
*గుర్రుగా స్థానిక లీడర్లు
మెజార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వరుసగా మూడోసారి టికెట్ ఇవ్వడంతో చాలా నియోజకవర్గాల్లో స్థానిక లీడర్లు గుర్రుగా ఉన్నారు. రాజకీయంగా ఎదుగుదల లేకుండా ఎంత కాలం పార్టీ కోసం పనిచేయాలని వారు ఆవేదన చెందుతున్నారు. ఈసారి పార్టీకి సహకరించకుండా మౌనంగా ఉండాలని వారందరూ ప్లాన్ గా ఉన్నట్టు తెలుస్తున్నది. కొన్ని చోట్ల కాంగ్రెస్తో కలిసి సొంత పార్టీ అభ్యర్థిని ఓడించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ విషయాన్ని ముందే గ్రహించిన సీఎం కేసీఆర్ స్థానిక లీడర్లను బుజ్జగించుకునే బాధ్యత కూడా అభ్యర్థులకే అప్పగించినట్టు తెలుస్తున్నది. ‘ముందు మీరు వెళ్ళి లోకల్గా ఉన్న పార్టీ లీడర్లను కలవండి. వారి అవసరాలు గుర్తించి తీర్చండి. వారిని కలుపుకొని కార్యక్రమాలు తయారు చేయండి. అయినా వారు సహకరించపోతే అప్పుడు నాకు చెప్పండి.’ అని సీఎం ఆదేశించినట్టు తెలుస్తున్నది.
*సిట్టింగులకు గుబులు రేపుతున్న వ్యతిరేకత
చాలా మంది సిట్టింగ్లకు స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఉన్నది. దాన్ని అధిగమించేందుకు ఎంత కష్టపడినా ప్రయోజనం దక్కలేదు. అయితే షెడ్యూల్ వచ్చేలోపు సానుకూల పరిస్థితులు ఏర్పడకపోతే, గెలుపు కష్టమనే టాక్ ఉన్నది. 115 మంది అభ్యర్థుల్లో సుమారు 25 మందికి స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఉన్నా అక్కడ ప్రతిపక్షాలకు సరైన అభ్యర్థి లేకపోవడంతో టికెట్ ఇచ్చినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని సదరు అభ్యర్థులకు కేసీఆర్ వివరించి అలర్ట్ చేసినట్టు సమాచారం.
తుమ్మల ఏం చేస్తారు?
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావుకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది. పార్టీ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి విజయం కోసం పనిచేస్తారా? లేక కాంగ్రెస్ గూటికి వెళ్తారా? పార్టీలోనే ఉంటూ మౌనంగా ఉండిపోతారా? అనే చర్చ జరుగుతున్నది. తుమ్మల ప్రభావం అటు పాలేరు, ఇటు ఖమ్మం సెగ్మంట్లో బలంగా ఉంటుందని టాక్. ఆయన సహకారం తీసుకోకుండా ఎన్నికలకు వెళ్తే నెగిటివ్ రిజల్ట్ వస్తుందనే ప్రచారం జోరుగా సాగుతున్నది. ఈ క్రమంలో తుమ్మలను బుజ్జగించేందుకు కేసీఆర్ రంగంలోకి దిగుతారా? లేక ఆయనతో సంబంధం లేకుండానే ఎన్నికల బాధ్యతలు బాధ్యతలు ఇతరులకు అప్పగిస్తారా?అనేది చూడాల్సి ఉన్నది.
సమస్యగా మారిన మైనంపల్లి
తనతో పాటు తన కుమారునికీ మెదక్ టికెట్ ఇవ్వకపోవడంతో మైనంపల్లి హన్మంతరావు చేసిన వ్యాఖ్యలు పార్టీ పెద్దలకు ఇబ్బందిగా మారాయి. ఆయన తీరుతో మనస్తాపానికి గురైన ఓ మంత్రి వెంటనే ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. బీఆర్ఎస్ నిర్ణయంతో సంబంధం లేకుండా మైనంపల్లి మాత్రం రెండు సీట్లలో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలిసింది. అయితే కాంగ్రెస్లోకి ఆయన్ను ఆహ్వానించి, రెండు సీట్లు ఇచ్చే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.
ఉప్పల్లో రాజుకున్న అసమ్మతి
ఉప్పల్ టికెట్ ఆశించిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఏకమయ్యారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వడంపై కోపంగా ఉన్న ఆ ఇద్దరు ఆయన్ను ఓడించేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతునట్టు తెలుస్తున్నది. పార్టీలోనే ఉంటూ ఆయనకు వ్యతిరేకంగా పని చేయాలని అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని పార్టీ పెద్దలకు తెగేసి చెప్పినట్టు సమాచారం.
అసమ్మతి సెగలు ఉన్న నియోజకవర్గాలు
ఉమ్మడి అదిలాబాద్: చెన్నూరు, మంచిర్యాల, అసిఫాబాద్, ఖానాపూర్, బోథ్, ముధోల్
ఉమ్మడి నిజామాబాద్: ఆర్మూర్, బోధన్, ఎల్లారెడ్డి, నిజామాబాద్ అర్బన్
ఉమ్మడి కరీంనగర్ : జగిత్యాల, కొప్పుల ఈశ్వర్, రామగుండం, మంథని, పెద్దపల్లి, వేములవాడ
ఉమ్మడి మెదక్ : మెదక్, ఆందోల్, జహీరాబాద్, పటాన్చెరు, దుబ్బాక
ఉమ్మడి రంగారెడ్డి : ఉప్పల్, మేడ్చల్, ఎల్బీనగర్, మహేశ్వరం,
రాజేంద్రనగర్, చేవేళ్ల, పరిగి, తాండూరు
హైదరాబాద్ అంబర్పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కంటోన్మెంట్
ఉమ్మడి మహబూబ్ నగర్ : నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి
ఉమ్మడి నల్లగొండ : దేవరకొండ, నాగార్జునసాగర్, నల్లగొండ, మునుగోడు, ఆలేరు
ఉమ్మడి వరంగల్: జనగామ, స్టేషన్ ఘణ్పూర్, వరంగల్ తూర్పు
ఉమ్మడి ఖమ్మం : పాలేరు, కొత్తగూడెం, వైరా