*సమాజం కోసం పేద ప్రజల కోసం ఏ పత్రికలు నిజాలు రాయడం లేదు.
ఎ9 న్యూస్ ఏప్రిల్ :
భారతదేశంలో దినపత్రికలు ఏ ఉద్యమానికైనా ఆత్మ లాంటివి.
-డా.బాబాసాహెబ్ అంబేడ్కర్(1940)
డా.బి.ఆర్.అంబేడ్కర్ మరాఠీ భాషలో 1927 ఏప్రిల్ 3 వ తేదీన “బహిష్కృత భారత్” పేరుతో పక్ష పత్రికను ప్రారంభించారు. నిమ్నజాతుల సమస్యలు గురించి చర్చ చేస్తూ ఈ పత్రికలో వ్యాసాలు వెలువడేవి.నిమ్నజాతుల జీవితాలలో ,వారి ఆలోచనా విధానంలో మార్పు తీసుకుని రావాలనే ఉద్ధేశంతో అంబేడ్కర్ ఈ పత్రికను నెలకొల్పడం జరిగింది. వర్ణ వ్యవస్థ అసలు రంగు బయటపెడుతూ వర్ణ వ్యవస్థ ఎంత దారుణంగా అసమానతలు సృష్టించిందీ ,మనుషులను ఎంత దారుణంగా తయారు చేస్తున్నదీ అనేది తెలియచేస్తూ మానసిక వ్యాధి అయిన వర్ణ వ్యవస్థ వలన కలిగే నష్టాలు ఏంటి అనేది హిందువులకు తెలిసి వచ్చేలా చేయాలని అంబేడ్కర్ ఈ పత్రికలో బోధించేవారు.నిమ్నజాతులలో స్వాభిమానం పెంచడానికి, చైతన్యం తెచ్చేందుకు స్వయం సేవను అలవరుచుకోవాలని ,పోరాటం చేయాలని అంబేడ్కర్ బోధిచేవారు.
బ్రాహ్మణీయ శక్తులు తిలక్ నాయకత్వంలో కృత్రిమమైన స్వాతంత్ర్య పోరాటం సాగిస్తున్న రోజులలో డా.బి.ఆర్.అంబేడ్కర్ “బహిష్కృత హితకారిణీ సభ”ను ఏర్పాటు చేశారు.తిలక్ స్వాతంత్ర్యం నా జన్మహక్కు అంటూ బ్రాహ్మణీయ శక్తులు రాజకీయ అధికారం పొందడానికి ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో అంబేడ్కర్ సాంఘిక సమానత్వం నా జన్మహక్కు అంటూ అంటరానితనం నిర్మూలన చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ప్రారంభించారు. అప్పటికే డా.బి.ఆర్.అంబేడ్కర్ “మూక్ నాయక్”,”సరస్వతి విలాస్” పత్రికలు నడుపుతున్నారు.వీటి స్థానంలో “బహిష్కృత భారత్” పేరుతో పత్రికను ప్రారంభించారు.
పశుమాంసం తినడం వలన అంటరాని వారిని ఊరికి దూరంగా ఉంచినట్లు సవర్ణ హిందువులు కుట్రలతో అవివేకంగా మాట్లాడుతుంటారు.దీనిపై అంబేడ్కర్ ఈ పత్రిక ద్వారా పశుమాంసం తిన్న బ్రాహ్మణులు గురించి ఆధారాలతో వ్యాసాలు వ్రాశారు. పశుమాంసం తినడం వలనే నిమ్నజాతుల వారిని అంటరాని వారిగా చూస్తున్నారు అంటున్నారు మరి మహమ్మదీయులు ,తెల్లదొరలు కూడా పశుమాంసం తింటారు వారిని ఎందుకు అంటరాని వారిగా చూడటం లేదని అంబేడ్కర్ సవాల్ చేశారు.అలాగే నిమ్నజాతులలో పశుమాంసం తినని వారు కూడా ఎందరో ఉన్నారు వారిని ఎందుకు అంటరాని వారిగా చూస్తున్నారు అంటూ అంబేడ్కర్ ప్రశ్నించారు. నేడు వైద్యులు చెప్పేది కూడా ప్రపంచంలో కెల్లా పశుమాంసం చాలా శ్రేష్టమైనదని అయినా నేటికీ పశుమాంసం పేరుతో షెడ్యూల్ క్యాస్ట్ ప్రజలను ,నేడు మస్లింలను హింసించడం ఎంతవరకూ సబబు?
ప్రపంచంలో ఎక్కువ శాతం పశుమాంసం తింటారు. మనదేశంలో మాత్రం ఈ పశుమాంసం తింటున్నారు అంటూ ఎస్సీలను ,ముస్లింలను హింసించడం నేటికీ జరుగుతూనే ఉంది.ఇది చాలా అన్యాయం.
వేదాలు, వేదాంగాలలో సైతం బ్రాహ్మణులు, క్షత్రియులు పశుమాంసం తిన్నట్లుగా ఆధారాలు కూడా ఉన్నాయి. యజ్ఞాలు పేరుతో మునులు కూడా పశుమాంసం తిన్నారు. ఆహారం విషయంలో సవర్ణ హిందువులు అనవసరంగా కుట్రతో రాద్ధాంతం చేయడం మూర్ఖత్వం అవుతుంది.
స్వాతంత్ర్యం కోసం హిందువులు, ముస్లింలు ఘర్షణలు పడతారని ,భయంకరమైన రక్తపాతానికి అది దారితీయవచ్చునని ముందుగానే అంబేడ్కర్ ఊహించారు. హిందువులు తోటి అస్పృశ్యులను వేరుగా చూసినట్లైతే ఫలితం తప్పక అనుభవిస్తారని కూడా హెచ్చరించారు.హిందూ ముస్లింలు యొక్క ఐక్యత కోరుతూ అంబేడ్కర్ 1927 జూలై 29 న సంపాదకీయం కూడా వ్రాశారు.1947 లో అంబేడ్కర్ చెప్పినట్లుగానే హిందూ ముస్లింలు మధ్య ఘర్షణ తలెత్తింది.ముస్లింలు, అంటరాని వారు మూడో రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని కూడా ఈ పత్రికలో ఉద్భోదించారు.
నేడు పత్రికలు మనువాద విషపుత్రికలు అన్న చందాన ఉన్నాయి. పత్రికలు అనేవి ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టం చేయడానికి అటు ప్రజలకు – ఇటు ప్రభుత్వానికి మధ్య వారధిలాగ పనిచేయాలి.కానీ నేడు జరుగుతున్నది ఏంటి? దాదాపుగా పత్రికలు నడిపేవాళ్ళే విలువలు అనేవి వదిలేసి డబ్బులే పరమాధిగా నడుపుతున్నారు. బ్లాక్ మెయిల్ చేయడం, ఏదో ఒక దోపిడీ కులానికి కొమ్ముకాయడం, పేదప్రజలను మోసం చేయడం తప్ప సమాజ కోసం ఏ పత్రికలు పనిచేయడం లేదు. పక్షికి రెక్కలు ఎంత అవసరమో మంచి సమాజం కోసం పత్రికలు అవసరం. నేడు పత్రికలను మనువాద అగ్రకుల దోపిడీ, వ్యాపారస్తులే నడుపుతున్నారు.పత్రికలు టి ఆర్ పి రేటింగ్స్ కోసం మాత్రమే నడుపుతున్నారు.