*తాళ్లరాంపూర్ గ్రామంలో గౌడ సంగం మహిళలను కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొనకుండా అడ్డుకున్న గ్రామాభివృద్ధి కమిటీ .
A9 న్యూస్ ప్రతినిధి:
నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ లో చోటు చేసుకుంది. కొన్ని నెలలుగా గ్రామాభివృద్ధి కమిటీకి, గౌడ సంఘం సభ్యులకు మధ్య వివాదం కొనసాగుతోంది. కాగా, శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా కుంకుమ పూజను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పూజలో పాల్గొనేందుకు గ్రామానికి చెందిన అనేక మంది మహిళలు మంగళహారతులతో వెళ్లారు. గౌడ సంఘానికి చెం దిన మహిళలు కూడా హాజరుకాగా, వారు వెళ్లిపోయేవరకూ పూజా కార్యక్రమం మొదలుపెట్టేది లేదని స్థానిక పురోహితుడి ద్వారా వీడీసీ సభ్యులు చెప్పించారు. మహిళలు అలాగే కూర్చుండగా పూజను ఆరంభించ లేదు. చేసేది లేక గౌడ సంఘం మహిళలు గుడి నుంచి వెనుదిరిగారు. గ్రామం లో ఆలయ నిర్మాణం నుంచి ప్రతి ఏటా శ్రీరామనవమికి ముందు నిర్వహించే కుంకుమ పూజలో తాము ఆనవాయితీగా పాల్గొంటున్నామని మహిళలు వెల్లడించారు. వీడీసీకి, గౌడ సంఘానికి మధ్య వివాదం ఉంటే తమను అం దులోకి లాగి దేవుని సేవకు దూరం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. వీడీసీ సభ్యులపై ఏర్గట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్సై రాము వెల్లడించారు.