*హైదరాబాద్: రాజీవ్ యువవికాసం పథకం కింద దరఖాస్తు చేసేందుకు రేషన్ కార్డు లేదా ఆహార భద్రత కార్డు ఉంటే సరిపోతుందని, ఆదాయ ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సిన అవసరం లేదని బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య బట్టు స్పష్టం చేశారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 7 లక్షల దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తు గడువును ఈ నెల 14వ తేదీ వరకు పొడిగించామని గురువారం ఒక ప్రకటనలో వివరించారు. ‘‘రేషన్‌కార్డు, ఆహార భద్రత కార్డు లేని అభ్యర్థులు మాత్రమే మీసేవ కేంద్రాల ద్వారా జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం నంబరును ఆన్‌లైన్లో నమోదుచేసి దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. 2016 నుంచి మీసేవ కేంద్రాల ద్వారా జారీ అయిన కుల ధ్రువీకరణ పత్రం ఉన్న అభ్యర్థులు ఆ పత్రాల నంబరుతో దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త కుల ధ్రువీకరణ పత్రానికి మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. మండల, మున్సిపల్ కార్యాలయాల్లోని ప్రజాపాలన కేంద్రాల్లో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉన్నాయి’’ అని పేర్కొన్నారు.