హైదరాబాద్, ఏప్రిల్ 10: హైదరాబాద్ నగర వాసులకు మరో కొత్త ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. సిటీలో ఎక్కడా లేని విధంగా రెండు ఫ్లైఓవర్లపై నుంచి దీన్ని చేపట్టారు. గచ్చిబౌలి ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ వరకు చేపడుతున్న ఫ్లైఓవర్ నిర్మాణం తుదిదశకు చేరుకుంది. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌కు చెక్ పెట్టేలా రూ.200 కోట్లతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
శరవేగంగా పనులు
ఐటీ కారిడార్‌లో వాహనదారులకు త్వరలో కొత్త ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. ఎస్‌ఆర్డీపీ ప్రాజెక్ట్ ద్వారా శిల్పా లేఅవుట్ ఫేజ్ 2 పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. గచ్చిబౌలి అవుటర్ రింగ్ రోడ్డును మొదలుకుని కొండాపూర్ వరకు దాదాపు 1.2 కిలోమీటర్ల మేర చేపట్టిన ఫ్లైఓర్ నిర్మాణ పనులు దాదాపుగా 90 శాతం పూర్తి అయ్యాయి. వచ్చేనెలలో ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించేందుకు ఇప్పటికే జీహెచ్‌ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 1.2 కిలోమీటర్ల మేర, 24 మీటర్ల వెడల్పుతో ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతోంది. రాత్రి, పగలు ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నాయి. కొత్త ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టొచ్చని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు.
ఫ్లైఓవర్ ప్రత్యేకత
ఈ ఫ్లైఓవర్ మల్టీలెవల్ ఫ్లైఓవర్. కింద రెండు ఫ్లైఓవర్లు ఉండగా.. దాని పైనుంచి మూడో ఫ్లైఓవర్‌ను నిర్మించారు. గతంలో ఉన్న గచ్చిబౌలి జంక్షన్ ఫ్లైఓవర్ కింద ఉండగా.. దాని మీద శిల్పా లేఅవుట్ ఫేజ్ 1 ఫ్లైఓవర్ ఉంటుంది. దానిపై ఫేజ్ 2 ఫ్లైఓవర్‌ను కొత్తగా నిర్మించారు. ఈ ప్రాజెక్టును అత్యాధునికమైన టెక్నాలజీని ఉపయోగించి ఇంజనీరింగ్ నిపుణులు ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించారు. ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి వచ్చే వాహనాలు గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్‌లో గంటల తరబడి నిరీక్షించాల్సి ఉంటుంది. అక్కడి నుంచి కొండాపూర్, హఫీజ్‌పేట్ మార్గాల్లో వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఈ కొత్త ఫ్లైఓవర్ అందుబాటులో వస్తే ఆ వాహనాలు అన్నీ ఈ ఫ్లైఓవర్ మీదుగా వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించి దాదాపు మూడేళ్లు అవుతున్నప్పటికీ పనుల్లో పురోగతి రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఫ్లైఓవర్ పనులపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. గడిచిన ఏడాది వ్యవధిలోనే ఈ ఫ్లైఓవర్ పనులు శరవేగంగా ముందుకు సాగాయి..