హైదరాబాద్: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీకి దూరంగా బీఆర్ఎస్ ఉండనుంది. ఈ ఎన్నికలో పోటీ చేయడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రకటించారు. గీత దాటితే వేటు తప్పదని సొంత పార్టీ నేతలకు కేటీఆర్ హెచ్చరించారు. ఓటింగ్‌కు దూరంగా ఉండాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, కార్పొరేటర్లకు కేటీఆర్ హుకుం జారీ చేశారు. ఈనెల 24వ తేదీన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓటింగ్ జరుగనుంది.

విప్ ధిక్కరిస్తే బహిష్కరణ..

పార్టీ నేతలకు విప్ జారీ చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. విప్ ధిక్కరిస్తే పార్టీ నుంచి బహిష్కరణ తప్పదని కేటీఆర్ మందలించారు. బీజేపీ వద్దు.. ఎంఐఎం వద్దు.. ఇరు పార్టీలకు సమదూరం పాటించాలని కేటీఆర్ ఆదేశించారు. 24వ తేదీన ఓటింగ్‌కు అందరూ దూరంగా ఉండాలని పార్టీ నేతలకు కేటీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ(శనివారం) తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, చేవెళ్లకు త్వరలో ఉప ఎన్నికలు ఖాయమని అన్నారు. బీఆర్ఎస్ ఇరవై ఐదేళ్ల పండుగ తెలంగాణ ప్రజల ఇంటి పండుగ అని తెలిపారు. ఎన్టీఆర్ – టీడీపీ తర్వాత.. ఇరవై ఐదేళ్ల పాటు పార్టీని నడిపింది కేసీఆర్ మాత్రమేనని ఉద్ఘాటించారు. టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఎదుర్కొని కేసీఆర్ పార్టీ పెట్టారని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు.

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ కుదేలు..

కులబలం, ధనబలం లేకుండా కేసీఆర్ పార్టీని స్థాపించారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌కు హైదరాబాద్ నగరంలో గతంలో స్థలం ఇవ్వలేదని గుర్తుచేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తన స్థలాన్ని బీఆర్ఎస్ పార్టీకి ఇస్తే నాటి ప్రభుత్వం ఆఫీసును ఖాళీ చేయించిందని ఆరోపించారు. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ సూపర్ హిట్ అయిందని ఉద్ఘాటించారు. హైదరాబాద్ బయట కాంగ్రెస్ చేతిలో ప్రజలు మోసపోయారని అన్నారు. రేవంత్ రెడ్డి.. తన అన్న ఇల్లును ఎందుకు కూలగొట్టరని ప్రశ్నించారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చారని అన్నారు. 17నెలల్లో బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగిందని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పూర్తిగా కుదేలయిందని అన్నారు. పథకాలకు పైసలు లేవని.. లక్షన్నర కోట్లు పెట్టి మూసీ కడతానని రేవంత్ రెడ్డి ఇప్పుడు అంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు.

ఆ భూముల పేరుతో రేవంత్‌రెడ్డి అరాచకాలు..

హైదరాబాద్‌లో హైడ్రా, మూసీ,సెంట్రల్ యూనివర్సిటీ భూముల పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి అరాచకాలు చేశారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల కేసును ప్రస్తావిస్తూ.. ఒక్క జింకను చంపిన సల్మాన్ ఖాన్‌ను జైల్లో పెడితే.. మరి నాలుగు జింకలను చంపిన రేవంత్ రెడ్డిని ఏం చేయాలని కేటీఆర్ ప్రశ్నించారు. సందట్లో సడేమియాలా బీజేపీ నేతలు అధికారం కోసం ఆశపడుతున్నారని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ తుఫాన్ ఖాయమని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఎందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వ తప్పులపై ఒక్క మాట కూడా మాట్లాడరని మాజీ మంత్రి కేటీఆర్ నిలదీశారు.

నేషనల్ హెరాల్డ్ కేసు‌పై రేవంత్ మాట్లాడరే…

ఇద్దరు కేంద్రమంత్రులతో తెలంగాణకు ఎలాంటి ఉపయోగం లేదని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. 17నెలల్లో తెలంగాణకు బీజేపీ చేసిన ఒక్క పైసా పని లేదని మండిపడ్డారు. పేరు చెప్పకుండా తాను ఒక బీజేపీ ఎంపీని అంటే గుమ్మడి కాయల దొంగల్లాగా అందరూ భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ను నమ్మి మొన్ననే మోసపోయాం.. ఈసారి బీజేపీని నమ్మితే మళ్లీ మోసపోతామని ప్రజలు భయపడుతున్నారని అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలపై ఈడీ ఛార్జ్ షీట్ పెడితే రేవంత్‌రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డిలది దృఢమైన బంధమని ఆరోపించారు. సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో మోదీ ఎందుకు విచారణ చేయించడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు..

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *