నిజామాబాద్, ఏప్రిల్ 10: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో షకీల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివిధ కేసుల్లో షకీల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. కొంతకాలంగా ఆయన దుబాయ్‌లోనే ఉంటున్నాయి. అయితే షకీల్ తల్లి అనారోగ్యంతో కన్నుమూశారు. అంత్యక్రియల కోసం షకీల్ హైదరాబాద్‌కు వచ్చారు. మాజీ ఎమ్మెల్యే వస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలోనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయితే తల్లి అంత్యక్రియలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులకు కోరారు మాజీ ఎమ్మెల్యే. దీనికి పోలీసులు అంగీకరించారు. షకీల్ తల్లి అంత్యక్రియలు ముగిసిన వెంటనే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు.
ఇప్పటికే పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో షకీల్‌ను పోలీసులు అరెస్ట్ చేయనున్నారు. ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో పంజాగుట్ట పోలీసులను మేనేజ్ చేసి తన కుమారుడిని కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేశారంటూ షకీల్‌పై గతంలోనే పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీంతో అతనిపై కూడా కేసు నమోదు అయ్యింది. కేసు నమోదు విషయం తెలిసిన షకీల్ ఇండియాకు రాకుండా దుబాయ్‌లోనే ఉండిపోయారు. ఇప్పుడు ఇండియాకు వచ్చాక ఎయిర్‌పోర్టు అధికారులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు అక్కడకు చేరుకుని షకీల్‌ను అరెస్ట్ చేశారు. అయితే తల్లి అంత్యక్రియల కోసం మాజీ ఎమ్మెల్యేకు అనుమతించారు పోలీసులు. ఈరోజు సాయంత్రం షకీల్‌ను అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించే అవకాశం ఉంది..